Pre-launch
-
బీఎండబ్ల్యూ మరో ఈ-స్కూటర్.. ప్రీలాంచ్ బుకింగ్స్ రేపే..
అంతర్జాతీయ ప్రీమియం మోటర్‌సైకిల్స్ కంపెనీ బీఎండబ్ల్యూ మోటరాడ్ (BMW Motorrad) మరో ఎలక్ట్రిక్ టూవీలర్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. సీఈ 02 (CE 02) పేరుతో వచ్చే ఈ ఈ-స్కూటర్ రానున్న పండుగ సీజన్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. బీఎండబ్ల్యూ మోటరాడ్ సీఈ 02 ప్రీ-లాంచ్ బుకింగ్ శనివారం ప్రారంభమవుతున్నాయి.బీఎండబ్ల్యూ మోటరాడ్ సీఈ 02 ఈ-స్కూటర్‌ను స్థానికంగా భారత్‌లోనే అసెంబుల్ చేస్తారు. దీని ధర సుమారు రూ. 4.5 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో బీఎండబ్ల్యూ భారత్‌లో తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సీఈ 04ని విడుదల చేసింది. దీని ధర 14.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 31 kW మోటార్‌ను పొందుతుంది మరియు 130 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.బీఎండబ్ల్యూ సీఈ 02లో గరిష్టంగా 55 ఎన్ఎం శక్తిని ఉత్పత్తి చేసే 11 కిలోవాట్ల (15 హార్స్ పవర్) మోటర్ ఉంటుంది. దీని రేంజ్ 90 కి.మీ, గరిష్ట వేగం గంటకు 95 కి.మీ. సీటు ఎత్తు 750 మి.మీ. ఉంటుంది. ఇక టీనేజర్ల కోసం 4 కిలోవాట్ల వెర్షన్ కూడా ఉంటుంది. "ఫ్లో", "సర్ఫ్" అనే స్టాండర్డ్ రైడింగ్ మోడ్లతో వస్తుంది. వీటితోపాటు "ఫ్లాష్" డ్రైవింగ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. -
మూడు రోజుల్లో రూ.8,000 కోట్లు
న్యూఢిల్లీ: రియల్టీ రంగ సంస్థ డీఎల్ఎఫ్ సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ గురుగ్రామ్‌లో ఓ లగ్జరీ ప్రాజెక్టును చేపట్టింది. ప్రీలాంచ్లో ఫిబ్రవరి 15–17 మధ్య కంపెనీ మొత్తం 1,137 ఫ్లాట్స్‌ను విక్రయించింది. వీటి విలువ రూ.8,000 కోట్లకుపైమాటే. ఒక్కో ఫ్లాట్ రూ.7 కోట్లకుపైగా ఖరీదు చేస్తున్నాయి. భారత రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇదొక చరిత్ర, రికార్డు అని డీఎల్ఎఫ్ సీఈవో అశోక్ త్యాగి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రూ.15,000 కోట్ల వ్యాపారం నమోదు చేస్తుందని చెప్పారు. 2021–22లో ఇది రూ.7,273 కోట్లుగా ఉందన్నారు. పదేళ్ల విరామం తర్వాత గురుగ్రామ్ సెక్టార్ 63లో ‘ద ఆర్బర్’ పేరుతో గ్రూప్ హౌజింగ్ ప్రాజెక్టును ఫిబ్రవరిలో ప్రీలాంచ్ చేసింది. ఫిబ్రవరి 24న ఈ ప్రాజెక్టును ఆవిష్కరించాల్సి ఉండగా వారం ముందుగానే మొత్తం ఫ్లాట్స్‌ను మూడు రోజుల్లో విక్రయించడం విశేషం. అతిపెద్ద కంపెనీగా.. ఫ్లాట్స్ కొనుగోలుకై సుమారు 3,600 మంది ఆసక్తి చూపగా లాటరీ ద్వారా కస్టమర్లను ఎంపిక చేసినట్టు డీఎల్ఎఫ్ తెలిపింది. వినియోగదార్ల నుంచి రూ.800 కోట్లు ఇప్పటికే సమకూరిందని వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉన్నతోద్యోగులే 90 శాతం ఫ్లాట్స్‌ను దక్కించుకున్నారు. ఎన్నారైల వాటా 14 శాతం. వచ్చే నాలుగేళ్లలో 25 ఎకరాల విస్తీర్ణంలోని ఆర్బర్‌లో 38–39 అంతస్తుల్లో అయిదు టవర్లను నిర్మిస్తారు. ఒక్కొక్కటి 3,950 చదరపు అడుగుల్లో 4 బీహెచ్‌కే ఫ్లాట్స్ రానున్నాయి. మార్కెట్ క్యాప్‌లో భారతదేశపు అతిపెద్ద రియల్టీ సంస్థ అయిన డీఎల్ఎఫ్.. ఈ ఆర్థిక సంవత్సరంలో బుకింగ్స్ పరంగా కూడా అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది. -
ఖాళీ స్థలం చూపిస్తారు..మొత్తం చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే ఫ్లాట్..!
సాక్షి, హైదరాబాద్: కస్టమర్లకు ఆకాశంలో పిట్టను చూపించి కింద మసాలా నూరిస్తున్నారు డెవలపర్లు. ఖాళీ స్థలం చూపించి 10 అంతస్తులు, 20 ఫ్లోర్లు కడుతున్నామని నమ్మబలికి వంద శాతం సొమ్ము చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే దొరకుతుందని ఆశ చూపెడుతున్నారు. నిజమేనని నమ్మిన కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. సాధారణంగా డెవలపర్ చదరపు అడుగు (చ.అ.) రూ.5 వేలకు విక్రయిస్తుంటాడు. ప్రీ లాంచ్, యూడీఎస్ స్కీమ్స్‌లో వంద శాతం సొమ్ము చెల్లిస్తే మాత్రం రూ.3 వేలకే అమ్ముతారు. నిర్మాణ అనుమతులు వచ్చి, రెరాలో నమోదయ్యాక ఇందులో ధర రూ.5,500లకు చేరుతుంది. ఎందుకంటే ఆయా అనుమతుల కోసం డెవలపర్ కొంత ఆమ్యామ్యాలు సమర్పించుకుంటాడు కాబట్టి. ఈ ఖర్చును ధరను పెంచేసి భర్తీ చేసుకుంటాడు డెవలపర్. ఇదే ప్రాజెక్ట్‌లో ప్రీలాంచ్, యూడీఎస్లో కొనుగోలు చేసిన కొనుగోలుదారుడు చ.అ. రూ.3,500 చొప్పున రీసేల్‌కు పెడతాడు. కొనేందుకు వచ్చిన ఏ కస్టమర్ అయినా రీసేల్ ప్రాపర్టీకే ఆకర్షితుడవుతాడు. దీంతో డెవలపర్ వాటా ఫ్లాట్లు విక్రయం కాక చేతిలో నిర్మాణ వ్యయం లేక పనులను నిలిపివేస్తాడు. దీంతో ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోతుంది. ఎవరు నిర్మిస్తున్నారంటే? చిన్న కంపెనీలు మాత్రమే కాదు బడా కంపెనీలు కూడా ఇదే యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. ఇటీవల కోకాపేట, ఖానామేట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు కూడా యూడీఎస్ స్కీమ్‌తో పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేశాయి. ఇటీవలే నానక్‌రాంగూడలో హైరైజ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన మరొక నిర్మాణ సంస్థ, జూబ్లిహిల్స్ ప్రధాన కేంద్రంగా ఉన్న మరొక కంపెనీ ఇదే తరహా విక్రయాలు చేపడుతున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, కొల్లూరు, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా యూడీఎస్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. అంతా సోషల్ మీడియాలోనే.. యూడీఎస్ విధానంలో ఫ్లాట్లు లేదా స్థలాల విక్రయాల ప్రచార దందా సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. ప్రధాన కంపెనీలు తమ పాత కస్టమర్లకు ఇంటర్నల్ సేల్స్ చేస్తుంటే.. కొన్ని కంపెనీలేమో తమ పేరు బయట పడకుండా ఏజెంట్ల ద్వారా వాట్సాప్, ట్విట్టర్లలో ప్రచారం చేయిస్తున్నాయి. 100 శాతం పేమెంట్‌తో ఫ్లాట్లను అమ్మించే ఏజెంట్లకు అధిక శాతం కమీషన్‌ను అందిస్తున్నాయి. ప్రీలాంచ్, యూడీఎస్ ప్రాజెక్ట్‌లన్నీ పేపర్లు, బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏదీ ఉండదు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. సొంతిల్లు సొంతమవుతుందని నమ్మబలుకుతారు. అధిక కమీషన్‌కు ఆశపడి చాలా మంది ఏజెంట్లు యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. వీరంతా కేవలం తమ కమీషన్ గురించి ఆలోచిస్తున్నారే తప్ప.. రేపొద్దున సదరు బిల్డర్ అపార్ట్‌మెంట్‌ను కడతాడా? లేదా అని ఆలోచించట్లేదు. పొరపాటు బిల్డర్ ప్రాజెక్ట్‌ను కట్టకపోయినా.. సమయానికి డెలివరీ చేయకపోయినా నష్టపోయేది కొనుగోలుదారులే. ప్రభుత్వానికి నష్టం ఎలాగంటే? ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలోనే ఎక్కువ ఆదాయం సమకూరుతుంటుంది. కానీ, నిర్మాణ సంస్థలు హెచ్ఎండీఏ పరిధిలో చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ చార్జీలను దొడ్డిదారిన తగ్గించుకుంటున్నాయి. ఫ్లాట్ల అమ్మకాలకు బదులుగా ప్రాజెక్ట్ కంటే ముందే అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్)ను రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఫ్లాట్ కొంటే చెల్లించాల్సిన 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలకు బదులుగా.. యూడీఎస్లో సప్లమెంటరీ రిజిస్ట్రేషన్ కింద 1 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను మాత్రమే చెల్లిస్తున్నారు. యూడీఎస్లో చ.అ. ధర తక్కువగా ఉండటం, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకపోవటంతో కొనుగోలుదారులు ఈ తరహా ప్రాజెక్ట్‌లకు ఆకర్షితులవుతున్నారు. ఈ విధానంతో బిల్డర్లకు భారీగా ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. దేశంలో ఇప్పటివరకు టీఎస్ రెరాకు 70 వేలకు పైగానే ఫిర్యాదులు అందాయి. కానీ, ఒక్క కేసు నమోదు చేయలేదు. కేవలం నోటీసులు జారీ చేసి జరిమానాలతోనే సరిపెడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెçసులుబాటు అందుబాటులో ఉండగా.. మన రాష్ట్రంలో మాత్రం భౌతికంగా ఫిర్యాదు చేయాల్సిందే. ప్రభుత్వం ఏం చేయాలంటే? ► హెచ్ఎండీఏ, రెరా విభాగాలకు శాశ్వత చైర్మన్లను నియమించాలి. టౌన్‌ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరతను తీర్చాలి. రెరా అథారిటీ, అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. ► సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, రెరా విభాగాలను అనుసంధానించాలి. దీంతో ఆయా విభాగాల అనుమతులు జారీ అయితే రిజిస్ట్రేషన్ చేసేలా ఉండాలి. ► రెరాలో నమోదు కాకుండా విక్రయాలు జరిపే ఏజెంట్లు, మధ్యవర్తులపై క్రమశిక్షణరాహిత్య చర్యలు తీసుకోవాలి. ► రెరా అధికారులు, సిబ్బంది ఆఫీసులో కూర్చోవడానికి బదులు శివారు ప్రాంతాల్లో క్రమం తప్పకుండా క్షేత్ర పర్యటన చేయాలి. అప్పుడే ఏయే బిల్డర్లు మోసాలకు పాల్పడుతున్నారో తెలుస్తుంది. ► ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించి ఫేస్బుక్, ఇన్‌సాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో సాగే ప్రీలాంచ్, యూడీఎస్ ప్రచారాలు, రాయితీలపై ఆరా తీయాలి. ► ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ ఉండాలి. రెరా అథారిటీ ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నంబరు క్రియేట్ చేసి.. ఫ్లాట్లు, ప్లాట్లు కొనే వారు ముందస్తుగా తమకు సమాచారం ఇ వ్వాలని కోరాలి. ఈ నంబరు మొత్తం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగాలి. స్థిరాస్తిని కొనేముందు కొనుగోలుదారులు తప్పకుండా రెరాను సంప్రదించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ► పక్క రాష్ట్రంలో లోకల్ బాడీ ఫీజులు కూడా ప్రధాన విభాగమే కలెక్ట్ చేస్తుంది. డెవలపర్లు ప్లానింగ్ అనుమతుల కోసం లోకల్ బాడీకి వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, అధికారుల చేతివాటం రెండూ తగ్గుతాయి. -
అనుమతుల ఆలస్యంతోనే ప్రీలాంచ్ విక్రయాలు!
నెల తర్వాత చేసే ప్రయాణం కోసం ముందుగానే విమాన టికెట్లు బుకింగ్ చేసుకుంటాం. అభిమాన హీరో సినిమా వస్తుందంటే వారం ముందే ఆన్లైన్లో టికెట్లు కొనేస్తాం. ఎందుకు? తీరా టైంకి టికెట్లు దొరకవనో లేక దొరికినా ఎక్కువ రేట్లు ఉంటాయనో కదా. పైగా ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకుంటే ధర కూడా కలిసొస్తుంది. మరి, ముందస్తు బుకింగ్స్ రియల్ ఎస్టేట్‌లో చేస్తే తప్పేంటి? సాక్షి, హైదరాబాద్: ప్రీలాంచ్, సాఫ్ట్‌లాంచ్.. పేర్లు ఏవైనా వాటి అర్థం మాత్రం ఒక్కటే. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే విక్రయాలను మొదలుపెట్టడం అని! ఈ తరహా విక్రయాలు కొత్తవేం కాదు. ఎప్పటినుంచో ఉన్నవే. ప్రీలాంచ్తో కొనుగోలుదారులకు, డెవలపర్లకు ఇద్దరికీ లాభమే. కస్టమర్లకేమో ఫ్లాట్ తక్కువ ధరకు దొరికితే.. బిల్డర్లకేమో ముందుగానే కొంత సొమ్ము చేతికి అందుతుంది. ఈ సొమ్ము తక్షణమే నిర్మాణాన్ని మొదలుపెట్టడానికో లేక అనుమతుల ఫీజుల కోసమో ఉపయోగపడుతుంది. ప్రీలాంచ్లో డెవలపర్లు 10–15 శాతం వరకు ఫ్లాట్లను విక్రయిస్తుంటారు. కొందరు బిల్డర్లు తెలివిగా ఏం చేస్తారంటే.. మార్కెట్లో తమ కొత్త ప్రాజెక్ట్ తుది ధరను నిర్ణయించడం కోసమే ముందస్తు అమ్మకాలను ప్రకటిస్తుంటారు. ప్రీలాంచ్లో విక్రయాలు ఎందుకంటే.. ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ల్యాండ్ ఓనర్‌తో అగ్రిమెంట్ చేసుకున్న రోజు నుంచి అనుమతులు వచ్చే వరకు ఏడాదిన్నర కాలం పాటు డెవలపర్ వేచి చూడాలి. ఈలోపు ప్రాజెక్ట్ రుణానికి బ్యాంక్ వడ్డీ డెవలపర్ భరించాల్సిందే. కాంట్రాక్టర్లు, ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు ఇవన్నీ డెవలపర్లకు భారమే. పోనీ, అనుమతుల వరకూ వేచి ఉంటే మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. ఈలోపు డిమాండ్ అవకాశాలు కోల్పోతామనే పోటీతో డెవలపర్లు ప్రీలాంచ్ విక్రయాలను చేస్తున్నారని ఓ డెవలపర్ తెలిపారు. స్థలానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను నిర్ధారించుకున్నాకే కొనుగోలుదారులు ప్రీలాంచ్లో కొనుగోలుకు సిద్ధం కావాలి. నచ్చిన ప్రాంతం, తక్కువ ధర, పేరున్న బిల్డర్ అయితే కొనుగోలులో సందేహించాల్సిన అవసరం లేదు. సాధారణంగా నిర్మాణం పూర్తి కావడానికి 3–5 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే ముందస్తుగానే కొనుగోలు చేస్తే చక్కటి లాభాల్ని అందుకోవచ్చు. అనుమతుల్లో జాప్యం ఎందుకంటే? టీఎస్–బీపాస్‌లో నిర్మాణ అనుమతులు వారం లోపే వస్తున్నాయనేది అధికారులు, లీడర్ల మాట. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మున్సిపల్ అనుమతుల నుంచి మొదలుపెడితే రెవెన్యూ, ఇరిగేషన్, ఎన్విరాన్మెంటల్, ఫైర్, పోలీస్, ఎయిర్పోర్ట్ అథారిటీ.. ఇలా సుమారు 15 ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత రెరా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటి కోసం ఏడాదిన్నర పైనే సమయం పడుతుందని ఓ డెవలపర్ తెలిపారు. హెచ్ఎండీఏకు శాశ్వత కమిషనర్ లేకపోవటం, ఉన్న అధికారులు ఆఫీసులలో అందుబాటులో ఉండకపోవటం అనుమతుల ఆలస్యానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఏం చేయాలంటే? హైదరాబాద్‌లో ప్రీలాంచ్లో కొనుగోలు చేసి మోసపోయామనే కస్టమర్లు చాలా తక్కువ. ఏ డెవలపర్ ప్రీలాంచ్లో విక్రయిం చేసి చేతులుదులుపుకోడు. చాలా వరకు డెవలపర్ల మీద కొనుగోలుదారులు చేసే ప్రధానమైన ఫిర్యాదులు.. గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయడం లేదనే. జీహెచ్ఎంసీతో పోల్చితే హెచ్ఎండీఏ పరిధిలో ప్రీలాంచ్ విక్రయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జీహెచ్ఎంసీలో అధికారుల కొరత లేదు. దీంతో ఫీజు కట్టాక నెలన్నర లోపే ప్లానింగ్ అనుమతులు వస్తున్నాయి. అదే హెచ్ఎండీఏ పరిధిలో అయితే ఏడాదిన్నర అయినా గ్యారంటీ లేదు. ► హెచ్ఎండీఏకు శాశ్వత కమిషనర్‌ను, రెరాకు శాశ్వత చైర్మన్‌ను నియమించాలి. మున్సిపల్ శాఖ టౌన్‌ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరతను తీర్చాలి. ► పక్క రాష్ట్రంలో లోకల్ బాడీ ఫీజులు కూడా ప్రధాన విభాగమే కలెక్ట్ చేస్తుంది. డెవలపర్లు ప్లానింగ్ అనుమతుల కోసం లోకల్ బాడీకి వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, అధికారుల చేతివాటం రెండూ తగ్గుతాయి. -
ప్రీ లాంచ్ బెటరే!
► సాఫ్ట్ లాంచ్, ప్రీ లాంచ్ ఆఫర్లతో మేలంటున్న నిపుణులు ► అభివృద్ధి చెందే ప్రాంతంలో తక్కువ ధరకు స్థిరాస్తి సొంతం ► పేరున్న బిల్డర్.. నాణ్యమైన నిర్మాణాలనే ఎంచుకోవాలని సూచన ‘తక్కువ ధర.. అభివృద్ధి చెందే ప్రాంతం.. రెండేళ్లలో గృహ ప్రవేశం గ్యారంటీ’.. ఇవీ ప్రీ లాంచ్, సాఫ్ట్ లాంచ్ ఆఫర్ల పేరిట నిర్మాణ సంస్థలు చెప్పే మాటలు. కొన్ని సంస్థలు బహుమతులందిస్తే.. ఇంకొన్ని ప్రత్యేక రాయితీలందిస్తే.. మరికొన్ని చ.అ.కు రూ.200 వరకు తగ్గింపు చేస్తుంటాయి. పేరేదైనా.. ఆఫరేదైనా.. కొనుగోలుదారులకు ఇవి లాభసాటేనంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. సాక్షి, హైదరాబాద్: ఏ బిల్డర్‌ను కదిలించినా చెప్పే కామన్ మాట.. ‘ఎంక్వైరీలు జరుగుతున్నాయి కానీ, బుకింగ్స్ కావట్లేదని’! మరి కొనుగోలుదారులను ఆకర్షించేందుకు నిర్మాణ సంస్థలేం చేస్తున్నాయంటే.. సాఫ్ట్ లాంచ్, ప్రీ లాంచ్, ఇనాగ్రల్, లాంచింగ్ ఆఫర్ వంటి రకరకాల ఆఫర్లతో ఆకర్షించేస్తున్నాయి. నిర్మాణ సంస్థల సంగతి పక్కన పెడితే అసలీ ఆఫర్లతో కొనుగోలుదారులకు నిజంగా లాభమేనా అంటే.. అవుననే అంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. ప్రాజెక్ట్ ప్రారంభ సమయంలో సాఫ్ట్ లాంచ్ ఆఫర్ కింద చ.అ.కు రూ.200 వరకు తగ్గించారనుకుంటే.. 1,000 చ.అ. ఫ్లాట్ రూ.2 లక్షలు తగ్గుతుంది. అదే ఫ్లాట్ ప్రాజెక్ట్ పూర్తయ్యే లోపు (కనీసం రెండేళ్లు అనుకుంటే) గృహ ప్రవేశం సమయానికి ఆ ప్రాంతంలో చ.అ.కు రూ.200 వరకు ధర పెరుగుతుంది. అంటే మొత్తంమీద సొంతింట్లో కాలు పెట్టకముందే రూ.4 లక్షలు ఆదా చేసినట్టేగా!! రేటెప్పుడూ ఒకేలా ఉండదు.. ‘నిన్నటి ధర నేడుండదు.. నేటి ధర రేపుండదు..’ హైదరాబాద్ రియల్టీ మార్కెట్ తీరిదే. నిర్మాణ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నూతన పారిశ్రామిక విధానంతో నగరానికొస్తున్న కంపెనీలు, పెట్టుబడులు వంటి వాటితో సమీప భవిష్యత్తులో హైదరాబాద్ రియల్టీ పూర్వ వైభవానికి ఢోకా లేదని నిపుణుల అభిప్రాయం. ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌ని చూసిన వారెవ్వరైనా ఇప్పుడు నగరాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. ఐదేళ్లలో ఇంత మార్పులు చోటుచేసుకున్నాయా అని అనిపిస్తుంది. అదే ఉత్తరాది నగరాల్ని పరిశీలించండి. పదిహేనేళ్ల క్రితం అక్కడి మౌలిక సదుపాయాలు ఎలాగుండేవో ప్రస్తుతమూ అదే విధంగా ఉన్నాయి. మన నగరానికి.. కొన్ని ఇతర నగరాలకు గల తేడా ఇదే. గత కొన్నేళ్లుగా వివిధ నగరాల్లో ఉద్యోగం చేసి నగరంలో స్థిరపడ్డ ఒక నిపుణుడి అభిప్రాయమిది. ఇక్కడి అభివృద్ధిని గమనించే వారంతా సాఫ్ట్ లాంచ్ ఆఫర్ల వైపు దృష్టి పెట్టి.. చౌక ధరలో ఫ్లాట్లను సొంతం చేసుకుంటున్నారు. అత్తారింట్లో అల్లుడి మర్యాద.. ప్రాజెక్ట్ ఏదైనా.. నిర్మాణ సంస్థ ఏదైనా.. మొదటి కొనుగోలుదారులకు పండక్కి అత్తారింటికెళ్లే అల్లుడికిచ్చినంత మర్యాద కంపెనీ మీకిస్తుంది. కంపెనీ స్పెసిఫికేషన్స్ నచ్చకపోతే మార్పులు చేయమంటే విసుక్కోకుండా చేసి పెట్టే అవకాశం ఉంటుంది. మీకు విట్రిఫైడ్ టైల్స్ ఇష్టమనుకోండి.. మార్బుల్ వేస్తామన్న కంపెనీ మీ డిమాండ్‌కు దిగివస్తుంది. ఇంటీరియర్ డిజైనింగ్ విషయంలో మార్పులున్నా చేసి పెడతారు. నాణ్యత విషయంలో రాజీపడరు. ప్రాజెక్టు ఆరంభంలోనే ప్రతికూల ప్రచారాన్ని ఏ కంపెనీ కూడా కోరుకోదు కాబట్టి.. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాయి. నిర్మాణ సంస్థలకూ లాభమే.. కేవలం కొనుగోలుదారులకే కాదు.. బిల్డర్లకు, నిర్మాణ సంస్థలకూ ఈ విధానం ద్వారా ప్రయోజనం ఉంది. అనుమతులు రాక ముందే బ్యాంకులు కానీ, ఆర్థిక సంస్థలు కానీ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించవు. తప్పనిసరి పరిస్థితుల్లో బిల్డర్ బయటి వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ ఇబ్బందిని అధిగమించడానికి ‘సాఫ్ట్ లాంచ్’ అమ్మకాల్ని కొన్ని సంస్థలు ప్రకటిస్తాయి. ఆర్థిక వనరుల్ని సమకూర్చుకుంటాయి. అయితే ఇదంతా బిల్డర్‌కు కానీ, నిర్మాణ సంస్థలకు కానీ మార్కెట్లో ఉన్న పేరు ప్రఖ్యాతులపై ఆధారపడి ఉంటుంది. నిర్ణయం మంచిదే కానీ, సాఫ్ట్ లాంచ్‌లో కొనేటప్పుడు కేవలం ధర ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదు. అవసరమైతే న్యాయవాదులు, నిపుణుల సలహా తీసుకోవాలి. మంచి రికార్డు, దీర్ఘకాలిక చరిత్ర, ఆర్థిక స్థోమత ఉన్న కంపెనీల ఆఫర్లనే ఎంచుకోండి. మీరు కొనబోయే వెంచర్ ఎక్కడుంది? ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశమెంత? వంటి అంశాల్ని గమనించండి. చుట్టుపక్కల ఏమైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రానున్నాయా అనే విషయానికి పెద్దపీట వేయాలి. -
సొంతింటికి ఏదీ దారి?
సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. అయితే గృహ ప్రవేశానికి సిద్ధమైన వాటిలో కొనాలా? నిర్మాణం జరుగుతున్న వాటిలో తీసుకోవాలా? అనే విషయాలపై కొనుగోలుదారుల్లో తర్జనభర్జన ఉంటుంది. కొనుగోలుదారుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు పలువురు నిర్మాణరంగ నిపుణుల సలహాలివే.. సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం కొందరు డెవలపర్లకు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పరిస్థితులు అనుకూలించట్లేదు. ఒకసారి స్థానిక రాజకీయాంశం, మరోసారి నిర్మాణ సామగ్రి కష్టాలు, ఇంకోసారి కార్మికులు దొరక్క ఇబ్బందులు.. ఇలా రకరకాల సమస్యలతో స్థిరాస్తి రంగం అతలాకుతలం అవుతోంది. దేశంలో ఈ రంగం ఒక వెలుగు వెలుగుతున్నా హైదరాబాద్ మార్కెట్ మాత్రం నేటికీ ఏదోవిధంగా కష్టాలు పడుతూనే ఉంది. అయితే కొందరు బిల్డర్లు కష్టమో నష్టమో కాస్త ఆలస్యమైనా ఫ్లాటును కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారు. అలా పక్కాగా వ్యవహరించని వారితోనే కొనేవారికి ఇబ్బంది వస్తోంది. నిర్మాణపనుల్ని నెలల తరబడి సాగదీస్తూ అడిగిన వారికి ఏదో ఒక కారణాన్ని చూపెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. గుడ్డిగా నమ్మి కష్టార్జితాన్ని బిల్డర్ల చేతిలో పోయకూడదు. పది, పదిహేను నిర్మాణాలు చూసి, బ్రోకర్లను క్షుణ్నంగా గమనించి ప్రతీ అంశాన్ని బేరీజు వేసుకొని ఫ్లాట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒకసారి సొమ్ము కట్టేశాక.. వేచి చూసే ధోరణిని అవలంభించడం మినహాయించి మరెటువంటి ధైర్యాన్నీ చేయలేం. రేటెక్కువైనా: స్థిర నివాసం కోసం ఆరాటపడేవారు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనాలి. ఆరు నెలల్లోపు పూర్తయ్యే వాటిలోనూ కొనొచ్చు. మిగతా వాటితో పోల్చితే ఈ తరహా నిర్మాణాల్లో రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది.అలా కొని ఇలా ఇంట్లోకి వెళితే సేవాపన్నూ క ట్టాల్సిన అవసరం రాదు. మార్కెట్లో నగదు కొరత పెరిగిన నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాలే మేలు. గుడ్డిగా కొనొద్దు: పెట్టుబడి కోణంలో ఆలోచిస్తే బాగా నమ్ముకున్న బిల్డర్లు, డెవలపర్ల ప్రాజెక్టుల్లో ‘ప్రీ లాంచ్’లో కొనుక్కోవాలి. కాకపోతే అంతకంటే ముందు స్థలానికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నాయో తెలుసుకోవాలి. అంతేకాదు స్థల యజమాని, బిల్డర్ మధ్య రాతకోతలు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు.. ఇలా ప్రతీది పక్కాగా చూశాకే అంతిమ నిర్ణయానికి రావాలి. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టకుండా ప్రథమంగా ఇల్లు కొనేవారు సిద్ధంగా ఉన్నవాటిలో కొనుక్కోవడమే మేలు. కాకపోతే పెట్టుబడి దృష్టిలో ఆలోచించేవారికి ఈ తరహా ఇళ్లపై రాబడి తక్కువొస్తుంది. మూడేళ్ల క్రితమున్న రేటుకి ప్రస్తుత ధరకు ఎంతోకొంత వ్యత్యాసముండటమే ఇందుకు ప్రధాన కారణం. గృహ ప్రవేశానికి సిద్ధమైన ఇంటిని కొనడం కంటే నిర్మాణ పనులు జరుపుకుంటున్న ఇంటి ధర ఎంతలేదన్నా 20 నుంచి 25 శాతం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు.