600 మంది నుంచి రూ.150 కోట్లు వసూలు
ఆర్ హోమ్స్ నిర్వాహకుల అక్రమ బాగోతం
సైబరాబాద్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు
సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలోని వెంచర్స్‌లో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 600 మంది నుంచి దాదాపు రూ.150 కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఆర్ హోమ్స్ నిర్వాహకులపై బాధితులు శుక్రవారం సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు బాధితులు హైదరాబాద్ సీసీఎస్‌ను ఆశ్రయించి, ఆ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆర్ హోమ్స్ సంస్థ, దాని వెంచర్లు సైతం సైబరాబాద్ పరిధిలో ఉండటంతో పోలీసులు వారిని అక్కడికి పంపించారు.
కూకట్‌పల్లి కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థకు భాస్కర్ గుప్తా ఎండీగా, ఆయన భార్య సుధారాణి డైరెక్టర్‌గా ఉన్నారు. వీళ్లు జై వాసవి బ్లిస్ హైట్స్ సహా అనేక ప్రాజెక్టులు చేపట్టారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో చదరపు అడుగు రూ.2,199కి ఇస్తున్నట్లు 2020 నవంబర్‌లో ప్రకటించారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి కపిల్ దేవ్ (క్రికెటర్), ప్రసాద్ (క్రికెటర్), కోటి (మ్యూజిక్ డైరెక్టర్) తదితర ప్రముఖులతో ప్రచారం చేయించారు. దీంతో అనేక మంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందినవారు సొంతింటి కలను నెరవేర్చుకోవాలని వీరి వద్ద ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు.
దాదాపు 600 మంది రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల చొప్పున చెల్లించారు. రెండు నెలల్లో ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను పొందుతామని, 2023 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని భాస్కర్ గుప్తా, సుధారాణిలు నమ్మించారు. నిర్మాణంలో జాప్యంపై బాధితులు ప్రశ్నించచడంతో ధరణి, ఎన్నికలు సహా అనేక కారణాలు చెబుతూ వారు తప్పించుకున్నారు. ఈ సంస్థ ప్లాట్లు కూడా విక్రయిస్తామని, తమకు శివార్లలో అనేక చోట్ల భూములు ఉన్నాయని అవసరమైతే బాధితులకు వాటిని కేటాయిస్తామని నమ్మించింది. నారాయణ్‌ఖేడ్ , ఘట్‌కేసర్, పఠాన్ చెరు, కర్తనుర్ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్స్, ఫార్మ్ ల్యాండ్ పేరిటా వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment