న్యూఢిల్లీ: ఎన్‌ఆర్‌ఐలు భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇటీవలి కాలంలో క్షీణించడం, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం తదితర అంశాలు ఎన్‌ఆర్‌ఐలను భారత మార్కెట్‌లో పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్నాయి. రియల్ ఎస్టేట్‌లోని అన్ని విభాగాల్లోనూ ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మధ్యస్థాయి, ప్రీమియం, లగ్జరీ విభాగాల్లో వారు పెట్టుబడులకు మందుకు వస్తున్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు ఎన్నో సవాళ్లను విసురుతున్నాయి.
కానీ, వృద్ధి పరంగా భారత్ మార్కెట్ సురక్షితమైనది’’అని రియల్ ఎస్టేట్ సంఘం నరెడ్కో వైస్ చైర్మన్, హిరనందాని గ్రూపు ఎండీ అయిన నిరజంన్ హిరనందాని తెలిపారు. 2022లో ఇప్పటి వరకు రూపాయి డాలర్‌తో 5.2 శాతం విలువను కోల్పోయింది. సెంటిమెంట్‌కే పరిమితం కాకుండా ఎన్‌ఆర్‌ఐలకు భారత్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంపద వృద్ధికి మంచి మార్గంగా ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ కల్లోల పరిస్థితుల్లో పెట్టుబడుల పరంగా భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ సురక్షితమైనదే కాకుండా, పెట్టుబడుల వృద్ధికి, చక్కని అద్దె ఆదాయానికి వీలు కల్పిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు పెట్టుబడుల ప్రక్రియ డిజిటైజేషన్ కావడం వారికి అనుకూలిస్తున్నట్టు పేర్కొన్నాయి.
పెరిగిన విచారణలు..
గత కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల అవకాశాలపై ఎఆర్‌ఐల నుంచి విచారణలు పెరిగినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పెద్ద సంస్థలు, సకాలంలో డెలివరీ చేసే ట్రాక్ రికార్డు ఉన్న వాటికి ఎక్కువ విచారణలు వస్తున్నాయి. ‘‘రూపాయి విలువ క్షీణించడం భారత రియల్టీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్‌ఆర్‌ఐలకు లభించిన మంచి అవకాశం. అందుకనే వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐల నుంచి పెట్టుబడులకు సంబంధించి విచారణలు వస్తున్నాయి. ముఖ్యంగా మిడిల్‌ఈస్ట్ నుంచి ఎక్కువ స్పందన వస్తోంది’’అని కే రహేజా కార్ప్ హోమ్స్ సీఈవో రమేశ్ రంగనాథన్ తెలిపారు.
భారత జనాభా ఎక్కువగా ఉండే యూఏఈ, సౌదీ అరేబియా దేశాల నుంచి ఎక్కువ మంది పెట్టుబడులకు ముందుకు వస్తున్నట్టు చెప్పారు. ‘‘గల్ఫ్‌దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐల నుంచి మాకు ఎక్కువగా విచారణలు వస్తున్నాయి. సంప్రదాయంగా మాకు ఇది బలమైన మార్కెట్. దీనికి అదనంగా సింగపూర్, హాంగ్‌కాంగ్ నుంచి సైతం పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మేము నమోదు చేసిన వ్యాపారంలో 30 శాతం ఈ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐల నుంచే వచ్చింది. అలాగే, లండన్, మాల్టా నుంచి సైతం పెట్టుబడులు వచ్చాయి’’అని ఇస్ప్రవ గ్రూపు వ్యవస్థాపకుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దిమాన్‌షా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment