సాక్షి, హైదరాబాద్: సొంతిల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. అయితే గృహ ప్రవేశానికి సిద్ధమైన వాటిలో కొనాలా? నిర్మాణం జరుగుతున్న వాటిలో తీసుకోవాలా? అనే విషయాలపై కొనుగోలుదారుల్లో తర్జనభర్జన ఉంటుంది.
కొనుగోలుదారుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు పలువురు నిర్మాణరంగ నిపుణుల సలహాలివే..
సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం కొందరు డెవలపర్లకు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పరిస్థితులు అనుకూలించట్లేదు. ఒకసారి స్థానిక రాజకీయాంశం, మరోసారి నిర్మాణ సామగ్రి కష్టాలు, ఇంకోసారి కార్మికులు దొరక్క ఇబ్బందులు.. ఇలా రకరకాల సమస్యలతో స్థిరాస్తి రంగం అతలాకుతలం అవుతోంది. దేశంలో ఈ రంగం ఒక వెలుగు వెలుగుతున్నా హైదరాబాద్ మార్కెట్ మాత్రం నేటికీ ఏదోవిధంగా కష్టాలు పడుతూనే ఉంది. అయితే కొందరు బిల్డర్లు కష్టమో నష్టమో కాస్త ఆలస్యమైనా ఫ్లాటును కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారు. అలా పక్కాగా వ్యవహరించని వారితోనే కొనేవారికి ఇబ్బంది వస్తోంది. నిర్మాణపనుల్ని నెలల తరబడి సాగదీస్తూ అడిగిన వారికి ఏదో ఒక కారణాన్ని చూపెడుతూ కాలక్షేపం చేస్తున్నారు.
గుడ్డిగా నమ్మి కష్టార్జితాన్ని బిల్డర్ల చేతిలో పోయకూడదు. పది, పదిహేను నిర్మాణాలు చూసి, బ్రోకర్లను క్షుణ్నంగా గమనించి ప్రతీ అంశాన్ని బేరీజు వేసుకొని ఫ్లాట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒకసారి సొమ్ము కట్టేశాక.. వేచి చూసే ధోరణిని అవలంభించడం మినహాయించి మరెటువంటి ధైర్యాన్నీ చేయలేం.
రేటెక్కువైనా: స్థిర నివాసం కోసం ఆరాటపడేవారు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనాలి. ఆరు నెలల్లోపు పూర్తయ్యే వాటిలోనూ కొనొచ్చు. మిగతా వాటితో పోల్చితే ఈ తరహా నిర్మాణాల్లో రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది.అలా కొని ఇలా ఇంట్లోకి వెళితే సేవాపన్నూ క ట్టాల్సిన అవసరం రాదు. మార్కెట్లో నగదు కొరత పెరిగిన నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాలే మేలు.
గుడ్డిగా కొనొద్దు: పెట్టుబడి కోణంలో ఆలోచిస్తే బాగా నమ్ముకున్న బిల్డర్లు, డెవలపర్ల ప్రాజెక్టుల్లో ‘ప్రీ లాంచ్’లో కొనుక్కోవాలి. కాకపోతే అంతకంటే ముందు స్థలానికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నాయో తెలుసుకోవాలి. అంతేకాదు స్థల యజమాని, బిల్డర్ మధ్య రాతకోతలు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు.. ఇలా ప్రతీది పక్కాగా చూశాకే అంతిమ నిర్ణయానికి రావాలి.
వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టకుండా ప్రథమంగా ఇల్లు కొనేవారు సిద్ధంగా ఉన్నవాటిలో కొనుక్కోవడమే మేలు. కాకపోతే పెట్టుబడి దృష్టిలో ఆలోచించేవారికి ఈ తరహా ఇళ్లపై రాబడి తక్కువొస్తుంది. మూడేళ్ల క్రితమున్న రేటుకి ప్రస్తుత ధరకు ఎంతోకొంత వ్యత్యాసముండటమే ఇందుకు ప్రధాన కారణం. గృహ ప్రవేశానికి సిద్ధమైన ఇంటిని కొనడం కంటే నిర్మాణ పనులు జరుపుకుంటున్న ఇంటి ధర ఎంతలేదన్నా 20 నుంచి 25 శాతం తక్కువగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు.
సొంతింటికి ఏదీ దారి?
Published Sat, May 3 2014 1:21 AM | Last Updated on Tue, Mar 19 2019 6:15 PM
Advertisement