TBF
-
ఎల్లుండి నిర్మాణ పనులు బంద్
సాక్షి, హైదరాబాద్: సిమెంట్, స్టీల్, అల్యూమి నియం, పీవీసీ పైపులు వంటి అన్ని రకాల నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలను అన్ని డెవలపర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ధరల పెరుగుదలకు నిరసనగా ఈనెల 4న (సోమవారం) హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్క రోజు నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ధరలు పెరగడం వల్ల నగదు ప్రవాహానికి ఇబ్బందిగా మారడంతో పాటు డెవలపర్లకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య కూడా వస్తుందని సంఘాలు ముక్తకంఠంతో తెలిపాయి. నిర్మాణ వ్యయాలు గణనీయంగా పెరగడం వల్ల 600కు పైగా డెవలపర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో గృహాల ధరలు 10–15 శాతం మేర పెరుగుతాయని తెలిపాయి. క్రెడాయ్, ట్రెడా , టీబీఎఫ్, టీడీఏ ప్రతినిధులు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అనిశ్చితి పరిస్థితులలో కొంతమంది బిల్డర్లు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను ఆపేశారని, ముడి పదార్థాల ధరలు తగ్గిన తర్వాత ప్రాజెక్ట్‌లను పునః ప్రారంభించడానికి యోచిస్తున్నారన్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఉపాధి రంగమైన స్థిరాస్తి రంగంలో నిర్మాణ పనులను నిలిపివేస్తే.. ఈ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్ధ వృద్ధిపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లపై ఇన్పుట్ ట్యాక్స్ తగ్గించడంతో పాటు జీఎస్టీని సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. నిర్మాణ రంగ ముడి పదార్థాల ప్రస్తుత ధరలను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీ కృష్ణారెడ్డి, హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. వీళ్లేమన్నారంటే.. ► తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అధ్యక్షులు సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇన్పుట్ వ్యయాలు పెరగడం, మార్జిన్లు తగ్గడంతో డెవలపర్లకు ఆర్థిక కష్టాలు పెరిగాయి. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల నేపథ్యంలో డెవలపర్లకు ప్రస్తుత ప్రాజెక్ట్‌లలో ధరలు పెంచడం మినహా వేరే అవకాశం లేదని ఆయన తెలిపారు. ► తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) అధ్యక్షులు సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. మార్కెట్లో తిరిగి సానుకూల వాతావరణం నెలకొనాలంటే.. కేంద్ర జీఎస్టీ రేట్లను తగ్గించి ఇన్పుట్ క్రెడిట్‌ను అందించాలని, అలాగే రాష్ట్ర ప్రభు త్వం స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్నారు. ► తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు మాట్లాడుతూ.. ఇన్పుట్ వ్యయం పెరిగిన నేపథ్యంలో డెవలపర్లు ధరలను పెంచక తప్పదని అయితే ఈ పెంపు అన్ని రకాల గృహాలపై పడుతుందన్నారు. పర్సంటేజీ పరంగా చూస్తే అందుబాటు ధరల విభాగంలోని గృహాలపై ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందన్నారు. -
చైనా పోన్జీ స్కీముల తరహాలో.. హైదరాబాద్‌లో మోసాలు.. డెవలపర్ల సంఘం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మార్కెట్ రేటు కంటే తక్కువ ధర అని సామాన్య ప్రజలకు ఆశ చూపిస్తూ.. తనది కాని స్థలంలో ఆకాశ హార్మ్యాలను నిర్మిస్తానని నమ్మబలుకుతూ కొనుగోలుదారులను నట్టేట ముంచుతున్న బిల్డర్లకు కంచె వేయాలని డెవలపర్ల సంఘాలు ముక్త కంఠంతో కోరాయి. అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) కింద విక్రయాలను చేపడుతున్న ప్రాజెక్ట్‌లకు అనుమతులను, రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సూచించా రు. బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు ఆయా ప్రాజెక్ట్‌లకు రుణాలను మంజూరు చేయవద్దని కోరాయి. నిర్మాణ రంగానికి భద్రత, భరోసా కల్పించకపోతే గ్లోబల్ హైదరాబాద్ ఎదుగుదలకు యూడీఎస్ డెవలపర్లు విరోధంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ, రెరాలకు శాశ్వత కమిషనర్లను నియమించడంతో పాటు ఉద్యోగుల సంఖ్యను పెంచాలని, ప్రజలలో విస్తృతమైన అవగాహన చేపట్టాలని సూచించారు. శుక్రవారం క్రెడాయ్, ట్రెడా, టీబీఎఫ్, టీడీఏ సంఘాల సమావేశం జరిగింది. ► గతంలో చైనా కంపెనీలు పోన్జీ స్కీమ్‌లతో ఎలాగైతే అమాయక కస్టమర్ల నుంచి కోట్ల రూపాయాలను కొల్లగొట్టాయో.. అదే విధంగా యూడీఎస్ విక్రయాలతో కొందరు డెవలపర్లు తయారయ్యారని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణా రావు ఆరోపించారు. ప్రారంభ దశలోనే ఆయా డెవలపర్లను ఆడ్డుకోకపోతే సామాన్య, మధ్యతరగతి ప్రజల పెట్టుబడులు గాల్లో కలిసిపోతాయని తెలిపారు. గత ఏడాదిన్నర క్రితం ఒకట్రెండు యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసిన కస్టమర్లు నిర్మాణ పనులు ప్రారంభం కాక, కట్టిన డబ్బులూ వెనక్కి ఇవ్వకపోవటంతో రోజూ డెవలపర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. సంఘటిత నిర్మాణ రంగానికి యూడీఎస్ ఒక కేన్సర్ మహమ్మారి లాగా తయారవుతోందని... దీన్ని ప్రాథమిక దశలోనే నిర్మూలించాలి. లేకపోతే ఝాడ్యం ముదిరి బ్రాండ్ హైదరాబాద్‌ను దెబ్బ తీస్తుందని పేర్కొన్నారు. ► హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెరా నిబంధనల గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయడమే పరమావధిగా యూడీఎస్ ప్రాజెక్ట్‌లు చేపట్టడుతున్నారు. మార్కెట్ రేటు కంటే 50 శాతం తక్కువ ధరకు ఆఫర్ చేస్తుండటంతో కస్టమర్లు ఆశ పడుతున్నారు. ముందు వెనకా ఆలోచించుకోకుండా కొనుగోలు చేస్తున్నారు. నిర్మాణ అనుమతులు రాకపోయినా, ఆయా స్థలానికి న్యాయపరమైన సమస్యలు ఎదురైనా లేదా సంబంధిత భూమి కన్జర్వేషన్ జోన్ లేదా 111 జీవో పరిధిలో ఉన్నా నిర్మాణ అనుమతులు రావు. కస్టమర్ల పెట్టుబడులకు భరోసా లేదు. భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలకు తామూ బాధ్యత వహించాల్సి వస్తుందని కొనుగోలుదారులకు అర్థం కావట్లేదు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా కొనుగోలుదారులు మోసపోయామని తెలుసుకొని వినియోగదారుల ఫోరంకు, రెరాకు వెళ్లినా లాభం ఉండదు. సివిల్ కోర్ట్‌కు పోతే ఎన్నేళ్లు పడుతుందో బహిరంగ రహస్యమే. ► గృహ కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించాలనే ఉద్దేశంలో రెరా చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ, మన రాష్ట్రంలో రెరా అమలు అంతంత మాత్రంగానే సాగుతోందని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి అన్నారు. హైదరాబాద్ మార్కెట్లో 60–70 శాతం కొనుగోళ్లు అంతిమ గృహ కొనుగోలుదారులు, 30–40 శాతం పెట్టుబడిదారులుంటారు. ఇలాంటి చోట కస్టమర్ల పెట్టుబడులకు భద్రత కల్పించాల్సిన రెరా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అక్రమ పద్దతిలో నిర్మాణాలు, విక్రయాలు చేపడుతున్న డెవలపర్లను ఎలా నియంత్రించాలనే అంశంపై ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు డెవలపర్ల సంఘాలు ప్రభుత్వంతో కలిసి వస్తాయని తెలిపారు. ► రెరాలో డెవలపర్లే కాదు కొనుగోలుదారులకు శిక్ష ఉంటుంది. భవిష్యత్తులో ఏమైనా జరిగితే కోర్ట్‌కు వెళ్లినా లాభం ఉండదు. రెరాలో నమోదు కాని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేయాలన్న ప్రాథమిక నిబంధనలను మరిచిపోయి తక్కువ ధర అని ఆశ పడి యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసినందుకు మీకు జరిగిన నష్టాన్ని వినియోగదారుల ఫోరం, రెరా న్యాయం చేయవని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీకృష్ణా రెడ్డి తెలిపారు. సామాన్య, మధ్యతరగతి నుంచి ముందస్తు సొమ్ము వసూలు చేసి.. అక్రమ డెవలపర్లు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. ఎవరు చేస్తున్నారో చెప్పరు! యూడీఎస్, ప్రీలాంచ్లలో కొనుగోలు చేయొద్దని, కష్టార్జితాన్ని బూదిదపాలు చేసుకోవద్దని కొనుగోలుదారులకు డెవలపర్ల సంఘాలు సూచిస్తుండటం ప్రశంసించదగ్గ పరిణామమే. కానీ, ఆయా ప్రాజెక్ట్‌లను ఎవరు చేపడుతున్నారో తెలపమని విలేకరులు ప్రశ్నించగా.. ప్రమోటర్ల పేర్లు బయటకు రాకుండా ఏజెంట్లతో దందా నడిపిస్తున్నారని సమాధానం ఇచ్చారు. వాట్సాప్, ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సాధారణంగా సంఘటిత డెవలపర్లకు ఏజెంట్లకు 1.5–2 శాతం కమీషన్ ఇస్తుంటే.. యూడీఎస్ డెవలపర్లు మాత్రం 5–10 శాతం కమీషన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో వివరాలు ఉన్నాయని, కానీ, చర్యలు తీసుకోవటంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఆడిట్ బుక్స్ పరిశీలిస్తే తతంగం బయటపడుతుందని పేర్కొన్నారు. డెవలపర్ల సంఘాల దృష్టికి వచ్చిన యూడీఎస్ ఏజెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి, ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తదితరలు పాల్గొన్నారు. ► జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా కార్యాలయాలలో ఇన్ఫర్మేషన్ గైడెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. గృహ కొనుగోలుకు ముందు కొనుగోలుదారులు ఆయా కేంద్రాలను సంప్రదిస్తే.. వారికి మార్గనిర్ధేశనం చేయాలని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు సూచించారు. దీంతో అమాయక ప్రజలు మోసపోకుండా ఉండటంతో పాటు ప్రభుత్వం, నిర్మాణ సంస్థలతో నమ్మకం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కన్జర్వేషన్ జోన్, 111 జీవో పరిధిలోనూ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని దీంతో హైదరాబాద్ అభివృద్ధికి విఘాతం ఏర్పడుతుందని తెలిపారు. హైదరాబాద్ గ్రోత్ రేట్‌ను అంచనా వేయకుండా నిర్మాణ రంగంలో ఏమాత్రం అనుభవం లేకుండా ఆకాశంలో మేడలు కడతామని ఆశచూపిస్తూ అమాయకులను కలలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ► చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకొని కొందరు డెవలపర్లు అక్రమంగా ప్రాజెక్ట్‌లు, విక్రయాలు చేపడుతున్నారు. తక్కువ ధర అని ఆశ చూపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. సంఘటిత నిర్మాణ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత డెవలపర్లపై కూడా ఉందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ప్రెసిడెంట్ సీ ప్రభాకర్‌రావు అన్నారు. అందుకే యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన చేపట్టనున్నామని పేర్కొన్నారు. ► నోయిడా, గ్రేటర్ నోయిడాలో విక్రయించిన యూడీఎస్ ప్రాజెక్ట్‌లలో ధర మార్కెట్ రేటుతో సమానంగా విక్రయించారు. అయినా సరే అక్కడ నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారు. అలాంటిది మన దగ్గర మార్కెట్ రేటు కంటే సగం ధరకే యూడీఎస్ స్కీమ్‌లో విక్రయాలు చేపడుతున్నారు. మరి, ఇక్కడెలా నిర్మాణాలు చేయగలరనేది కొనుగోలుదారులు ప్రశ్నించుకోవాలని ట్రెడా ప్రెసిడెంట్ ఆర్ చలపతిరావు అన్నారు. చిన్న వస్తువును కొంటే ఐఎస్ఐ మార్క్ ఉందా? బ్రాండెడేనా అనా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకునే ఈ రోజుల్లో.. లక్షల్లో వెచ్చించే గృహ కొనుగోలు సమయంలో డెవలపర్ చరిత్ర, నిర్మాణ అనుమతులు, రెరా నమోదు వంటి కీలక అంశాలు పరిశీలించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. రిస్క్ లేని చోట పది గజాలు తక్కువైనా మంచిది గడువు లోగా నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశం చేసే వీలుంటుందని పేర్కొన్నారు. ఓపెన్‌స్పేస్, పార్క్‌లు, సెట్‌బ్యాక్స్, పర్మిషన్స్, అంతస్తుల సంఖ్య.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కొనుగోలుకు ముందే పరిశీలించుకోవాలని సూచించారు. ఎకరం రూ.50 కోట్లు ఉంటే 50 అంతస్తులు, రూ.40 కోట్లు ఉంటే 40 ఫ్లోర్లు.. ఇలా ఎంత రేటు ఉంటే అన్ని అంతస్తులు నిర్మిస్తామని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కొనుగోలుదారులు రేటు తక్కువ చూపించేందుకే ఈ అసత్య ప్రచారమని తెలిపారు. -
సింగిల్ విండో కావాలి!
సాక్షి, హైదరాబాద్: టీఎస్–ఐపాస్ ద్వారా ఎలాగైతే పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులను మంజూరు చేస్తున్నారో.. అలాగే నిర్మాణ రంగ అనుమతులకూ ప్రత్యేక పాలసీని తీసుకురావాలి. సింగిల్ విండో సిస్టమ్‌లో నిర్మాణ అనుమతులిచ్చే మున్సిపల్ శాఖతో పాటూ అగ్నిమాపక, నాలా కన్వర్షన్, ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజింగ్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, మైన్స్ అండ్ జియోలజీ విభాగాలనూ భాగస్వామ్యం చేయాలి. అప్పుడే అనుమతుల మంజూరులో జాప్యం తగ్గడంతో పాటూ అవినీతి కూడా తగ్గుతుందని.. దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు పెట్టుబడులతో ముందుకొస్తాయని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) అభిప్రాయపడింది. ఇటీవల టీబీఎఫ్ నాల్గవ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ జక్కా వెంకట్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ♦ ఇంటి నిర్మాణం అంటే మున్సిపల్ పర్మిషన్ నుంచి మొదలుపెడితే జలమండలి, అగ్నిమాపక, పోలీస్, పర్యావరణ, ఎయిర్పోర్ట్.. వంటి చాలా ప్రభుత్వ విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని (ఎన్వోసీ) తీసుకోవాలి. ఇందుకోసం ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పట్లేదు. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతుందని.. కాబట్టి ఒక్క దరఖాస్తుతోనే అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి ఎన్వోసీలను జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ♦ రెవెన్యూ ల్యాండ్లను జియో ట్యాగింగ్ చేసి రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేయాలి. అప్పుడే భూములకు వర్చువల్ బౌండరీలు కనిపిస్తుంటాయి. దీంతో ద్వంద్వ రిజిస్ట్రేషన్స్ వంటి అక్రమాలకు తావుండదు. ♦ అభివృద్ధి నగరం నలువైపులా విస్తరించాలి. లుక్ ఈస్ట్ పాలసీతో తూర్పు ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉప్పల్‌లోని ఇండస్ట్రియల్ ల్యాండ్ మొత్తాన్ని ఐటీ జోన్‌గా ప్రకటించాలి. పోచారంలోని రహేజా ఐటీ పార్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. నివాసితులకు ఆరోగ్య వాతావరణం కోసం నగరంలోని పార్క్‌లను కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్స్లాగా అభివృద్ధి చేయాలి. నెలకొకసారి స్థల మార్పిడి కమిటీ.. ప్రస్తుతం ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కమిటీ 2–3 నెలలకొకసారి సమావేశం అవుతోంది. దీంతో స్థల మార్పిడికి ఎక్కువ సమయం పడుతుంది. అలా కాకుండా ప్రతి నెలకు ఒకసారి సమావేశం జరగాలి. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలు, ఓపెన్ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం చేపట్టిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)పై కోర్టు కేసులో ఉంది. దీన్ని త్వరితగతిన పరిష్కరించి అందుబాటులోకి తీసుకురావాలి. దీంతో చాలా మంది నిరుపేద, మధ్య తరగతి ప్రజలు ప్రయోజనం పొందుతారు. ప్రొహిబిషనరీ రిజిస్ట్రేషన్స్ ఒక సర్వే నంబరులో ఉండే వేల ఎకరాల్లో కొంత స్థలానికి ఏవైనా న్యాయపరమైన సమస్యలు వస్తే.. రెవెన్యూ శాఖ ఆ సర్వే నంబరు అంతటినీ ప్రొహిబిషనరీ రిజిస్ట్రేషన్ కింద పెట్టేస్తున్నారు. దీంతో ఆ సర్వే నంబరులోని మిగిలిన స్థలానికి రిజిస్ట్రేషన్స్ జరగట్లేదు. ఏ స్థలం వరకైతే లీగల్ సమస్యలున్నాయో అంత వరకే ప్రొహిబిషనరీ విధించాలి. లేకపోతే మిగిలిన స్థలంలోని కొనుగోలుదారులకు నష్టం వాటిల్లుతుంది. ♦ ఉదాహరణకు భోగారం సర్వే నంబరు 281లో మొత్తం 12 ఎకరాల 19 గుంటల భూమి ఉంది. ఇందులో 4 ఎకరాల 2 గుంటలు పట్టా, 8 ఎకరాల 17 గుంటలు అసైన్డ్ ల్యాండ్. దీంతో రెవెన్యూ విభాగం ఈ సర్వే నంబరును ప్రొహిబిషనరీ రిజిస్ట్రేషన్స్ కింద పెట్టేసింది. దీంతో పట్టా ల్యాండ్‌లో భూమి కొన్నా.. రిజిస్ట్రేషన్స్ జరగట్లేదు. ఇదే అదనుగా ఆ సర్వే నంబరులోని పట్టా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్‌కు కూడా సబ్–రిజిస్ట్రార్లకు చేతులు తడపాల్సి వస్తోంది. అలా కాకుండా సర్వే నంబరు 281 (ఏ), (బీ) అని ప్రత్యేకంగా చూపించినట్లయితే.. కొనుగోలుదారులకు ఇబ్బందులుండవు.. జేబు భారమూ తప్పుతుంది. – సీ ప్రభాకర్ రావు, టీబీఎఫ్ ప్రెసిడెంట్ విజయవాడ రోడ్లో దృష్టి మెట్రో రైల్ ప్రారంభం, ఫ్లై ఓవర్, అండర్ పాస్ బ్రిడ్జీల నిర్మాణంతో ఇప్పుడు ఎల్బీనగర్ ప్రాంతం అత్యంత బిజీ ఏరియాగా మారింది. పోచారం ఐటీ హబ్‌తో వరంగల్, ఆదిభట్ల ఎయిరో స్పేస్ హబ్‌తో సాగర్ రోడ్ ఎలాగైతే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయో.. అలాగే విజయవాడ జాతీయ రహదారిలోనూ అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రకటించాలి. దీంతో నగరం నలువైపులా సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది. – టీ నరసింహా రావు, ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కార్మికులకు బీమా సౌకర్యం భవన నిర్మాణ రంగంలో నైపుణ్యమున్న కార్మికులున్నారు. నిర్మాణ సమయంలో జరిగే ప్రమాదాలకు డెవలపర్లను బాధ్యుల్ని చేయడం, కేసులు పెట్టడం సరైంది కాదు. భవన నిర్మాణ కార్మికులకు బీమా సౌకర్యాన్ని కల్పించాలి. దీంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించినట్లవుతుంది. – ఎం. సీహెచ్ రాఘవరావు,వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ లేబర్ సె‹స్పై అవగాహన నగరంలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. నగరం చుట్టూ ఇసుక డిపోలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. డెవలపర్ల నుంచి వసూలు చేసే లేబర్ సెస్ ప్రభుత్వం వద్ద మూలుగుతోంది. అసంఘటిత రంగంలోని కార్మికులు ఈ సొమ్మును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. – ఎం. శ్రీనివాసన్, కూకట్పల్లి బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
ప్రాపర్టీ ప్లస్ 6th May 2018
-
48గంటల్లోనే.. నిర్మాణ అనుమతులు
♦ 750 చ.మీ., ఐదంతస్తుల్లోపు అనుమతులూ జోనల్ స్థాయిలోనే ♦ 10 శాతం మార్టిగేజ్ నిబంధనను తొలగించాలి: టీబీఎఫ్ సాక్షి, హైదరాబాద్ తెలంగాణలో ఇక నిర్మాణ అనుమతుల కోసం కాళ్లరిగేలా తిరిగే రోజులకు కాలం చెల్లనుంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతి పొందిన లే అవుట్లో కేవలం 48 గంటల్లోనే నిర్మాణ అనుమతులు రానున్నాయి. ఒక్క దరఖాస్తుతో అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఎయిర్పోర్ట్, గనులు వంటి అన్ని విభాగాల నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం వచ్చేలా ఏకగవాక్ష విధానాన్ని తీసుకురానున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. శుక్రవారమిక్కడ జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) 3వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. కేంద్ర పర్యావరణ విభాగం ఎన్వోసీ కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని త్వరలోనే పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ పరిధిలో కలర్ కోడ్ ఆధారంగా నిర్మాణ అనుమతుల ఎత్తును సూచించేలా ఏర్పాటు చేశామని, సాఫ్ట్వేర్ అభివృద్ధి కూడా పూర్తయిందని ఆయన వివరించారు. జోనల్ కార్యాలయాల్లోనే 750 చ.మీ., ఐదంతస్తుల లోపుండే నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆయా అంశాలపై విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది. 10 శాతం మార్టిగేజ్ మినహాయింపు.. రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు 10 శాతం మార్టిగేజ్ నిబంధనను తొలగించాలని టీబీఎఫ్ కోరింది. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ జే వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణ అనుమతుల నిబంధనలను ఉల్లంఘించకూడదని బిల్డింగ్/లే అవుట్ అనుమతుల కోసం 10 శాతం మార్టిగేజ్ నిబంధన అమల్లో ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో రెరా అమల్లోకి వచ్చింది. అందువల్ల నిబంధనలను అతిక్రమించే అవకాశం డెవలపర్లకు లేదు. అందుకే మార్టిగేజ్ నిబంధనలను తొలగించాలని టీబీఎఫ్ కోరుతోంది. దీంతో డెవలపర్లకు 10 శాతం నగదు ప్రవాహం పెరిగేందుకు ఆస్కారముంటుందని పేర్కొన్నారు. టీబీఎఫ్ ప్రెసిడెంట్ సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలంగాణలో 1.25 శాతం వ్యాట్ కట్టేవాళ్లం. అయితే జీఎస్టీలో చెల్లించే పన్నుల్లో సగం రాష్ట్రానికి ఎస్జీఎస్టీ రూపంలో అందుతాయి అంటే 6 శాతం. రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్‌డ్యూటీని కూడా రాష్ట్రానికే చెల్లించాలి. ఇది కొనుగోలుదారులపై మోయలేని భారం. అందుకే 6 శాతంగా ఉన్న స్టాంప్‌డ్యూటీని 2 శాతానికి తగ్గించాలని కోరారు. ∙స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి (రెరా) కార్యాలయం త్వరగా ఏర్పాటు చేయాలని టీబీఎఫ్ కోరింది. ప్రస్తుతానికి ఇన్వార్డ్ కౌంటర్‌ను ఏర్పాటు చేసి డెవలపర్లు తమ దరఖాస్తులను తక్షణమే సమర్పించేందుకు తగిన అవకాశం కల్పించాలని కోరారు. టీబీఎఫ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేక్రమంలో ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది. భారీ మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు సిద్ధం చేశాం. నాలుగు ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్లు, వచ్చే రెండేళ్లలో నగరంలో 290 కి.మీ. పొడవున వైట్ టాపింగ్ రోడ్లను వేయనున్నాం’’ అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కాటపల్లి జనార్ధన్ రెడ్డి, న్యాక్ డైరెక్టర్ జనరల్ కే బిక్షపతి, డిప్యూటీ కమిషనర్ (కమర్షియల్ ట్యాక్స్) కాశీ విశ్వేశ్వర్ రావు, జీహెచ్ఎంసీ సీసీపీ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.