రూ. 1.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. భారత్‌లోకి అమెరికా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం | Sakshi
Sakshi News home page

రూ. 1.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. భారత్‌లో అడుగు పెడుతున్న అమెరికా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం

Published Fri, Jan 26 2024 9:20 PM

Forbes Global Properties announces debut in Indian real estate market - Sakshi

భారత్‌లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం భారత్‌లో అడుగు పెడుతోంది. మీడియా నివేదికల ప్రకారం యూఎస్‌ ఆధారిత రియల్ ఎస్టేట్ సంస్థ ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్.. ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ పేరుతో భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించనుంది.

ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ ఇప్పటికే 26 దేశాలలో తన ఉనికిని నెలకొల్పింది. 17,000 ఏజెంట్ల నెట్‌వర్క్‌తో ఖాతాదారులకు రియల్ ఎస్టేట్ సేవలను అందిస్తోంది. ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ అనేది ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ విస్తరణ సంస్థ. ఇది ఇన్విటేషన్‌ ఓన్లీ (సభ్యులు మాత్రమే) నెట్‌వర్క్‌గా పనిచేస్తుంది. భారత్‌లో ఎంపిక చేసిన నగరాల్లో వ్యాపారం నిర్వహిస్తుంది. విలాసవంతమైన జీవనం కోసం ఒక బెంచ్‌మార్క్‌ని నెలకొల్పడం ద్వారా భారతదేశం అంతటా ప్రత్యేకమైన ఆస్తులతో సంపన్నులు, పెట్టుబడిదారులకు వేదికను ఏర్పాటు  చేయడం ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యం.

సంపన్నవర్గాలే టార్గెట్‌ 
సంస్థ విస్తరణ పట్ల ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ సీఈఓ మైఖేల్ డబ్ల్యూ జల్బర్ట్ సంతోషం వ్యక్తం చేశారు. అల్ట్రా-లగ్జరీ నివాసాలను కోరుకునేవారికి అపరిమిత అవకాశాలను కల్పిస్తామన్నారు. భారత విలాసవంతమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించాడాన్ని గౌరవాన్ని భావిస్తున్నట్లు బోర్డ్ అధిపతి మాట్ బీల్ పేర్కొన్నారు. భారత జనాభాలోని ఎలైట్ సెగ్మెంట్‌ లక్ష్యంగా భారతీయ రియల్ ఎస్టేట్‌లో లగ్జరీకి కంపెనీ ప్రాతినిధ్యం వహిస్తుందని ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ హెడ్‌ ఏకే శర్మ తెలిపారు.

ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ చేపట్టే ప్రాజెక్ట్‌లలో హిమాచల్ ప్రదేశ్‌లోని పెద్ద ఎస్టేట్‌లు, ముంబైలోని అరేబియా సముద్రం వీక్షణలతో కూడిన ఉన్నత స్థాయి పెంట్‌హౌస్‌లు వంటి విభిన్న ఎంపికలు ఉండనున్నాయి. న్యూ ఢిల్లీలోని ప్రారంభ ప్రాజెక్ట్‌లో 7 ఎకరాల ప్లాట్‌లో హై-ఎండ్ రిటైల్ స్పేస్‌లు, క్లబ్, విలాసవంతమైన హోటల్ ఉంటాయి. 

రూ. 1.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్
ప్రారంభ వెంచర్లలో ఒకటిగా ముంబైలో 1200 ఎకరాల భూమి అభివృద్ధికి ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ స్థానిక ఆరెంజ్ స్మార్ట్ సిటీ సంస్థతో భాగస్వామ్యం చేసుకుంది. రూ. 1.2 లక్షల కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌ 10 లక్షల కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టింది.

Advertisement
Advertisement