48గంటల్లోనే.. నిర్మాణ అనుమతులు | TBF GHMCC HMDA | Sakshi
Sakshi News home page

48గంటల్లోనే.. నిర్మాణ అనుమతులు

Published Sat, Aug 12 2017 12:19 AM | Last Updated on Sun, Sep 17 2017 5:25 PM

48గంటల్లోనే.. నిర్మాణ అనుమతులు

48గంటల్లోనే.. నిర్మాణ అనుమతులు

750 చ.మీ., ఐదంతస్తుల్లోపు అనుమతులూ జోనల్‌ స్థాయిలోనే
10 శాతం మార్టిగేజ్‌ నిబంధనను తొలగించాలి: టీబీఎఫ్‌


సాక్షి, హైదరాబాద్‌
తెలంగాణలో ఇక నిర్మాణ అనుమతుల కోసం కాళ్లరిగేలా తిరిగే రోజులకు కాలం చెల్లనుంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతి పొందిన లే అవుట్‌లో కేవలం 48 గంటల్లోనే నిర్మాణ అనుమతులు రానున్నాయి. ఒక్క దరఖాస్తుతో అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఎయిర్‌పోర్ట్, గనులు వంటి అన్ని విభాగాల నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం వచ్చేలా ఏకగవాక్ష విధానాన్ని తీసుకురానున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారమిక్కడ జరిగిన తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ (టీబీఎఫ్‌) 3వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు..

కేంద్ర పర్యావరణ విభాగం ఎన్‌వోసీ కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని త్వరలోనే పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ పరిధిలో కలర్‌ కోడ్‌ ఆధారంగా నిర్మాణ అనుమతుల ఎత్తును సూచించేలా ఏర్పాటు చేశామని, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి కూడా పూర్తయిందని ఆయన వివరించారు. జోనల్‌ కార్యాలయాల్లోనే 750 చ.మీ., ఐదంతస్తుల లోపుండే నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆయా అంశాలపై విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది.

10 శాతం మార్టిగేజ్‌ మినహాయింపు..
రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు 10 శాతం మార్టిగేజ్‌ నిబంధనను తొలగించాలని టీబీఎఫ్‌ కోరింది. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని టీబీఎఫ్‌ జనరల్‌ సెక్రటరీ జే వెంకట్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణ అనుమతుల నిబంధనలను ఉల్లంఘించకూడదని బిల్డింగ్‌/లే అవుట్‌ అనుమతుల కోసం 10 శాతం మార్టిగేజ్‌ నిబంధన అమల్లో ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో రెరా అమల్లోకి వచ్చింది. అందువల్ల నిబంధనలను అతిక్రమించే అవకాశం డెవలపర్లకు లేదు. అందుకే మార్టిగేజ్‌ నిబంధనలను తొలగించాలని టీబీఎఫ్‌ కోరుతోంది. దీంతో డెవలపర్లకు 10 శాతం నగదు ప్రవాహం పెరిగేందుకు ఆస్కారముంటుందని పేర్కొన్నారు.

టీబీఎఫ్‌ ప్రెసిడెంట్‌ సీ ప్రభాకర్‌ రావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలంగాణలో 1.25 శాతం వ్యాట్‌ కట్టేవాళ్లం. అయితే జీఎస్‌టీలో చెల్లించే పన్నుల్లో సగం రాష్ట్రానికి ఎస్‌జీఎస్‌టీ రూపంలో అందుతాయి అంటే 6 శాతం. రిజిస్ట్రేషన్‌ కోసం స్టాంప్‌డ్యూటీని కూడా రాష్ట్రానికే చెల్లించాలి. ఇది కొనుగోలుదారులపై మోయలేని భారం. అందుకే 6 శాతంగా ఉన్న స్టాంప్‌డ్యూటీని 2 శాతానికి తగ్గించాలని కోరారు.
∙స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి (రెరా) కార్యాలయం త్వరగా ఏర్పాటు చేయాలని టీబీఎఫ్‌ కోరింది. ప్రస్తుతానికి ఇన్‌వార్డ్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేసి డెవలపర్లు తమ దరఖాస్తులను తక్షణమే సమర్పించేందుకు తగిన అవకాశం కల్పించాలని కోరారు.

టీబీఎఫ్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేక్రమంలో ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది. భారీ మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు సిద్ధం చేశాం. నాలుగు ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైఓవర్లు, వచ్చే రెండేళ్లలో నగరంలో 290 కి.మీ. పొడవున వైట్‌ టాపింగ్‌ రోడ్లను వేయనున్నాం’’ అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కాటపల్లి జనార్ధన్‌ రెడ్డి, న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ కే బిక్షపతి, డిప్యూటీ కమిషనర్‌ (కమర్షియల్‌ ట్యాక్స్‌) కాశీ విశ్వేశ్వర్‌ రావు, జీహెచ్‌ఎంసీ సీసీపీ దేవేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement