GHMCC
-
48గంటల్లోనే.. నిర్మాణ అనుమతులు
♦ 750 చ.మీ., ఐదంతస్తుల్లోపు అనుమతులూ జోనల్ స్థాయిలోనే ♦ 10 శాతం మార్టిగేజ్ నిబంధనను తొలగించాలి: టీబీఎఫ్ సాక్షి, హైదరాబాద్ తెలంగాణలో ఇక నిర్మాణ అనుమతుల కోసం కాళ్లరిగేలా తిరిగే రోజులకు కాలం చెల్లనుంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతి పొందిన లే అవుట్లో కేవలం 48 గంటల్లోనే నిర్మాణ అనుమతులు రానున్నాయి. ఒక్క దరఖాస్తుతో అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఎయిర్పోర్ట్, గనులు వంటి అన్ని విభాగాల నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం వచ్చేలా ఏకగవాక్ష విధానాన్ని తీసుకురానున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. శుక్రవారమిక్కడ జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) 3వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. కేంద్ర పర్యావరణ విభాగం ఎన్వోసీ కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని త్వరలోనే పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ పరిధిలో కలర్ కోడ్ ఆధారంగా నిర్మాణ అనుమతుల ఎత్తును సూచించేలా ఏర్పాటు చేశామని, సాఫ్ట్వేర్ అభివృద్ధి కూడా పూర్తయిందని ఆయన వివరించారు. జోనల్ కార్యాలయాల్లోనే 750 చ.మీ., ఐదంతస్తుల లోపుండే నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆయా అంశాలపై విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది. 10 శాతం మార్టిగేజ్ మినహాయింపు.. రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు 10 శాతం మార్టిగేజ్ నిబంధనను తొలగించాలని టీబీఎఫ్ కోరింది. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని టీబీఎఫ్ జనరల్ సెక్రటరీ జే వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణ అనుమతుల నిబంధనలను ఉల్లంఘించకూడదని బిల్డింగ్/లే అవుట్ అనుమతుల కోసం 10 శాతం మార్టిగేజ్ నిబంధన అమల్లో ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో రెరా అమల్లోకి వచ్చింది. అందువల్ల నిబంధనలను అతిక్రమించే అవకాశం డెవలపర్లకు లేదు. అందుకే మార్టిగేజ్ నిబంధనలను తొలగించాలని టీబీఎఫ్ కోరుతోంది. దీంతో డెవలపర్లకు 10 శాతం నగదు ప్రవాహం పెరిగేందుకు ఆస్కారముంటుందని పేర్కొన్నారు. టీబీఎఫ్ ప్రెసిడెంట్ సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలంగాణలో 1.25 శాతం వ్యాట్ కట్టేవాళ్లం. అయితే జీఎస్టీలో చెల్లించే పన్నుల్లో సగం రాష్ట్రానికి ఎస్జీఎస్టీ రూపంలో అందుతాయి అంటే 6 శాతం. రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్‌డ్యూటీని కూడా రాష్ట్రానికే చెల్లించాలి. ఇది కొనుగోలుదారులపై మోయలేని భారం. అందుకే 6 శాతంగా ఉన్న స్టాంప్‌డ్యూటీని 2 శాతానికి తగ్గించాలని కోరారు. ∙స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి (రెరా) కార్యాలయం త్వరగా ఏర్పాటు చేయాలని టీబీఎఫ్ కోరింది. ప్రస్తుతానికి ఇన్వార్డ్ కౌంటర్‌ను ఏర్పాటు చేసి డెవలపర్లు తమ దరఖాస్తులను తక్షణమే సమర్పించేందుకు తగిన అవకాశం కల్పించాలని కోరారు. టీబీఎఫ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేక్రమంలో ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది. భారీ మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు సిద్ధం చేశాం. నాలుగు ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్లు, వచ్చే రెండేళ్లలో నగరంలో 290 కి.మీ. పొడవున వైట్ టాపింగ్ రోడ్లను వేయనున్నాం’’ అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కాటపల్లి జనార్ధన్ రెడ్డి, న్యాక్ డైరెక్టర్ జనరల్ కే బిక్షపతి, డిప్యూటీ కమిషనర్ (కమర్షియల్ ట్యాక్స్) కాశీ విశ్వేశ్వర్ రావు, జీహెచ్ఎంసీ సీసీపీ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వారికి ముందస్తు ‘పండగే’!
►బోనాల పనుల పేరిట రూ.10 కోట్లకు ‘టెండర్’ ►జీహెచ్ఎంసీలో ఏటా ‘తంతు’గా వ్యవహారం ►పైపై పనులతో నిధుల స్వాహాకు రంగం సిద్ధం సిటీబ్యూరో : ప్రతియేటా బోనాల పండుగంటే జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లకు పండగే! బోనాల పేరిట ఏటా దాదాపు రూ.10 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు చూపించడం.. పైపై పూతలతో పనుల్ని మమ అనిపించడం పరిపాటిగా మారింది. ఈసారి కూడా రూ.10 కోట్లకు పైగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవి కేవలం మూడు జోన్లకు సంబంధించిన పనులకే. ఇంకా రెండు జోన్ల ప్రతిపాదనలు సిద్ధం కావాల్సి ఉంది. ప్రతిపాదనలు ఆమోదం పొందడం లాంఛనప్రాయమే. బోనాల పేరిట నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, ఏ సంవత్సరం కూడా బోనాల పండగ నాటికి పనులు పూర్తిచేసిన పాపాన పోలేదు. ముందస్తుగానే ప్రతిపాదనలు, నిధుల మంజూరు జరిగినప్పటికీ, తీరా పండగ తేదీలు సమీపించేదాకా పనులు చేపట్టకపోవడం.. చేసే కొన్ని పనులు సైతం తూతూమంత్రంగా చేయడం పరిపాటిగా మారింది. బోనాల సందర్భంగా ఆయా ఆలయాలకు వెళ్లే స్థానిక భక్తుల సౌకర్యార్థం ఆలయాలకు దారి తీసే మార్గాలన్నింటికి మరమ్మతులు చేయడం, గుంతలు పూడ్చటం వంటి పనులు చేస్తారు. వీటితోపాటు ఆలయాలకు సున్నాలు వేయడం, దెబ్బతిన్న ప్రాంతాల్లో షాబాద్ ఫ్లోరింగ్ వంటి పనులు చేస్తారు. ఇంకా ఆలయాలకు ప్రత్యేకంగా విద్యుత్ దీపాలంకరణలు సైతం చేస్తారు. ఇవి చిన్న చిన్న పనులు కావడం.. మరమ్మతులే ఎక్కువగా ఉండటం, నాణ్యత పరీక్షల వంటివాటికి ఆస్కారం లేకపోవడంతో ఖర్చు చేయకుండానే బిల్లులు పొందడం పరిపాటిగా మారింది. బోనాల పేరిట జరిగే పనుల్ని పండగలోపే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, పూర్తి చేయరు. ఇంకా పనులు జరుగుతున్నట్లు రికార్డుల్లో పేర్కొని మళ్లీ బోనాల పండగ వచ్చేంతదాకా జాప్యం చేస్తారు. మళ్లీ పండగొస్తే మళ్లీ నిధులు మంజూరవుతాయి కనుక పాతవాటి గురించి ప్రశ్నించే వారుండరు. ఏటా ఇదో తంతుగా మారింది. కొన్ని ప్రాంతాల్లో బోనాల పేరిట మంజూరైన నిధులతో ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్నట్లు చూపెడతారు. బోనాల సందర్భంగా ఆలయాల వద్ద మాత్రమే పనులు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఎక్కడో అక్కడ చేస్తున్నట్లు చూపెడతారు. అవైనా పూర్తిగా చేస్తారో,..చేయరో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకే తెలియాలి. ఏటా వందల కోట్ల పనులు చేసే జీహెచ్ఎంసీలో రూ.10 కోట్లు పెద్ద లెక్కలోవి కాకపోవడంతో వీటి గురించి పెద్దగా పట్టించుకుంటున్న వారు లేరు. దీంతో పండగ నిధులు పక్కదారి పట్టేందుకు ఎంతో అవకాశం ఉంది. ఈసారైనా అలా జరగకుండా పక్కాగా పనులు చేపట్టాలని, పండగలోపునే మంజూరైన నిధులన్నీ ఖర్చు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు ఏ మేరకు పనులు చేస్తారో వేచి చూడాల్సిందే. -
ఫుట్‌పాత్‌ల నిర్వహణ ప్రైవేట్‌కు...
మూడు ప్రధానమార్గాల్లో.. టెండర్లు ఆహ్వానించిన జీహెచ్ఎంసీ సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో 9 వేల కి.మీ.కు పైగా ప్రధాన రహదారులున్నాయి. జీహెచ్ఎంసీకి చెందిన 20 వేల మందికి పైగా పారిశుధ్య కార్మికులు వీటిని శుభ్రం చేస్తున్నప్పటికీ, కొద్దిసేపటికే రోడ్ల వెంబడి ఫుట్‌పాత్‌లపై కాగితాలు, క్యారీబ్యాగ్స్, తదితర వ్యర్థాలతో అందవిహీనంగా మారుతున్నా యి. పాదచారులతోపాటు వాహనాల్లో వెళ్లే వారు , దుకాణదారులు వేసిన చెత్త మరుసటి రోజు వరకు ఉంటోంది. వాణిజ్య సంస్థలున్న మార్గాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీంతో పారిశుధ్య కార్మికులు శుభ్రం చేశాక తిరిగి ఫుట్‌పాత్‌లపై పడుతున్న ఈ వ్యర్థాలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది.వీఐపీలు ఎక్కువగా సంచరించే, పర్యాటకులు పర్యటించే ఎంపిక చేసిన మూడు స్ట్రెచ్‌ల్లో ఈ పారిశుధ్య నిర్వహణను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానించింది. టెండరు దాఖలుకు ఈనెల 8 చివరి తేదీ. టెండరులో అర్హత పొందిన సంస్థకు జీహెచ్ఎంసీ ఈ పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాల్ని అప్పగించనుంది. టెండరు పొందిన సంస్థ ఎప్పటి కప్పుడు ఫుట్‌పాత్‌లపై వ్యర్థాల్ని తొలగించాల్సి ఉంటుంది. పడ్డ చెత్తను గంట వ్యవధిలో తొలగించాలి. లేనిపక్షంలో వ్యర్థాలు గాలికి చెల్లాచెదురై పరిసరాల్లో పడుతుండటంతో అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఈ సమస్య నివారణతోపాటు పర్యావరణపరంగానూ మెరుగ్గా ఉండేందుకు టెండరు పిలి చారు. కాంట్రాక్టు పొందే సంస్థ తగిన సాంకేతిక, ఆధునిక విధానాలతో ఫుట్‌పాత్‌లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. స్ట్రెచ్ 1: బేగంపేట ఫ్లైఓవర్–పంజగుట్ట–బంజారాహిల్స్ రోడ్‌నెం.2, 3– జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 36 స్ట్రెచ్ 2: మాసాబ్ ట్యాంక్జంక్షన్–బంజారాహిల్స్ రోడ్‌నెం.1–నాగార్జున సర్కిల్– రోడ్‌నెంబర్ 12– ఫిల్మ్‌నగర్ జంక్షన్–జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్ట్రెచ్ 3: రాజ్‌భవన్‌రోడ్ (సోమాజిగూడ) జంక్షన్– ఖైరతాబాద్ జంక్షన్–తెలుగుతల్లి ఫ్లై ఓవర్ (వయా ఇందిరా గాంధీ విగ్రహం)– అంబేద్కర్ విగ్రహం– అసెంబ్లీ జంక్షన్ ఉల్లంఘనలకు జరిమానాలు నిర్ణయించారు. దిగువ నిబంధనలు పాటించకుంటే జరిమానాగా చెల్లింపుల్లో కోత విధిస్తారు. ఏ రోజైనా ఫొటోలు అప్లోడ్ చేయకుంటే.. అధికారుల తనిఖీల్లో రోడ్లు పరిశుభ్రంగా లేకుంటే గంట వ్యవధిలో చెత్త, వ్యర్థాలు, డెబ్రిస్ తొలగించకుంటే గంట వ్యవధిలో పోస్టర్లు, బ్యానర్లు తొలగించని పక్షంలో... పైన పేర్కొన్న నాలుగు పాయింట్లలో ఒక్కో పాయింట్‌కు నెలవారీ నిర్వహణ చెల్లింపుల్లో 3 శాతం కోత విధిస్తారు. ఒకే నెలలో 30 పాయింట్లు మించితే నెల మొత్తానికీ చెల్లింపులు చేయరు.