ప్రీ లాంచ్ బెటరే! | better to free lounch | Sakshi
Sakshi News home page

ప్రీ లాంచ్ బెటరే!

Published Sat, Dec 26 2015 12:22 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

ప్రీ లాంచ్ బెటరే! - Sakshi

ప్రీ లాంచ్ బెటరే!

 ► సాఫ్ట్ లాంచ్, ప్రీ లాంచ్ ఆఫర్లతో మేలంటున్న నిపుణులు
 అభివృద్ధి చెందే ప్రాంతంలో తక్కువ ధరకు స్థిరాస్తి సొంతం
 పేరున్న బిల్డర్.. నాణ్యమైన నిర్మాణాలనే ఎంచుకోవాలని సూచన


 ‘తక్కువ ధర.. అభివృద్ధి చెందే ప్రాంతం.. రెండేళ్లలో గృహ ప్రవేశం గ్యారంటీ’.. ఇవీ ప్రీ లాంచ్, సాఫ్ట్ లాంచ్ ఆఫర్ల పేరిట నిర్మాణ సంస్థలు చెప్పే మాటలు. కొన్ని సంస్థలు బహుమతులందిస్తే.. ఇంకొన్ని ప్రత్యేక రాయితీలందిస్తే.. మరికొన్ని చ.అ.కు రూ.200 వరకు తగ్గింపు చేస్తుంటాయి. పేరేదైనా.. ఆఫరేదైనా.. కొనుగోలుదారులకు ఇవి లాభసాటేనంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు.
 
 సాక్షి, హైదరాబాద్: ఏ బిల్డర్‌ను కదిలించినా చెప్పే కామన్ మాట.. ‘ఎంక్వైరీలు జరుగుతున్నాయి కానీ, బుకింగ్స్ కావట్లేదని’! మరి కొనుగోలుదారులను ఆకర్షించేందుకు నిర్మాణ సంస్థలేం చేస్తున్నాయంటే.. సాఫ్ట్ లాంచ్, ప్రీ లాంచ్, ఇనాగ్రల్, లాంచింగ్ ఆఫర్ వంటి రకరకాల ఆఫర్లతో ఆకర్షించేస్తున్నాయి. నిర్మాణ సంస్థల సంగతి పక్కన పెడితే అసలీ ఆఫర్లతో కొనుగోలుదారులకు నిజంగా లాభమేనా అంటే.. అవుననే అంటున్నారు నిపుణులు.
 
  అదెలాగంటే.. ప్రాజెక్ట్ ప్రారంభ సమయంలో సాఫ్ట్ లాంచ్ ఆఫర్ కింద చ.అ.కు రూ.200 వరకు తగ్గించారనుకుంటే.. 1,000 చ.అ. ఫ్లాట్ రూ.2 లక్షలు తగ్గుతుంది. అదే ఫ్లాట్ ప్రాజెక్ట్ పూర్తయ్యే లోపు (కనీసం రెండేళ్లు అనుకుంటే) గృహ ప్రవేశం సమయానికి ఆ ప్రాంతంలో చ.అ.కు రూ.200 వరకు ధర పెరుగుతుంది. అంటే మొత్తంమీద సొంతింట్లో కాలు పెట్టకముందే
 రూ.4 లక్షలు ఆదా చేసినట్టేగా!!
 
 రేటెప్పుడూ ఒకేలా ఉండదు..
 ‘నిన్నటి ధర నేడుండదు.. నేటి ధర రేపుండదు..’ హైదరాబాద్ రియల్టీ మార్కెట్ తీరిదే. నిర్మాణ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నూతన పారిశ్రామిక విధానంతో నగరానికొస్తున్న కంపెనీలు, పెట్టుబడులు వంటి వాటితో సమీప భవిష్యత్తులో హైదరాబాద్ రియల్టీ పూర్వ వైభవానికి ఢోకా లేదని నిపుణుల అభిప్రాయం. ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌ని చూసిన వారెవ్వరైనా ఇప్పుడు నగరాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. ఐదేళ్లలో ఇంత మార్పులు చోటుచేసుకున్నాయా అని అనిపిస్తుంది. అదే ఉత్తరాది నగరాల్ని పరిశీలించండి. పదిహేనేళ్ల క్రితం అక్కడి మౌలిక సదుపాయాలు ఎలాగుండేవో ప్రస్తుతమూ అదే విధంగా ఉన్నాయి. మన నగరానికి.. కొన్ని ఇతర నగరాలకు గల తేడా ఇదే. గత కొన్నేళ్లుగా వివిధ నగరాల్లో ఉద్యోగం చేసి నగరంలో స్థిరపడ్డ ఒక నిపుణుడి అభిప్రాయమిది. ఇక్కడి అభివృద్ధిని గమనించే వారంతా సాఫ్ట్ లాంచ్ ఆఫర్ల వైపు దృష్టి పెట్టి.. చౌక ధరలో ఫ్లాట్లను సొంతం
 చేసుకుంటున్నారు.
 
 అత్తారింట్లో అల్లుడి మర్యాద..
 ప్రాజెక్ట్ ఏదైనా.. నిర్మాణ సంస్థ ఏదైనా.. మొదటి కొనుగోలుదారులకు పండక్కి అత్తారింటికెళ్లే అల్లుడికిచ్చినంత మర్యాద కంపెనీ మీకిస్తుంది. కంపెనీ స్పెసిఫికేషన్స్ నచ్చకపోతే మార్పులు చేయమంటే విసుక్కోకుండా చేసి పెట్టే అవకాశం ఉంటుంది. మీకు విట్రిఫైడ్ టైల్స్ ఇష్టమనుకోండి.. మార్బుల్ వేస్తామన్న కంపెనీ మీ డిమాండ్‌కు దిగివస్తుంది. ఇంటీరియర్ డిజైనింగ్ విషయంలో మార్పులున్నా చేసి పెడతారు. నాణ్యత విషయంలో రాజీపడరు. ప్రాజెక్టు ఆరంభంలోనే ప్రతికూల ప్రచారాన్ని ఏ కంపెనీ కూడా కోరుకోదు కాబట్టి.. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు
 తీసుకుంటాయి.
 
 నిర్మాణ సంస్థలకూ లాభమే..
 కేవలం కొనుగోలుదారులకే కాదు.. బిల్డర్లకు, నిర్మాణ సంస్థలకూ ఈ విధానం ద్వారా ప్రయోజనం ఉంది. అనుమతులు రాక ముందే బ్యాంకులు కానీ, ఆర్థిక సంస్థలు కానీ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించవు. తప్పనిసరి పరిస్థితుల్లో బిల్డర్ బయటి వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ ఇబ్బందిని అధిగమించడానికి ‘సాఫ్ట్ లాంచ్’ అమ్మకాల్ని కొన్ని సంస్థలు ప్రకటిస్తాయి. ఆర్థిక వనరుల్ని సమకూర్చుకుంటాయి. అయితే ఇదంతా బిల్డర్‌కు కానీ, నిర్మాణ సంస్థలకు కానీ మార్కెట్లో ఉన్న పేరు ప్రఖ్యాతులపై ఆధారపడి ఉంటుంది.
 
 నిర్ణయం మంచిదే కానీ,
 సాఫ్ట్ లాంచ్‌లో కొనేటప్పుడు కేవలం ధర ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదు. అవసరమైతే న్యాయవాదులు, నిపుణుల సలహా తీసుకోవాలి. మంచి రికార్డు, దీర్ఘకాలిక చరిత్ర, ఆర్థిక స్థోమత ఉన్న కంపెనీల ఆఫర్లనే ఎంచుకోండి. మీరు కొనబోయే వెంచర్ ఎక్కడుంది? ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశమెంత? వంటి అంశాల్ని గమనించండి. చుట్టుపక్కల ఏమైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రానున్నాయా అనే విషయానికి పెద్దపీట వేయాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement