మీడియా సమావేశంలో మాట్లాడుతున్న క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రామకృష్ణరావు. చిత్రంలో ఇతర సంఘాల ప్రతినిధులు..
సాక్షి, హైదరాబాద్: మార్కెట్ రేటు కంటే తక్కువ ధర అని సామాన్య ప్రజలకు ఆశ చూపిస్తూ.. తనది కాని స్థలంలో ఆకాశ హార్మ్యాలను నిర్మిస్తానని నమ్మబలుకుతూ కొనుగోలుదారులను నట్టేట ముంచుతున్న బిల్డర్లకు కంచె వేయాలని డెవలపర్ల సంఘాలు ముక్త కంఠంతో కోరాయి. అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) కింద విక్రయాలను చేపడుతున్న ప్రాజెక్ట్‌లకు అనుమతులను, రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సూచించా రు.
బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు ఆయా ప్రాజెక్ట్‌లకు రుణాలను మంజూరు చేయవద్దని కోరాయి. నిర్మాణ రంగానికి భద్రత, భరోసా కల్పించకపోతే గ్లోబల్ హైదరాబాద్ ఎదుగుదలకు యూడీఎస్ డెవలపర్లు విరోధంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్‌ఎండీఏ, రెరాలకు శాశ్వత కమిషనర్లను నియమించడంతో పాటు ఉద్యోగుల సంఖ్యను పెంచాలని, ప్రజలలో విస్తృతమైన అవగాహన చేపట్టాలని సూచించారు. శుక్రవారం క్రెడాయ్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ సంఘాల సమావేశం జరిగింది.
► గతంలో చైనా కంపెనీలు పోన్జీ స్కీమ్‌లతో ఎలాగైతే అమాయక కస్టమర్ల నుంచి కోట్ల రూపాయాలను కొల్లగొట్టాయో.. అదే విధంగా యూడీఎస్ విక్రయాలతో కొందరు డెవలపర్లు తయారయ్యారని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణా రావు ఆరోపించారు. ప్రారంభ దశలోనే ఆయా డెవలపర్లను ఆడ్డుకోకపోతే సామాన్య, మధ్యతరగతి ప్రజల పెట్టుబడులు గాల్లో కలిసిపోతాయని తెలిపారు. గత ఏడాదిన్నర క్రితం ఒకట్రెండు యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసిన కస్టమర్లు నిర్మాణ పనులు ప్రారంభం కాక, కట్టిన డబ్బులూ వెనక్కి ఇవ్వకపోవటంతో రోజూ డెవలపర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. సంఘటిత నిర్మాణ రంగానికి యూడీఎస్ ఒక కేన్సర్ మహమ్మారి లాగా తయారవుతోందని... దీన్ని ప్రాథమిక దశలోనే నిర్మూలించాలి. లేకపోతే ఝాడ్యం ముదిరి బ్రాండ్ హైదరాబాద్‌ను దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు.
► హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, రెరా నిబంధనల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయడమే పరమావధిగా యూడీఎస్ ప్రాజెక్ట్‌లు చేపట్టడుతున్నారు. మార్కెట్ రేటు కంటే 50 శాతం తక్కువ ధరకు ఆఫర్ చేస్తుండటంతో కస్టమర్లు ఆశ పడుతున్నారు. ముందు వెనకా ఆలోచించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. నిర్మాణ అనుమతులు రాకపోయినా, ఆయా స్థలానికి న్యాయపరమైన సమస్యలు ఎదురైనా లేదా సంబంధిత భూమి కన్జర్వేషన్ జోన్ లేదా 111 జీవో పరిధిలో ఉన్నా నిర్మాణ అనుమతులు రావు. కస్టమర్ల పెట్టుబడులకు భరోసా లేదు. భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలకు తామూ బాధ్యత వహించాల్సి వస్తుందని కొనుగోలుదారులకు అర్థం కావట్లేదు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా కొనుగోలుదారులు మోసపోయామని తెలుసుకొని వినియోగదారుల ఫోరంకు, రెరాకు వెళ్లినా లాభం ఉండదు. సివిల్ కోర్ట్‌కు పోతే ఎన్నేళ్లు పడుతుందో బహిరంగ రహస్యమే.
► గృహ కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించాలనే ఉద్దేశంలో రెరా చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, మన రాష్ట్రంలో రెరా అమలు అంతంత మాత్రంగానే సాగుతోందని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి అన్నారు. హైదరాబాద్ మార్కెట్లో 60–70 శాతం కొనుగోళ్లు అంతిమ గృహ కొనుగోలుదారులు, 30–40 శాతం పెట్టుబడిదారులుంటారు. ఇలాంటి చోట కస్టమర్ల పెట్టుబడులకు భద్రత కల్పించాల్సిన రెరా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అక్రమ పద్దతిలో నిర్మాణాలు, విక్రయాలు చేపడుతున్న డెవలపర్లను ఎలా నియంత్రించాలనే అంశంపై ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు డెవలపర్ల సంఘాలు ప్రభుత్వంతో కలిసి వస్తాయని తెలిపారు.
► రెరాలో డెవలపర్లే కాదు కొనుగోలుదారులకు శిక్ష ఉంటుంది. భవిష్యత్తులో ఏమైనా జరిగితే కోర్ట్‌కు వెళ్లినా లాభం ఉండదు. రెరాలో నమోదు కాని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేయాలన్న ప్రాథమిక నిబంధనలను మరిచిపోయి తక్కువ ధర అని ఆశ పడి యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసినందుకు మీకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల ఫోరం, రెరా న్యాయం చేయవని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీకృష్ణా రెడ్డి తెలిపారు. సామాన్య, మధ్యతరగతి నుంచి ముందస్తు సొమ్ము వసూలు చేసి.. అక్రమ డెవలపర్లు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు.
ఎవరు చేస్తున్నారో చెప్పరు!
యూడీఎస్, ప్రీలాంచ్‌లలో కొనుగోలు చేయొద్దని, కష్టార్జితాన్ని బూదిదపాలు చేసుకోవద్దని కొనుగోలుదారులకు డెవలపర్ల సంఘాలు సూచిస్తుండటం ప్రశంసించదగ్గ పరిణామమే. కానీ, ఆయా ప్రాజెక్ట్‌లను ఎవరు చేపడుతున్నారో తెలపమని విలేకరులు ప్రశ్నించగా.. ప్రమోటర్ల పేర్లు బయటకు రాకుండా ఏజెంట్లతో దందా నడిపిస్తున్నారని సమాధానం ఇచ్చారు. వాట్సాప్, ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సాధారణంగా సంఘటిత డెవలపర్లకు ఏజెంట్లకు 1.5–2 శాతం కమీషన్ ఇస్తుంటే.. యూడీఎస్ డెవలపర్లు మాత్రం 5–10 శాతం కమీషన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో వివరాలు ఉన్నాయని, కానీ, చర్యలు తీసుకోవటంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఆడిట్ బుక్స్ పరిశీలిస్తే తతంగం బయటపడుతుందని పేర్కొన్నారు. డెవలపర్ల సంఘాల దృష్టికి వచ్చిన యూడీఎస్ ఏజెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి, ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తదితరలు పాల్గొన్నారు.
► జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెరా కార్యాలయాలలో ఇన్ఫర్మేషన్ గైడెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. గృహ కొనుగోలుకు ముందు కొనుగోలుదారులు ఆయా కేంద్రాలను సంప్రదిస్తే.. వారికి మార్గనిర్ధేశనం చేయాలని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు సూచించారు. దీంతో అమాయక ప్రజలు మోసపోకుండా ఉండటంతో పాటు ప్రభుత్వం, నిర్మాణ సంస్థలతో నమ్మకం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కన్జర్వేషన్ జోన్, 111 జీవో పరిధిలోనూ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని దీంతో హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం ఏర్పడుతుందని తెలిపారు. హైదరాబాద్ గ్రోత్ రేట్‌ను అంచనా వేయకుండా నిర్మాణ రంగంలో ఏమాత్రం అనుభవం లేకుండా ఆకాశంలో మేడలు కడతామని ఆశచూపిస్తూ అమాయకులను కలలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.
► చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకొని కొందరు డెవలపర్లు అక్రమంగా ప్రాజెక్ట్‌లు, విక్రయాలు చేపడుతున్నారు. తక్కువ ధర అని ఆశ చూపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. సంఘటిత నిర్మాణ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డెవలపర్లపై కూడా ఉందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ప్రెసిడెంట్ సీ ప్రభాకర్‌రావు అన్నారు. అందుకే యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన చేపట్టనున్నామని పేర్కొన్నారు.
► నోయిడా, గ్రేటర్ నోయిడాలో విక్రయించిన యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో ధర మార్కెట్ రేటుతో సమానంగా విక్రయించారు. అయినా సరే అక్కడ నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారు. అలాంటిది మన దగ్గర మార్కెట్ రేటు కంటే సగం ధరకే యూడీఎస్ స్కీమ్‌లో విక్రయాలు చేపడుతున్నారు. మరి, ఇక్కడెలా నిర్మాణాలు చేయగలరనేది కొనుగోలుదారులు ప్రశ్నించుకోవాలని ట్రెడా ప్రెసిడెంట్ ఆర్ చలపతిరావు అన్నారు.
చిన్న వస్తువును కొంటే ఐఎస్‌ఐ మార్క్ ఉందా? బ్రాండెడేనా అనా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకునే ఈ రోజుల్లో.. లక్షల్లో వెచ్చించే గృహ కొనుగోలు సమయంలో డెవలపర్ చరిత్ర, నిర్మాణ అనుమతులు, రెరా నమోదు వంటి కీలక అంశాలు పరిశీలించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. రిస్క్ లేని చోట పది గజాలు తక్కువైనా మంచిది గడువు లోగా నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశం చేసే వీలుంటుందని పేర్కొన్నారు. ఓపెన్‌స్పేస్, పార్క్‌లు, సెట్‌బ్యాక్స్, పర్మిషన్స్, అంతస్తుల సంఖ్య.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కొనుగోలుకు ముందే పరిశీలించుకోవాలని సూచించారు. ఎకరం రూ.50 కోట్లు ఉంటే 50 అంతస్తులు, రూ.40 కోట్లు ఉంటే 40 ఫ్లోర్లు.. ఇలా ఎంత రేటు ఉంటే అన్ని అంతస్తులు నిర్మిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కొనుగోలుదారులు రేటు తక్కువ చూపించేందుకే ఈ అసత్య ప్రచారమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment