
మొబైల్ ఇస్తారా ఒకసారి ఫోన్ చేసుకుంటామని కొందరు, మరికొందరు తమ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.. అర్జంటుగా బంధువులకు కాల్ చేసుకోవాలని చాలామంది మొబైల్ తీసుకుంటారు కదా. పాపం అని మనం కూడా చాలాసార్లు సాయం చేస్తుంటాం కూడా అయితే ఈ స్టోరీ చదివాక మరోసారి అలా ఇవ్వడానికి భయపడతారు. విషయం ఏమిటంటే..!
దారిన వెళ్లే ఓ వ్యక్తిని ఆపి ఫోన్ చేసుకుని ఇస్తామని మొబైల్ తీసుకుని ఇద్దరు వ్యక్తులు ఉడాయించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే...జూబ్లీహిల్స్ ఇందిరానగర్‌కు చెందిన నరేష్ రసైలి జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–9లోని నెట్‌వర్కింగ్ బిల్డింగ్‌లో గత నాలుగు సంవత్సరాలుగా వాచ్‌మెన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 12న రాత్రి 9 గంటల సమయంలో డ్యూటీకి వెళ్లాడు. తిరిగి మరుసటి రోజు 13వ తేదీన తెల్లవారుజామున 5.20 గంటలకు డ్యూటీ ముగించుకుని ఇంటిబాట పట్టాడు. వెంకటగిరి నుంచి వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటీపై అతని వద్దకు వచ్చి తమ మొబైల్ ఫోన్ రీఛార్జ్ గడువు ముగిసిందని, ఒక్కసారి నీ ఫోన్ ఇస్తే చేసుకుని ఇస్తామని నమ్మబలికారు. దీంతో నరేష్ తన ఫోన్‌ను వారికి ఇచ్చాడు. ఫోన్ తీసుకున్న ఆగంతకులు ఫోన్ చేసినట్లుగా నటించి బైక్‌పై ఉడాయించారు. ఈ సమయంలోనే బైక్‌పై వెనుక కూర్చొన్న ఆగంతకుడు నరేష్ జట్టు పట్టుకొని 5 మీటర్ల మేర లాక్కెళ్లాడు. ఈ ఘటనలో కిందపడిపోయిన నరేష్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నోట్ : నిజంగా ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో తప్పులేదు. కానీ అనామకులు, కేటుగాళ్లు పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే.!
ఇదీ చదవండి: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం!
వివాహిత అదృశ్యం
వెంగళరావునగర్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... బీదర్‌కు చెందిన ప్రకాశ్, రేష్మ దంపతులు ఎస్పీఆర్‌హిల్స్‌లో ఉంటారు. రేష్మ దుర్గంచెరువు ప్రాంతంలో హౌస్‌కీపింగ్ పనులు చేస్తుంది. ఈ నెల 10న ప్రకాశ్ కొబ్బరికాయల వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లగా భార్య విధులకు వెళ్లున్నట్టుగా చెప్పి బట్టలు సర్దుకుని వెళ్లింది. దాంతో ప్రకాశ్‌కు తన పెద్ద కుమార్తె ఫోన్ చేసి తన తల్లి దుస్తులు సర్దుకుని వెళ్లినట్టు తెలియజేసింది. అతను వచ్చి చూడగా కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో వెదికినా ప్రయోజనం లేదు. ఇదిలా ఉండగా తన భార్య తరచూ భాస్కర్ అనే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేదని అనుమానం వ్యక్తం చేస్తూ ప్రకాశ్ సోమవారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.