సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లిన పదేళ్ల అనుభవం కలిగిన బెంగళూరు మహిళా అభ్యర్థినికి చేదు అనుభవం ఎదురైంది. తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్వ్యూలో ప్రశ్నలు వస్తాయని భావించిన తనను బేసిక్, థెయరీ ప్రశ్నలు అడగడంతో అసహనానికి గురయ్యారు. దానికి సంబంధించిన వివరాలు ఆమె తన ‘రెడిట్’ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
‘నేను గత పదేళ్లుగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నాను. కంపెనీ మారాలని నిర్ణయించుకుని ఓ సంస్థ ఇంటర్వ్యూకు వెళ్లాను. ఆంగ్యులర్, జావాస్క్రిప్ట్, టైప్‌స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్ మొదలైన ఫ్రంటెండ్ టెక్నాలజీల్లో నాకు అనుభవం ఉంది. సాధారణంగా ఈ అనుభవ స్థాయిలో ఇంటర్వ్యూ చేసేవారు లాజికల్ థింకింగ్, పని అనుభవానికి సంబంధించి అడ్వాన్స్ కాన్సెప్ట్‌లు, రియల్‌లైఫ్ ఎక్స్‌పీరియన్స్, కోడింగ్ నైపుణ్యాలకు చెందిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. కానీ నేను ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ విచిత్రంగా థియరిటికల్ ప్రశ్నలపై దృష్టిపెట్టింది. సీఎస్‌ఎస్ ద్వారా భారత జాతీయ జెండాను డ్రా చేయమని అడిగారు. వెంటనే ఇండియన్ ఫ్లాగ్ డ్రా చేశాను. అందులో అశోక చక్రాన్ని గీయమని అడిగారు. నేను దాన్ని కూడా డ్రా చేశాను. ఆపై అశోక చక్రం లోపల స్పైక్‌లు(ఆకులు) గీయమన్నారు. నేను వాటిని డ్రా చేయలేకపోయాను. వెంటనే ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని అడిగాను. దీనికి ఆమె నా స్కిల్స్ పరీక్షించాలనుకుంటున్నట్లు సమాధానమిచ్చారు’ అని తెలిపారు.
ఇదీ చదవండి: మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!
‘ఫ్రంటెండ్ డెవలపర్‌గా పని చేయాలనుకునే వారికి ఇలాంటి ప్రశ్నలు అనవసరం. వాస్తవానికి కాలేజీ చదువుతున్నపుడు ప్రాక్టికల్ పరీక్షల సమయంలో మాకు ఇలాంటి ప్రశ్నలు వచ్చేవి. నాకు చాలా చిరాకేస్తుంది. నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోతున్నాను’ అని ఆమె పోస్ట్‌లో తెలిపింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. పదేళ్లు అనుభవం ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రశ్నలు అవసరంలేదని కొందరు అభిప్రాయపడ్డారు. అంత అనుభవం ఉన్నా బేసిక్ ప్రశ్నలకు ఎలా ఓపిగ్గా సమాధానం ఇస్తారో తెలుసుకోవడమే కంపెనీ ఉద్దేశమని ఇంకొందరు తెలిపారు. ఉద్యోగార్థుల స్వభావాన్ని తెలుసుకునేందుకే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని మరికొందరు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment