వారికి ముందస్తు ‘పండగే’!
►బోనాల పనుల పేరిట రూ.10 కోట్లకు ‘టెండర్’
►జీహెచ్‌ఎంసీలో ఏటా ‘తంతు’గా వ్యవహారం
►పైపై పనులతో నిధుల స్వాహాకు రంగం సిద్ధం
సిటీబ్యూరో : ప్రతియేటా బోనాల పండుగంటే జీహెచ్‌ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లకు పండగే! బోనాల పేరిట ఏటా దాదాపు రూ.10 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్లు చూపించడం.. పైపై పూతలతో పనుల్ని మమ అనిపించడం పరిపాటిగా మారింది. ఈసారి కూడా రూ.10 కోట్లకు పైగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవి కేవలం మూడు జోన్లకు సంబంధించిన పనులకే. ఇంకా రెండు జోన్ల ప్రతిపాదనలు సిద్ధం కావాల్సి ఉంది. ప్రతిపాదనలు ఆమోదం పొందడం లాంఛనప్రాయమే. బోనాల పేరిట నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, ఏ సంవత్సరం కూడా బోనాల పండగ నాటికి పనులు పూర్తిచేసిన పాపాన పోలేదు. ముందస్తుగానే ప్రతిపాదనలు, నిధుల మంజూరు జరిగినప్పటికీ, తీరా పండగ తేదీలు సమీపించేదాకా పనులు చేపట్టకపోవడం.. చేసే కొన్ని పనులు సైతం తూతూమంత్రంగా చేయడం పరిపాటిగా మారింది.
బోనాల సందర్భంగా ఆయా ఆలయాలకు వెళ్లే స్థానిక భక్తుల సౌకర్యార్థం ఆలయాలకు దారి తీసే మార్గాలన్నింటికి మరమ్మతులు చేయడం, గుంతలు పూడ్చటం వంటి పనులు చేస్తారు. వీటితోపాటు ఆలయాలకు సున్నాలు వేయడం, దెబ్బతిన్న ప్రాంతాల్లో షాబాద్ ఫ్లోరింగ్ వంటి పనులు చేస్తారు. ఇంకా ఆలయాలకు ప్రత్యేకంగా విద్యుత్ దీపాలంకరణలు సైతం చేస్తారు. ఇవి చిన్న చిన్న పనులు కావడం.. మరమ్మతులే ఎక్కువగా ఉండటం, నాణ్యత పరీక్షల వంటివాటికి ఆస్కారం లేకపోవడంతో ఖర్చు చేయకుండానే బిల్లులు పొందడం పరిపాటిగా మారింది. బోనాల పేరిట జరిగే పనుల్ని పండగలోపే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, పూర్తి చేయరు. ఇంకా పనులు జరుగుతున్నట్లు రికార్డుల్లో పేర్కొని మళ్లీ బోనాల పండగ వచ్చేంతదాకా జాప్యం చేస్తారు. మళ్లీ పండగొస్తే మళ్లీ నిధులు మంజూరవుతాయి కనుక పాతవాటి గురించి ప్రశ్నించే వారుండరు. ఏటా ఇదో తంతుగా మారింది.
కొన్ని ప్రాంతాల్లో బోనాల పేరిట మంజూరైన నిధులతో ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్నట్లు చూపెడతారు. బోనాల సందర్భంగా ఆలయాల వద్ద మాత్రమే పనులు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఎక్కడో అక్కడ చేస్తున్నట్లు చూపెడతారు. అవైనా పూర్తిగా చేస్తారో,..చేయరో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకే తెలియాలి. ఏటా వందల కోట్ల పనులు చేసే జీహెచ్‌ఎంసీలో రూ.10 కోట్లు పెద్ద లెక్కలోవి కాకపోవడంతో వీటి గురించి పెద్దగా పట్టించుకుంటున్న వారు లేరు. దీంతో పండగ నిధులు పక్కదారి పట్టేందుకు ఎంతో అవకాశం ఉంది. ఈసారైనా అలా జరగకుండా పక్కాగా పనులు చేపట్టాలని, పండగలోపునే మంజూరైన నిధులన్నీ ఖర్చు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు ఏ మేరకు పనులు చేస్తారో వేచి చూడాల్సిందే.