కింగ్ లాంటి మస్క్‌ను ముప్పుతిప్పలు పెట్టించింది.. అప్పులపాలు చేసింది!
Elon Musk Borrowed: ప్రపంచ కుబేరుడు, అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి పరిచయం అక్కరలేదు. పలు బిజినెస్‌లతో వేల కోట్లు సంపాదించి అత్యంత సంపన్నడిగా ఎదిగాడు. ఆయన ఎన్ని వ్యాపారాలు చేసినా ఎప్పుడూ ఇబ్బందులు ఎదర్కోలేదు. వాటిని విజయవంతంగా నిర్వహించాడు. కానీ ట్విటర్ (Twitter) (ఇప్పుడు ‘ఎక్స్’) మాత్రం మస్క్‌ను ముప్పుతిప్పలు పెట్టించింది.. అప్పులపాలు చేసింది!
(IT jobs data: దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!)
ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చెప్పేందుకు తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ట్విటర్ కొనుగోలు సమయంలో తనకు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్ (SpaceX) నుంచి 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,314 కోట్లు) రుణాన్ని తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా ఓ కథనం వెలువరించింది.
ట్విటర్ కోసమేనా..
స్పేస్ఎక్స్ గత అక్టోబర్‌లో ఎలాన్ మస్క్‌కు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించగా ఆ మొత్తాన్ని మస్క్ అదే నెలలో డ్రా చేశారని కొన్ని పత్రాలను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కాగా అదే అక్టోబర్ నెలలో మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ట్విటర్ కొనుగోలు మస్క్ ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసిందని, టెస్లాతో సహా తన ఇతర కంపెనీలలో తన షేర్ల మీద రుణం తీసుకోవడానికి బ్యాంకులతో ఏర్పాట్లు చేసుకున్నాడని నివేదిక పేర్కొంది. ఇందుకోసం స్పేస్ఎక్స్ రుణదాతగా వ్యవహరించిందని తెలిపింది. కాగా స్పేస్ఎక్స్లో మస్క్‌కు అత్యధిక వాటా ఉంది. మార్చి నాటికి ఆయన కంపెనీలో 42 శాతం వాటా, దాదాపు 79 శాతం ఓటింగ్ శక్తి కలిగి ఉన్నట్లు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌లో దాఖలు చేసిన నివేదికను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.