Indian real estate
-
రూ. 1.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. భారత్‌లోకి అమెరికా రియల్ ఎస్టేట్ దిగ్గజం
భారత్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం భారత్‌లో అడుగు పెడుతోంది. మీడియా నివేదికల ప్రకారం యూఎస్ ఆధారిత రియల్ ఎస్టేట్ సంస్థ ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్.. ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ పేరుతో భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ ఇప్పటికే 26 దేశాలలో తన ఉనికిని నెలకొల్పింది. 17,000 ఏజెంట్ల నెట్‌వర్క్‌తో ఖాతాదారులకు రియల్ ఎస్టేట్ సేవలను అందిస్తోంది. ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ అనేది ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ విస్తరణ సంస్థ. ఇది ఇన్విటేషన్ ఓన్లీ (సభ్యులు మాత్రమే) నెట్‌వర్క్‌గా పనిచేస్తుంది. భారత్‌లో ఎంపిక చేసిన నగరాల్లో వ్యాపారం నిర్వహిస్తుంది. విలాసవంతమైన జీవనం కోసం ఒక బెంచ్‌మార్క్‌ని నెలకొల్పడం ద్వారా భారతదేశం అంతటా ప్రత్యేకమైన ఆస్తులతో సంపన్నులు, పెట్టుబడిదారులకు వేదికను ఏర్పాటు చేయడం ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యం. సంపన్నవర్గాలే టార్గెట్ సంస్థ విస్తరణ పట్ల ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ సీఈఓ మైఖేల్ డబ్ల్యూ జల్బర్ట్ సంతోషం వ్యక్తం చేశారు. అల్ట్రా-లగ్జరీ నివాసాలను కోరుకునేవారికి అపరిమిత అవకాశాలను కల్పిస్తామన్నారు. భారత విలాసవంతమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించాడాన్ని గౌరవాన్ని భావిస్తున్నట్లు బోర్డ్ అధిపతి మాట్ బీల్ పేర్కొన్నారు. భారత జనాభాలోని ఎలైట్ సెగ్మెంట్ లక్ష్యంగా భారతీయ రియల్ ఎస్టేట్‌లో లగ్జరీకి కంపెనీ ప్రాతినిధ్యం వహిస్తుందని ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ హెడ్ ఏకే శర్మ తెలిపారు. ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ చేపట్టే ప్రాజెక్ట్‌లలో హిమాచల్ ప్రదేశ్‌లోని పెద్ద ఎస్టేట్లు, ముంబైలోని అరేబియా సముద్రం వీక్షణలతో కూడిన ఉన్నత స్థాయి పెంట్‌హౌస్‌లు వంటి విభిన్న ఎంపికలు ఉండనున్నాయి. న్యూ ఢిల్లీలోని ప్రారంభ ప్రాజెక్ట్‌లో 7 ఎకరాల ప్లాట్‌లో హై-ఎండ్ రిటైల్ స్పేస్‌లు, క్లబ్, విలాసవంతమైన హోటల్ ఉంటాయి. రూ. 1.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ ప్రారంభ వెంచర్లలో ఒకటిగా ముంబైలో 1200 ఎకరాల భూమి అభివృద్ధికి ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ స్థానిక ఆరెంజ్ స్మార్ట్ సిటీ సంస్థతో భాగస్వామ్యం చేసుకుంది. రూ. 1.2 లక్షల కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ 10 లక్షల కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టింది. -
రియల్టీ మార్కెట్ భారీగా విస్తరణ: 2047 నాటికి
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా విస్తరించనుంది. గతేడాది నాటికి ఈ మార్కెట్ 477 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2047 నాటికి 12 రెట్ల వృద్ధితో 5.8 లక్షల కోట్ల డాలర్లకు వృద్ధి చెందుతుందని నరెడ్కో–నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలియజేసింది. ఇండియా రియల్ ఎస్టేట్: విజన్ 2047’ పేరుతో రియల్టర్ల మండలి నరెడ్కో, ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా ఒక నివేదికను విడుదల చేశాయి. (మూన్‌పై ల్యాండ్ ఎలా కొనాలి? ధర తక్కువే! వేద్దామా పాగా!) ప్రస్తుతం దేశ జీడీపీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 7.3 శాతం వాటా కలిగి ఉండగా, 2047 నాటికి 15.5 శాతానికి చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నూరేళ్లకు (2047) దేశ జీడీపీ 33 ట్రిలియన్ డాలర్ల నుంచి 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. నివాస గృహాల మార్కెట్ 299 బిలియన్ డాలర్ల నుంచి 3.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని తెలిపింది. (అయ్యయ్యో.. ఆ శకం ముగుస్తోందా? నిజమేనా?) ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 40 బిలియన్ డాలర్ల నుంచి 473 బిలియన్ డాలర్లకు, వేర్ హౌసింగ్ మార్కెట్ విలువ 2.9 బిలియన్ డాలర్ల నుంచి 34 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని వెల్లడించింది. 2023 సంవత్సంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు క్రితం ఏడాదితో పోలిస్తే 5 శాతం పెరిగి 5.6 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. భారీ అవకాశాలు ‘‘2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా విస్తరించడానికి రియల్ ఎస్టేట్ రంగం చేదోడుగా నిలవనుంది. ఆర్థిక వ్యవస్థ ఎన్నో రెట్లు విస్తరించడంతో అది రియల్ ఎస్టేట్‌లోని అన్ని విభాగాల్లోనూ డిమాండ్‌కు ఊతమిస్తుంది. పెరుగుతున్న అవసరాలు, వినియోగానికి అనుగుణంగా ఎన్నో రెట్లు వృద్ధిని చూస్తుంది’’అని నరెడ్కో ఇండియా ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ వివరించారు. ఆర్థిక వ్యవస్థలో అనుకూల వాతావరణం, మౌలిక రంగ వృద్ధి ప్రణాళికలు ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి దోహదపడతాయని నరెడ్కో వైస్ చైర్మన్ నిరంజన్ హిరనందానీ తెలిపారు. ‘‘వచ్చే 25 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ, రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో రూపాంతరం చూడనున్నాం. అధిక జనాభా, మెరుగైన వ్యాపారం, పెట్టుబడుల వాతావరణం, తయారీ, ఇన్ఫ్రాకు ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు అనుకూలతలు’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. ‘‘కరోనా తర్వాత హౌసింగ్ రంగం మరింత బలంగా, ఆరోగ్యంగా మారింది. విక్రయాలు బలంగా నమోదవుతున్నాయి. ధరలు పెరగడమే కాకుండా, అదే సమయంలో విక్రయం కాని యూనిట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగం బలాన్ని, మెరుగైన భవిష్యత్తును తెలియజేస్తున్నాయి’’అని సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు. -
ఇక్కడ అంతగా బాగాలేదు.. మన ఇండియాలో జాగాలు ఉంటే చూడు!
న్యూఢిల్లీ: ఎన్ఆర్ఐలు భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇటీవలి కాలంలో క్షీణించడం, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం తదితర అంశాలు ఎన్ఆర్ఐలను భారత మార్కెట్లో పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్నాయి. రియల్ ఎస్టేట్‌లోని అన్ని విభాగాల్లోనూ ఎన్ఆర్ఐల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మధ్యస్థాయి, ప్రీమియం, లగ్జరీ విభాగాల్లో వారు పెట్టుబడులకు మందుకు వస్తున్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు ఎన్నో సవాళ్లను విసురుతున్నాయి. కానీ, వృద్ధి పరంగా భారత్ మార్కెట్ సురక్షితమైనది’’అని రియల్ ఎస్టేట్ సంఘం నరెడ్కో వైస్ చైర్మన్, హిరనందాని గ్రూపు ఎండీ అయిన నిరజంన్ హిరనందాని తెలిపారు. 2022లో ఇప్పటి వరకు రూపాయి డాలర్‌తో 5.2 శాతం విలువను కోల్పోయింది. సెంటిమెంట్‌కే పరిమితం కాకుండా ఎన్ఆర్ఐలకు భారత్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంపద వృద్ధికి మంచి మార్గంగా ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ కల్లోల పరిస్థితుల్లో పెట్టుబడుల పరంగా భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ సురక్షితమైనదే కాకుండా, పెట్టుబడుల వృద్ధికి, చక్కని అద్దె ఆదాయానికి వీలు కల్పిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు పెట్టుబడుల ప్రక్రియ డిజిటైజేషన్ కావడం వారికి అనుకూలిస్తున్నట్టు పేర్కొన్నాయి. పెరిగిన విచారణలు.. గత కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల అవకాశాలపై ఎఆర్‌ఐల నుంచి విచారణలు పెరిగినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పెద్ద సంస్థలు, సకాలంలో డెలివరీ చేసే ట్రాక్ రికార్డు ఉన్న వాటికి ఎక్కువ విచారణలు వస్తున్నాయి. ‘‘రూపాయి విలువ క్షీణించడం భారత రియల్టీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఐలకు లభించిన మంచి అవకాశం. అందుకనే వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడులకు సంబంధించి విచారణలు వస్తున్నాయి. ముఖ్యంగా మిడిల్ఈస్ట్ నుంచి ఎక్కువ స్పందన వస్తోంది’’అని కే రహేజా కార్ప్ హోమ్స్ సీఈవో రమేశ్ రంగనాథన్ తెలిపారు. భారత జనాభా ఎక్కువగా ఉండే యూఏఈ, సౌదీ అరేబియా దేశాల నుంచి ఎక్కువ మంది పెట్టుబడులకు ముందుకు వస్తున్నట్టు చెప్పారు. ‘‘గల్ఫ్‌దేశాల్లోని ఎన్ఆర్ఐల నుంచి మాకు ఎక్కువగా విచారణలు వస్తున్నాయి. సంప్రదాయంగా మాకు ఇది బలమైన మార్కెట్. దీనికి అదనంగా సింగపూర్, హాంగ్‌కాంగ్ నుంచి సైతం పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మేము నమోదు చేసిన వ్యాపారంలో 30 శాతం ఈ దేశాల్లోని ఎన్ఆర్ఐల నుంచే వచ్చింది. అలాగే, లండన్, మాల్టా నుంచి సైతం పెట్టుబడులు వచ్చాయి’’అని ఇస్ప్రవ గ్రూపు వ్యవస్థాపకుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దిమాన్‌షా తెలిపారు. -
రియల్ ఎస్టేట్‌లోకి విదేశీ పెట్టుబడుల వరద
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ రంగం విదేశీ ఇన్వెస్టర్లకు కల్పవృక్షంగా మారింది. 2017–21 సంవత్సరాల మధ్య రియల్ ఎస్టేట్ రంగంలోకి 23.9 బిలియన్ డాలర్ల మేర (రూ.1.79 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఐదు సంవత్సరాలతో పోలిస్తే మూడు రెట్లు పెరిగినట్టు కొలియర్స్–ఫిక్కీ నివేదిక తెలిపింది. అమెరికా, కెనడా నుంచి వచ్చిన పెట్టుబడులే 60 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ (రెరా) తీసుకురావడం విదేశీ ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ‘భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు’ పేరుతో ఈ నివేదిక విడుదలైంది. 2016లో నియంత్రణ పరమైన సంస్కరణలను (రెరా) చేపట్టడంతో భారత రియల్టీ పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో సానుకూలత ఏర్పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కొలియర్స్ తెలిపింది. ‘‘పారదర్శకత లేమి వల్ల విదేశీ ఇన్వెస్టర్లు గతంలో భారత రియల్టీ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉండేవారు. 2017 నుంచి ఎంతో ఆశావహంతో పెట్టుబడులు పెట్టడం మొదలైంది’’ అని కొలియర్స్ వివరించింది. పెట్టుబడుల వివరాలు.. 2017–21 కాలంలో భారత రియల్టీలోకి 23.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2012–16 మద్య వచ్చిన పెట్టుబడులు 7.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2012–21 మధ్యలో భారత్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి మొత్తం పెట్టుబడులు 49.4 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఇందులో విదేశీ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన మొత్తం 64 శాతంగా ఉంది. 2017–21 మధ్య విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా 82 శాతానికి పెరిగింది. ఇది అంతకుముందు ఐదేళ్ల కాలంలో 37 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్‌కు పెద్ద పీట రియల్ ఎస్టేట్‌లో విభాగాల వారీగా పరిశీలిస్తే.. 2017–21 మధ్య మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఆఫీస్ స్పేస్ వాటా 43 శాతంగా ఉంది. మిశ్రమ వినియోగ రంగం రెండో స్థానంలో, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ రంగం మూడో స్థానంలో ఉన్నాయి. ఆఫీసు ప్రాజెక్టుల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2017–21 మధ్య ఏటా 2 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి. నివాసిత ప్రాజెక్టుల పట్ల అప్రమత్తత ఎన్బీఎఫ్సీ రంగంలో సంక్షోభం తర్వాత గృహ రంగం పట్ల విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. నివాస ఆస్తుల వాటా మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల ప్రాపర్టీ పెట్టుబడుల్లో 2017–21 మధ్య 11 శాతానికి తగ్గింది. అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఇది 37 శాతంగా ఉండడం విదేశీ ఇన్వెస్టర్ల వైఖరికి అద్దం పడుతోంది. ఆల్టర్నేటివ్ అసెట్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. డేటా సెంటర్ల బూమ్ డేటా స్థానికంగానే నిల్వ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు, డేటా సెంటర్లకు మౌలిక రంగం హోదా తాజాగా కల్పించడం దేశంలో నూతన డేటా సెంటర్ల బూమ్‌కు దారితీస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. -
రూ.75 లక్షల కోట్లకు ప్రాపర్టీ మార్కెట్
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల (రూ.75 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖా కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న డిమాండ్‌కు తోడు, గడిచిన ఏడేళ్లలో చేపట్టిన ఎన్నో సంస్కరణలు (రెరా తదితర) రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి దోహదపడతాయన్నారు. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కూడా 2019 నాటికి ఉన్న 5.5 కోట్ల నుంచి 2030 నాటికి 7 కోట్లకు పెరుగుతుందన్నారు. రియల్టీ రంగంపై సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. నమూనా అద్దెచట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని రాష్ట్రాలను కోరినట్టు మిశ్రా చెప్పారు. ఈ చట్టానికి కేంద్ర కేబినెట్ గత నెలలోనే ఆమోదం తెలియజేసింది. కరోనా రెండు విడతల్లోనూ రియల్ఎస్టేట్ పరిశ్రమపై గట్టి ప్రభావం పడిందన్న ఆయన.. డిమాండ్ తిరిగి కోలుకున్నట్టు చెప్పారు. 2021–22 మొదటి మూడు నెలల్లో (ఈ ఏడాది ఏప్రిల్–జూన్) రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పెరిగినట్టుగా పలు నివేదికలను ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం కీలకమైనదనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు వివరించారు. పట్టణాల్లోని జనాభా ప్రస్తుతమున్న 46 కోట్ల నుంచి 2051 నాటికి 88 కోట్లకు పెరుగుతుందన్నారు. కనుక రియల్ ఎస్టేట్ పరిశ్రమ భారీగా వృద్ధి చెందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అందుబాటులోకి 1,222 ఆక్సిజన్ ప్లాంట్లు ప్రధాన మంత్రి –కేర్స్ నిధి కింద మంజూరు చేసిన 1,222 ప్రెషర్ స్వింగ్ అడ్జార్ప్షన్ (పీఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లు ఆగస్ట్ 15 నాటికి పనిచేయడం మొదలుపెడతాయని మిశ్రా తెలిపారు. కరోనా కారణంగా ఏర్పడిన అవసరాలను భారత్ స్వీయం గా తీర్చుకోవడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఔషధాలను సరఫరా చేసినట్టు చెప్పారు. -
రియల్టీ.. రివ్వు రివ్వు!!
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ రంగం ఈ ఏడాది జనవరి– మార్చి మధ్య భారీ పెట్టుబడులను ఆకర్షించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే పెట్టుబడులు రూ.16,528 కోట్ల నుంచి రూ.17,682 కోట్లకు... అంటే 7 శాతం పెరిగాయి. దీన్లో విదేశీ పెట్టుబడులే ఏకంగా 81 శాతం పెరిగి రూ.6,260 కోట్ల నుంచి రూ.11,338 కోట్లకు చేరినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ– కుష్మన్– వేక్ఫీల్డ్ (సీడబ్ల్యూ) తన తాజా నివేదికలో తెలియజేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... ►కమర్షియల్ అసెట్స్‌లోకి విదేశీ పెట్టుబడులు భారీగా రావడం ఈ రంగానికి కలిసొచ్చింది. ►ఆఫీస్, రిటైల్ విభాగాలు భారీగా పెట్టుబడులను ఆకర్షించాయి. ►గోడౌన్లు, లాజిస్టిక్స్ విభాగాలూ ఇన్వెస్టర్లకు చక్కటి అవకాశాలు కల్పించాయి. ►విజయవంతమైన మొట్టమొదటి రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) స్టాక్ మార్కెట్ లిస్టింగ్ ఈ రంగానికి మున్ముందు సానుకూలంగా ఉండనుంది. ►అయితే హౌసింగ్ రంగానికి పెట్టుబడులు 57 శాతం తగ్గాయి. ఈ విలువ రూ.8,518 కోట్ల నుంచి రూ.3,697 కోట్లకు తగ్గింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి ద్రవ్య సరఫరాల పరంగా వచ్చిన సమస్యలు ఇందుకు ప్రధాన కారణంగా నిలిచాయి. నిజానికి గడచిన నాలుగేళ్లుగా ఈ విభాగంలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) ఇబ్బందులున్నాయి. ► ఆఫీస్ ప్రాపర్టీల్లో పెట్టుబడి విలువ రూ.6,100 కోట్ల నుంచి రూ.7,925 కోట్లకు చేరింది. ► ఆతిథ్య రంగానికి సంబంధించి రియల్టీ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగి రూ.1,200 కోట్ల నుంచి రూ.3,950 కోట్లకు ఎగశాయి. ► రిటైల్ రియల్ ఎస్టేట్‌లోకి పెట్టుబడులు రూ. 250 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు ఎగశాయి. ►పారిశ్రామిక రంగానికి సంబంధించి (వేర్‌హౌస్, లాజిస్టిక్స్) రంగంలో పెట్టుబడులు రూ.350 కోట్ల నుంచి రూ.760 కోట్లకు చేరాయి. స్నేహపూర్వక పెట్టుబడి విధానాలు భారత్ రియల్ ఎస్టేట్ రంగం పట్ల సానుకూల స్పందన వస్తోందనడానికి జనవరి–మార్చి గణాంకాలను పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఇక్కడ విదేశీ ఇన్వెస్టర్ల పాత్రను ప్రస్తావించుకోవాలి. దేశంలో నెలకొన్న పారదర్శక, స్నేహపూర్వక పెట్టుబడుల విధానాలు దీనికి కారణమని భావించవచ్చు. – అన్షుజైన్, సీడబ్ల్యూ ఇండియా కంట్రీ హెడ్ First quarter investments in Indian Realty at decade-high of $2.5 billion -
క్రెడాయ్ తెలంగాణ కొత్త కార్యవర్గం
సాక్షి, హైదరాబాద్: భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ కొత్త కార్యవర్గం ఎంపికైంది. – 2017–19 సంవత్సరానికి గాను అధ్యక్షుడిగా గుమ్మి రాంరెడ్డి, జనరల్ సెక్రటరీగా చెరుకు రామచంద్రా రెడ్డిలు తిరిగి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా ఏ ఆనంద్ రావు (కరీంనగర్), కొప్పు నరేష్ కుమార్ (ఖమ్మం), టీ వెంకటేశ్వర్లు (వరంగల్), ట్రెజరర్‌గా కే ఇంద్రసేనా రెడ్డి నియమితులయ్యారు. ఖమ్మంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో జీ రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కొత్తగూడెం చాప్టర్లున్నాయని, రెండేళ్లలో మరో 6 చాప్టర్లను ప్రారంభించాలని లక్ష్యించామని చెప్పారు. వచ్చే నెలలో కామారెడ్డి, మంచిర్యాలలో చాప్టర్లను ప్రారంభించనున్నామన్నారు. జిల్లాల్లో నూ జీఎస్టీ, రెరా వంటి వాటిపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు. జనరల్ సెక్రటరీ రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణలో 550 మంది డెవలపర్లు సభ్యులుగా ఉన్నారని.. ప్రతి పట్టణంలోనూ చాప్టర్లను తెరవనున్నట్లు చెప్పారు. నైపుణ్య అభివృద్ధి, క్లీన్ సిటీ వంటి కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలోనూ ప్రారంభించనున్నట్లు చెప్పుకొచ్చారు. క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడిగా ఎస్ రాంరెడ్డి క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడిగా ఎస్ రాంరెడ్డి, జనరల్ సెక్రటరీగా పీ రామకృష్ణా రావులు తిరిగి ఎంపికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా జీ ఆదిత్య, జీ ఆనంద్ రెడ్డి, ఎస్ ఆనంద్ రావు, డీ మురళీ కృష్ణా రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా సీజీ మురళీ మోహన్, వీ రాజశేఖర్ రెడ్డి, ట్రెజరర్‌గా కే రాజేశ్వర్‌లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎస్ రాంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసే క్రమంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోందని.. అందుకే అంతర్జాతీయ కంపెనీలు నగరం వేదికగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొస్తున్నాయని ఆయన కొనియాడారు. నిర్మాణ రంగంలోని సమస్యలను తొలగించేందుకూ సంఘాలతో చర్చించడం ముదావహమని’’ చెప్పుకొచ్చారు.