![Property market to touch USD 1 trillion by 2030 - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/22/INDIA-REAL-ESTATE.jpg.webp?itok=YLixme7c)
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల (రూ.75 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖా కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న డిమాండ్‌కు తోడు, గడిచిన ఏడేళ్లలో చేపట్టిన ఎన్నో సంస్కరణలు (రెరా తదితర) రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి దోహదపడతాయన్నారు. ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కూడా 2019 నాటికి ఉన్న 5.5 కోట్ల నుంచి 2030 నాటికి 7 కోట్లకు పెరుగుతుందన్నారు. రియల్టీ రంగంపై సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. నమూనా అద్దెచట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని రాష్ట్రాలను కోరినట్టు మిశ్రా చెప్పారు. ఈ చట్టానికి కేంద్ర కేబినెట్ గత నెలలోనే ఆమోదం తెలియజేసింది.
కరోనా రెండు విడతల్లోనూ రియల్‌ఎస్టేట్ పరిశ్రమపై గట్టి ప్రభావం పడిందన్న ఆయన.. డిమాండ్ తిరిగి కోలుకున్నట్టు చెప్పారు. 2021–22 మొదటి మూడు నెలల్లో (ఈ ఏడాది ఏప్రిల్–జూన్) రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పెరిగినట్టుగా పలు నివేదికలను ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం కీలకమైనదనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు వివరించారు. పట్టణాల్లోని జనాభా ప్రస్తుతమున్న 46 కోట్ల నుంచి 2051 నాటికి 88 కోట్లకు పెరుగుతుందన్నారు. కనుక రియల్ ఎస్టేట్ పరిశ్రమ భారీగా వృద్ధి చెందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
అందుబాటులోకి 1,222 ఆక్సిజన్ ప్లాంట్లు
ప్రధాన మంత్రి –కేర్స్ నిధి కింద మంజూరు చేసిన 1,222 ప్రెషర్ స్వింగ్ అడ్జార్ప్‌షన్ (పీఎస్‌ఏ) ఆక్సిజన్ ప్లాంట్లు ఆగస్ట్ 15 నాటికి పనిచేయడం మొదలుపెడతాయని మిశ్రా తెలిపారు. కరోనా కారణంగా ఏర్పడిన అవసరాలను భారత్ స్వీయం గా తీర్చుకోవడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఔషధాలను సరఫరా చేసినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment