USD And Pre-launch Offers Precautions In Telugu - Sakshi
Sakshi News home page

నిర్మాణంలోని అపార్ట్‌మెంట్‌లో ప్లాట్‌ కొంటున్నారా..! అయితే ఈ విషయాల పట్ల జాగ్రత్త..!

Published Sat, Jan 29 2022 6:10 AM | Last Updated on Sat, Jan 29 2022 10:43 AM

Dont buys UDS and pre-launch offers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కస్టమర్లకు ఆకాశంలో పిట్టను చూపించి కింద మసాలా నూరిస్తున్నారు డెవలపర్లు. ఖాళీ స్థలం చూపించి 10 అంతస్తులు, 20 ఫ్లోర్లు కడుతున్నామని నమ్మబలికి వంద శాతం సొమ్ము చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే దొరకుతుందని ఆశ చూపెడుతున్నారు. నిజమేనని నమ్మిన కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. సాధారణంగా డెవలపర్‌ చదరపు అడుగు (చ.అ.) రూ.5 వేలకు విక్రయిస్తుంటాడు. ప్రీ లాంచ్, యూడీఎస్‌ స్కీమ్స్‌లో వంద శాతం సొమ్ము చెల్లిస్తే మాత్రం రూ.3 వేలకే అమ్ముతారు.

నిర్మాణ అనుమతులు వచ్చి, రెరాలో నమోదయ్యాక ఇందులో ధర రూ.5,500లకు చేరుతుంది. ఎందుకంటే ఆయా అనుమతుల కోసం డెవలపర్‌ కొంత ఆమ్యామ్యాలు సమర్పించుకుంటాడు కాబట్టి. ఈ ఖర్చును ధరను పెంచేసి భర్తీ చేసుకుంటాడు డెవలపర్‌. ఇదే ప్రాజెక్ట్‌లో ప్రీలాంచ్, యూడీఎస్‌లో కొనుగోలు చేసిన కొనుగోలుదారుడు చ.అ. రూ.3,500 చొప్పున రీసేల్‌కు పెడతాడు. కొనేందుకు వచ్చిన ఏ కస్టమర్‌ అయినా రీసేల్‌ ప్రాపర్టీకే ఆకర్షితుడవుతాడు. దీంతో డెవలపర్‌ వాటా ఫ్లాట్లు విక్రయం కాక చేతిలో నిర్మాణ వ్యయం లేక పనులను నిలిపివేస్తాడు. దీంతో ప్రాజెక్ట్‌ మధ్యలోనే ఆగిపోతుంది.

ఎవరు నిర్మిస్తున్నారంటే?
చిన్న కంపెనీలు మాత్రమే కాదు బడా కంపెనీలు కూడా ఇదే యూడీఎస్, ప్రీలాంచ్‌ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. ఇటీవల కోకాపేట, ఖానామేట్‌ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు కూడా యూడీఎస్‌ స్కీమ్‌తో పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేశాయి. ఇటీవలే నానక్‌రాంగూడలో హైరైజ్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన మరొక నిర్మాణ సంస్థ, జూబ్లిహిల్స్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న మరొక కంపెనీ ఇదే తరహా విక్రయాలు చేపడుతున్నాయి. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్,     కొల్లూరు, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్‌       వంటి ప్రాంతాలలో ఎక్కువగా యూడీఎస్‌ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు.

అంతా సోషల్‌ మీడియాలోనే..
యూడీఎస్‌ విధానంలో ఫ్లాట్లు లేదా స్థలాల విక్రయాల ప్రచార దందా సోషల్‌ మీడియా వేదికగానే సాగుతుంది. ప్రధాన కంపెనీలు తమ పాత కస్టమర్లకు ఇంటర్నల్‌ సేల్స్‌ చేస్తుంటే.. కొన్ని కంపెనీలేమో       తమ పేరు బయట పడకుండా ఏజెంట్ల ద్వారా వాట్సాప్, ట్విట్టర్‌లలో ప్రచారం చేయిస్తున్నాయి.      100 శాతం పేమెంట్‌తో ఫ్లాట్లను అమ్మించే ఏజెంట్లకు అధిక శాతం కమీషన్‌ను అందిస్తున్నాయి. ప్రీలాంచ్, యూడీఎస్‌ ప్రాజెక్ట్‌లన్నీ పేపర్లు, బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ     అనుమతులు, రెరాలో నమోదు ఏదీ ఉండదు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. సొంతిల్లు సొంతమవుతుందని నమ్మబలుకుతారు. అధిక కమీషన్‌కు          ఆశపడి చాలా మంది ఏజెంట్లు యూడీఎస్‌ విధానంలో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. వీరంతా కేవలం తమ      కమీషన్‌ గురించి ఆలోచిస్తున్నారే తప్ప.. రేపొద్దున సదరు బిల్డర్‌ అపార్ట్‌మెంట్‌ను కడతాడా? లేదా అని ఆలోచించట్లేదు. పొరపాటు బిల్డర్‌ ప్రాజెక్ట్‌ను కట్టకపోయినా.. సమయానికి డెలివరీ చేయకపోయినా      నష్టపోయేది కొనుగోలుదారులే.  

ప్రభుత్వానికి నష్టం ఎలాగంటే?
ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలోనే ఎక్కువ ఆదాయం సమకూరుతుంటుంది. కానీ, నిర్మాణ సంస్థలు హెచ్‌ఎండీఏ పరిధిలో చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్‌ చార్జీలను దొడ్డిదారిన తగ్గించుకుంటున్నాయి. ఫ్లాట్ల అమ్మకాలకు బదులుగా ప్రాజెక్ట్‌ కంటే ముందే అన్‌ డివైడెడ్‌ షేర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ (యూడీఎస్‌)ను రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఫ్లాట్‌ కొంటే చెల్లించాల్సిన 7.5 శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలకు బదులుగా.. యూడీఎస్‌లో సప్లమెంటరీ రిజిస్ట్రేషన్‌ కింద 1 శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలను మాత్రమే చెల్లిస్తున్నారు.

యూడీఎస్‌లో చ.అ. ధర తక్కువగా ఉండటం, రిజిస్ట్రేషన్‌ చార్జీలు లేకపోవటంతో కొనుగోలుదారులు ఈ తరహా ప్రాజెక్ట్‌లకు ఆకర్షితులవుతున్నారు. ఈ విధానంతో బిల్డర్లకు భారీగా ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ చార్జీల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. దేశంలో ఇప్పటివరకు టీఎస్‌ రెరాకు 70 వేలకు పైగానే ఫిర్యాదులు అందాయి. కానీ, ఒక్క కేసు నమోదు చేయలేదు. కేవలం నోటీసులు జారీ చేసి జరిమానాలతోనే సరిపెడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే వెçసులుబాటు అందుబాటులో ఉండగా.. మన రాష్ట్రంలో మాత్రం భౌతికంగా ఫిర్యాదు చేయాల్సిందే.

ప్రభుత్వం ఏం చేయాలంటే?
► హెచ్‌ఎండీఏ, రెరా విభాగాలకు శాశ్వత చైర్మన్లను నియమించాలి. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అధికారుల కొరతను తీర్చాలి. రెరా అథారిటీ, అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి.
► సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, రెరా విభాగాలను అనుసంధానించాలి. దీంతో ఆయా విభాగాల అనుమతులు జారీ అయితే రిజిస్ట్రేషన్‌ చేసేలా ఉండాలి.
► రెరాలో నమోదు కాకుండా విక్రయాలు జరిపే ఏజెంట్లు, మధ్యవర్తులపై క్రమశిక్షణరాహిత్య చర్యలు తీసుకోవాలి.
► రెరా అధికారులు, సిబ్బంది ఆఫీసులో కూర్చోవడానికి బదులు శివారు ప్రాంతాల్లో క్రమం తప్పకుండా క్షేత్ర పర్యటన చేయాలి. అప్పుడే ఏయే బిల్డర్లు మోసాలకు పాల్పడుతున్నారో తెలుస్తుంది.
► ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించి ఫేస్‌బుక్, ఇన్‌సాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియాలో సాగే ప్రీలాంచ్, యూడీఎస్‌ ప్రచారాలు, రాయితీలపై ఆరా తీయాలి.
► ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఉండాలి. రెరా అథారిటీ ప్రత్యేకంగా ఒక వాట్సాప్‌ నంబరు క్రియేట్‌ చేసి.. ఫ్లాట్లు, ప్లాట్లు కొనే వారు ముందస్తుగా తమకు సమాచారం ఇ వ్వాలని కోరాలి. ఈ నంబరు మొత్తం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగాలి. స్థిరాస్తిని కొనేముందు కొనుగోలుదారులు తప్పకుండా రెరాను సంప్రదించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
► పక్క రాష్ట్రంలో లోకల్‌ బాడీ ఫీజులు కూడా ప్రధాన విభాగమే కలెక్ట్‌ చేస్తుంది. డెవలపర్లు ప్లానింగ్‌ అనుమతుల కోసం లోకల్‌ బాడీకి వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, అధికారుల చేతివాటం రెండూ తగ్గుతాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement