ఫుట్‌పాత్‌ల నిర్వహణ ప్రైవేట్‌కు...
మూడు ప్రధానమార్గాల్లో.. టెండర్లు ఆహ్వానించిన జీహెచ్‌ఎంసీ
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో 9 వేల కి.మీ.కు పైగా ప్రధాన రహదారులున్నాయి. జీహెచ్‌ఎంసీకి చెందిన 20 వేల మందికి పైగా పారిశుధ్య కార్మికులు వీటిని శుభ్రం చేస్తున్నప్పటికీ, కొద్దిసేపటికే రోడ్ల వెంబడి ఫుట్‌పాత్‌లపై కాగితాలు, క్యారీబ్యాగ్స్, తదితర వ్యర్థాలతో అందవిహీనంగా మారుతున్నా యి. పాదచారులతోపాటు వాహనాల్లో వెళ్లే వారు , దుకాణదారులు వేసిన చెత్త మరుసటి రోజు వరకు ఉంటోంది. వాణిజ్య సంస్థలున్న మార్గాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది.
దీంతో పారిశుధ్య కార్మికులు శుభ్రం చేశాక తిరిగి ఫుట్‌పాత్‌లపై పడుతున్న ఈ వ్యర్థాలను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది.వీఐపీలు ఎక్కువగా సంచరించే, పర్యాటకులు పర్యటించే ఎంపిక చేసిన మూడు స్ట్రెచ్‌ల్లో ఈ పారిశుధ్య నిర్వహణను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానించింది. టెండరు దాఖలుకు ఈనెల 8 చివరి తేదీ. టెండరులో అర్హత పొందిన సంస్థకు జీహెచ్‌ఎంసీ ఈ పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాల్ని అప్పగించనుంది. టెండరు పొందిన సంస్థ ఎప్పటి కప్పుడు ఫుట్‌పాత్‌లపై వ్యర్థాల్ని తొలగించాల్సి ఉంటుంది. పడ్డ చెత్తను గంట వ్యవధిలో తొలగించాలి. లేనిపక్షంలో వ్యర్థాలు గాలికి చెల్లాచెదురై పరిసరాల్లో పడుతుండటంతో అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఈ సమస్య నివారణతోపాటు పర్యావరణపరంగానూ మెరుగ్గా ఉండేందుకు టెండరు పిలి చారు. కాంట్రాక్టు పొందే సంస్థ తగిన సాంకేతిక, ఆధునిక విధానాలతో ఫుట్‌పాత్‌లను శుభ్రం చేయాల్సి ఉంటుంది.
స్ట్రెచ్ 1: బేగంపేట ఫ్‌లైఓవర్–పంజగుట్ట–బంజారాహిల్స్ రోడ్‌నెం.2, 3– జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 36
స్ట్రెచ్ 2: మాసాబ్ ట్యాంక్‌జంక్షన్–బంజారాహిల్స్ రోడ్‌నెం.1–నాగార్జున సర్కిల్– రోడ్‌నెంబర్ 12– ఫిల్మ్‌నగర్ జంక్షన్–జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్
స్ట్రెచ్ 3: రాజ్‌భవన్‌రోడ్ (సోమాజిగూడ) జంక్షన్– ఖైరతాబాద్ జంక్షన్–తెలుగుతల్లి ఫ్‌లై ఓవర్ (వయా ఇందిరా గాంధీ విగ్రహం)– అంబేద్కర్ విగ్రహం– అసెంబ్లీ జంక్షన్
ఉల్లంఘనలకు జరిమానాలు నిర్ణయించారు. దిగువ నిబంధనలు పాటించకుంటే జరిమానాగా చెల్లింపుల్లో కోత విధిస్తారు. ఏ రోజైనా ఫొటోలు అప్‌లోడ్ చేయకుంటే.. అధికారుల తనిఖీల్లో రోడ్లు పరిశుభ్రంగా లేకుంటే గంట వ్యవధిలో చెత్త, వ్యర్థాలు, డెబ్రిస్ తొలగించకుంటే గంట వ్యవధిలో పోస్టర్లు, బ్యానర్లు తొలగించని పక్షంలో... పైన పేర్కొన్న నాలుగు పాయింట్లలో ఒక్కో పాయింట్‌కు నెలవారీ నిర్వహణ చెల్లింపుల్లో 3 శాతం కోత విధిస్తారు. ఒకే నెలలో 30 పాయింట్లు మించితే నెల మొత్తానికీ చెల్లింపులు చేయరు.