building permits
-
సీసీ కెమెరా ఉంటేనే నిర్మాణ అనుమతులు! రాచకొండ పోలీసుల ఆలోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల మంజూరులో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. సీసీ టీవీ (క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్) కెమెరా ఏర్పాటు చేస్తేనే భవనాలు, వాణిజ్య సముదాయాలకు అనుమతుల జారీకి రంగం సిద్ధ మవుతోంది. నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకంగా మారిన నేపథ్యంలో.. వాటి ఏర్పాటును భవన నిర్మాణ అనుమ తులలో భాగం చేస్తే మేలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఆలోచనకు వచ్చారు. ఈ మేరకు నిబంధనలను అమల్లోకి తేవాలంటూ రాష్ట్ర పురపాలకశాఖకు లేఖ రాసినట్టు తెలిసింది. ఇవేగాకుండా పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కార్యాలయాల వద్ద కూడా సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని కోరింది. ఇప్పటికే మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఉన్న ఈ విధానాన్ని అధ్యయనం చేసి.. తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. భారం తక్కువ.. భద్రత ఎక్కువ.. ఇప్పటివరకు గేటెడ్ కమ్యూనిటీలు, భారీ భవనాలు, కాలనీలలో నివాసితుల అసోసియేషన్లే సొంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కానీ అంతటా ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని, ఆ తర్వాతే జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ/డీటీసీపీలు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది. భారీ ఖర్చుతో అపార్ట్మెంట్లు, భవనాలను నిర్మించే డెవలపర్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటం పెద్ద భారమేమీ కాదని.. ఇదే సమయంలో మరింత భద్రత కూడా అని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కమాండ్ సెంటర్‌తో అనుసంధానంతో.. అంతర్రాష్ట్ర నిందితులు పలుచోట్ల తిష్ట వేసి చెయిన్ స్నాచింగ్‌లు, బ్యాంకులు, జ్యువెలరీ షాపుల లో దోపిడీలకు పాల్పడుతుండటం, అనుమానాస్పద హత్యలు, ఇతర నేరాలు చేస్తుండటం పెరిగిపోతోంది. ఈ క్రమంలో నేరాల నియంత్రణ, మరింత భద్రత కోసం సీసీ కెమెరాలన్నింటినీ ‘రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీఐసీసీసీ)’కు అనుసంధానించాలని పోలీసులు భావిస్తున్నారు. తద్వారా పాత నేరస్తుల కదలికలు, సున్నిత ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, నేరాలకు పాల్పడినవారు ఎక్కడున్నారన్నదీ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు తెలుసుకోగలుగుతారని చెప్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినా, అనుమానాస్పదంగా అనిపించినా.. స్థానిక పోలీసులను, పెట్రోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తారని వివరిస్తున్నారు. సీసీ కెమెరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలంటే..? భవనాల ప్రహరీపై నలువైపులా, ప్రవేశ, నిష్క్రమణ ద్వారం, మెట్ల మార్గం, లిఫ్టు దగ్గర, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అపార్ట్మెంట్లోని ప్రతీ అంతస్తు సీసీ కెమెరాలో రికార్డయ్యేలా చూసు కోవాలి. సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసిన చోట్లను జీపీఎస్ లొకేషన్‌తో సహా స్థానిక పోలీసుస్టేషన్లో నమోదు చేయాలి. ఆ కెమెరాల ఫుటేజీ కనీసం 30 రోజులు నిల్వ ఉండేలా చూసుకోవాలి. కెమెరాల పనితీరు, నిర్వహణ బాధ్యత సంబంధిత భవన యజమానిదే. ప్రజల గోప్యతకు ఏ మాత్రం భంగం కలిగించకుండా పోలీసులు ఆయా సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షిస్తారు. -
పారదర్శకత కోసమే టీఎస్‌బీపాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులను అత్యంత పారదర్శకంగా జారీ చేసేందుకు టీఎస్ బీపాస్‌ను ప్రవేశపెట్టినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. ఇదివరకు భవన నిర్మాణ అనుమతుల జారీలో భారీగా అవినీతి జరిగేదని, లంచాలు ఇచ్చి అనుమతులు పొందిన ఘటనలు అనేకమని అన్నారు. కానీ అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అనుమతులు ఇచ్చేందుకే టీఎస్ బీపాస్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. కేవలం 21 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని, నిర్దేశించిన గడువులోగా ఒకవేళ అనుమతి రాకుంటే ఆటోమేటిక్‌గా ఇచ్చినట్టే పరిగణించాలని పేర్కొన్నారు. టీఎస్ బీపాస్‌తో నిబంధనల మేరకే భవన నిర్మాణాలు ఉంటాయన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం శాసనమండలిలో జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ ఈ అంశంపై మాట్లాడారు. గృహ నిర్మాణ శాఖను రద్దుచేసి.. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ప్రజల కోరిక మేరకు జీవో 111 స్థానంలో జీవో 69 తీసుకొచ్చామని తెలిపారు. హిమాయత్‌సాగర్ కలుషితం కాకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు. మెట్రోరైలు రెండోదశకు శ్రీకారం మెట్రోరైలు రెండోదశకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, శంషాబాద్ నుంచి మైండ్ స్పేస్ వరకు 31 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే రూ. 650 కోట్ల వ్యయంతో నిర్మించనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ లైన్ కేవలం ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారి కోసమనే భావన ఉందని, కానీ అందులో వాస్తవం లేదని ఎవరైనా ఈ మార్గంలో ప్రయాణించవచ్చని స్పష్టంచేశారు. ప్రజారవాణాను అభివృద్ధి చేయాలనే కోణంలోనే మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. మరో రెండు మార్గాలకు సంబంధించిన డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించిందని, కానీ ఈ అంశంపైన కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని, కనీసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. అనంతరం మండలిలో తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లును మంత్రి ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. కాగా, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 అనుసూచి–8కి సవరణ ద్వారా భద్రాచలం, సారపాక, రాజంపేట ఏజెన్సీ గ్రామాలను ఒకటి లేక అంతకు మించి గ్రామపంచాయతీలుగా ఏర్పాటు, ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం సవరణ బిల్లుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. -
ఇల్లు కడుతున్నారా.. వెంటనే పర్మిషన్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతులను మరింత సులభతరం చేసినట్లు హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. 75 నుంచి 240 చదరపు గజాల వరకు ఉన్న స్థలాల్లో ఇళ్లు, స్టిల్ట్+2, జీ+1 అంతస్తుల భవనాల అనుమతుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సత్వరమే అనుమతులను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం భవన యజమానులు నేరుగా అధికారులను సంప్రదించాల్సిన అవసరం లేదు. టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సర్టిఫికెట్లను పరిశీలించి అనుమతులనిస్తారు. నాలుగు దశల్లో ఇది పూర్తవుతుంది. భవన నిర్మాణదారులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో ఈ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు సమర్పించిన సమాచారం సరైందేనని పేర్కొంటూ స్వీయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. మూడో దశలో ఆన్లైన్లో నిర్ణీత ఫీజు చెల్లించాలి. నాలుగో దశలో భవన యజమానులు అనుమతి పత్రాలను ఆన్లైన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీఎస్‌బీపాస్ అనుమతుల్లో సందేహాలపై టోల్‌ఫ్రీ నంబర్ 1800–5992266ను సంప్రదించవచ్చు. 040–22666666కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. వాట్సప్ ద్వారా సమాచారం కోసం ఫోన్: 9392215407ను సంప్రదించవచ్చు. (క్లిక్: సెల్ ఫోన్ డ్రైవింగ్ వీకెండ్లోనే ఎక్కువ.. ఎందుకంటే!) -
ఖాళీ స్థలం చూపిస్తారు..మొత్తం చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే ఫ్లాట్..!
సాక్షి, హైదరాబాద్: కస్టమర్లకు ఆకాశంలో పిట్టను చూపించి కింద మసాలా నూరిస్తున్నారు డెవలపర్లు. ఖాళీ స్థలం చూపించి 10 అంతస్తులు, 20 ఫ్లోర్లు కడుతున్నామని నమ్మబలికి వంద శాతం సొమ్ము చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే దొరకుతుందని ఆశ చూపెడుతున్నారు. నిజమేనని నమ్మిన కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. సాధారణంగా డెవలపర్ చదరపు అడుగు (చ.అ.) రూ.5 వేలకు విక్రయిస్తుంటాడు. ప్రీ లాంచ్, యూడీఎస్ స్కీమ్స్‌లో వంద శాతం సొమ్ము చెల్లిస్తే మాత్రం రూ.3 వేలకే అమ్ముతారు. నిర్మాణ అనుమతులు వచ్చి, రెరాలో నమోదయ్యాక ఇందులో ధర రూ.5,500లకు చేరుతుంది. ఎందుకంటే ఆయా అనుమతుల కోసం డెవలపర్ కొంత ఆమ్యామ్యాలు సమర్పించుకుంటాడు కాబట్టి. ఈ ఖర్చును ధరను పెంచేసి భర్తీ చేసుకుంటాడు డెవలపర్. ఇదే ప్రాజెక్ట్‌లో ప్రీలాంచ్, యూడీఎస్లో కొనుగోలు చేసిన కొనుగోలుదారుడు చ.అ. రూ.3,500 చొప్పున రీసేల్‌కు పెడతాడు. కొనేందుకు వచ్చిన ఏ కస్టమర్ అయినా రీసేల్ ప్రాపర్టీకే ఆకర్షితుడవుతాడు. దీంతో డెవలపర్ వాటా ఫ్లాట్లు విక్రయం కాక చేతిలో నిర్మాణ వ్యయం లేక పనులను నిలిపివేస్తాడు. దీంతో ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోతుంది. ఎవరు నిర్మిస్తున్నారంటే? చిన్న కంపెనీలు మాత్రమే కాదు బడా కంపెనీలు కూడా ఇదే యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. ఇటీవల కోకాపేట, ఖానామేట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు కూడా యూడీఎస్ స్కీమ్‌తో పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేశాయి. ఇటీవలే నానక్‌రాంగూడలో హైరైజ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన మరొక నిర్మాణ సంస్థ, జూబ్లిహిల్స్ ప్రధాన కేంద్రంగా ఉన్న మరొక కంపెనీ ఇదే తరహా విక్రయాలు చేపడుతున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, కొల్లూరు, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా యూడీఎస్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. అంతా సోషల్ మీడియాలోనే.. యూడీఎస్ విధానంలో ఫ్లాట్లు లేదా స్థలాల విక్రయాల ప్రచార దందా సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. ప్రధాన కంపెనీలు తమ పాత కస్టమర్లకు ఇంటర్నల్ సేల్స్ చేస్తుంటే.. కొన్ని కంపెనీలేమో తమ పేరు బయట పడకుండా ఏజెంట్ల ద్వారా వాట్సాప్, ట్విట్టర్లలో ప్రచారం చేయిస్తున్నాయి. 100 శాతం పేమెంట్‌తో ఫ్లాట్లను అమ్మించే ఏజెంట్లకు అధిక శాతం కమీషన్‌ను అందిస్తున్నాయి. ప్రీలాంచ్, యూడీఎస్ ప్రాజెక్ట్‌లన్నీ పేపర్లు, బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏదీ ఉండదు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు.. సొంతిల్లు సొంతమవుతుందని నమ్మబలుకుతారు. అధిక కమీషన్‌కు ఆశపడి చాలా మంది ఏజెంట్లు యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. వీరంతా కేవలం తమ కమీషన్ గురించి ఆలోచిస్తున్నారే తప్ప.. రేపొద్దున సదరు బిల్డర్ అపార్ట్‌మెంట్‌ను కడతాడా? లేదా అని ఆలోచించట్లేదు. పొరపాటు బిల్డర్ ప్రాజెక్ట్‌ను కట్టకపోయినా.. సమయానికి డెలివరీ చేయకపోయినా నష్టపోయేది కొనుగోలుదారులే. ప్రభుత్వానికి నష్టం ఎలాగంటే? ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలోనే ఎక్కువ ఆదాయం సమకూరుతుంటుంది. కానీ, నిర్మాణ సంస్థలు హెచ్ఎండీఏ పరిధిలో చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ చార్జీలను దొడ్డిదారిన తగ్గించుకుంటున్నాయి. ఫ్లాట్ల అమ్మకాలకు బదులుగా ప్రాజెక్ట్ కంటే ముందే అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్)ను రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఫ్లాట్ కొంటే చెల్లించాల్సిన 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలకు బదులుగా.. యూడీఎస్లో సప్లమెంటరీ రిజిస్ట్రేషన్ కింద 1 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను మాత్రమే చెల్లిస్తున్నారు. యూడీఎస్లో చ.అ. ధర తక్కువగా ఉండటం, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకపోవటంతో కొనుగోలుదారులు ఈ తరహా ప్రాజెక్ట్‌లకు ఆకర్షితులవుతున్నారు. ఈ విధానంతో బిల్డర్లకు భారీగా ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. దేశంలో ఇప్పటివరకు టీఎస్ రెరాకు 70 వేలకు పైగానే ఫిర్యాదులు అందాయి. కానీ, ఒక్క కేసు నమోదు చేయలేదు. కేవలం నోటీసులు జారీ చేసి జరిమానాలతోనే సరిపెడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెçసులుబాటు అందుబాటులో ఉండగా.. మన రాష్ట్రంలో మాత్రం భౌతికంగా ఫిర్యాదు చేయాల్సిందే. ప్రభుత్వం ఏం చేయాలంటే? ► హెచ్ఎండీఏ, రెరా విభాగాలకు శాశ్వత చైర్మన్లను నియమించాలి. టౌన్‌ప్లానింగ్ విభాగంలో అధికారుల కొరతను తీర్చాలి. రెరా అథారిటీ, అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. ► సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, రెరా విభాగాలను అనుసంధానించాలి. దీంతో ఆయా విభాగాల అనుమతులు జారీ అయితే రిజిస్ట్రేషన్ చేసేలా ఉండాలి. ► రెరాలో నమోదు కాకుండా విక్రయాలు జరిపే ఏజెంట్లు, మధ్యవర్తులపై క్రమశిక్షణరాహిత్య చర్యలు తీసుకోవాలి. ► రెరా అధికారులు, సిబ్బంది ఆఫీసులో కూర్చోవడానికి బదులు శివారు ప్రాంతాల్లో క్రమం తప్పకుండా క్షేత్ర పర్యటన చేయాలి. అప్పుడే ఏయే బిల్డర్లు మోసాలకు పాల్పడుతున్నారో తెలుస్తుంది. ► ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించి ఫేస్బుక్, ఇన్‌సాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో సాగే ప్రీలాంచ్, యూడీఎస్ ప్రచారాలు, రాయితీలపై ఆరా తీయాలి. ► ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ ఉండాలి. రెరా అథారిటీ ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నంబరు క్రియేట్ చేసి.. ఫ్లాట్లు, ప్లాట్లు కొనే వారు ముందస్తుగా తమకు సమాచారం ఇ వ్వాలని కోరాలి. ఈ నంబరు మొత్తం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగాలి. స్థిరాస్తిని కొనేముందు కొనుగోలుదారులు తప్పకుండా రెరాను సంప్రదించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ► పక్క రాష్ట్రంలో లోకల్ బాడీ ఫీజులు కూడా ప్రధాన విభాగమే కలెక్ట్ చేస్తుంది. డెవలపర్లు ప్లానింగ్ అనుమతుల కోసం లోకల్ బాడీకి వెళ్లాల్సిన అవసరం లేదు. దీంతో సమయం, అధికారుల చేతివాటం రెండూ తగ్గుతాయి. -
టీఎస్ బీపాస్‌కు కస్టమర్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్ : టీఎస్–బీపాస్ దరఖా స్తుదారుల నుంచి వసూలు చేయాల్సిన కస్టమర్ చార్జీలను ప్రభుత్వం ఖరారు చేసింది. భవన/లే–అవుట్లకు అనుమతుల కోసం వసూలు చేసే వివిధ రకాల ఫీజులు, చార్జీ లకు కస్టమర్ చార్జీలు అదనం కానున్నాయి. దరఖాస్తు సమయంలో ఆన్లైన్ ద్వారా ఈ రుసుంను చెల్లిం చాలి. ప్లాట్ విస్తీర్ణం ఆధారంగా వినియోగదారుల రుసుంను లెక్కించి వసూలు చేయనున్నారు. ప్లాట్ విస్తీర్ణం 500 చదరపు మీటర్లకు మించితే విస్తీర్ణం ఆధారంగా మొత్తం పర్మిషన్ ఫీజులో 1 శాతం నుంచి 2.50 శాతం వరకు కస్టమర్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్ చార్జీల వివరాలిలా ఉన్నాయి.. ప్లాట్ విస్తీర్ణం వినియోగ రుసుం 1. 75 చదరపు గజాలలోపు ఉచితం 2. 75 చదరపు గజాల నుంచి 200 చదరపు మీటర్లలోపు రూ.500 3. 200–500 చ.మీ. రూ.1000 4. 500–1000 చ.మీ. మొత్తం రుసుంలో 1% 5. 1,000 – 2,000 చ.మీ. మొత్తం రుసుంలో 2% 6. 2 వేల చ.మీ.కు పైన మొత్తం రుసుంలో 2.5% -
వాయిదాల్లో చెల్లించొచ్చు
సాక్షి, హైదరాబాద్ : భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, చార్జీల చెల్లింపులో ప్రభుత్వం రాష్ట్రమంతటికీ వెసులుబాటు కల్పించింది. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ ఫీజులను 4 సమ వాయిదాల్లో (6 నెలలకు ఒకటి... మొత్తం రెండేళ్ల వ్యవధి ఇస్తారు) చెల్లించడానికి వీలు కల్పిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. స్థిరాస్తి రం గాన్ని ప్రోత్సహించడానికి బిల్డింగ్ పర్మిట్ ఫీజు, బెటర్మెంట్, డెవలప్మెంట్, క్యాపిటలైజేషన్ చార్జీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండీఏల పరిధిలో వాయిదాల్లో చెల్లించడానికి అనుమతిస్తూ ఈ ఏడాది జులై 8న రాష్ట్ర ప్రభుత్వం జీవో 108ను జారీచేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు దీన్ని వర్తింపజేస్తూ అరవింద్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ♦ అన్ని రకాల చార్జీలను నాలుగు సమ అర్ధ వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు. ♦ ఫీజు ఇంటిమేషన్ లేఖ అందిన 30 రోజుల్లోగా తొలి వాయిదా చెల్లించాలి. ♦ ఎవరైనా బిల్డర్, డెవలపర్ బిల్డింగ్/ లే అవుట్ అనుమతుల సమయంలోనే మొత్తం ఫీజులు, చార్జీలు చెల్లించేందుకు ముందుకు వస్తే ఎర్లీబర్డ్ పథకం కింద మొత్తం ఫీజుల్లో 5 శాతం రాయితీ లభిస్తుంది. ♦ పోస్ట్‌డేటెడ్ చెక్కుల్లో పేర్కొన్న తేదీల్లోగా వాయిదాలను చెల్లించడంలో విఫలమైతే జాప్యం జరిగిన కాలానికి 12% వడ్డీతో కలిపి చెల్లించాలి. ♦ 2021 మార్చి 31 లోగా వచ్చే కొత్త దరఖాస్తులతో పాటు అన్ని పెండింగ్ దరఖాస్తులకు ఈ వెసులుబాటు వర్తించనుంది. -
నోటీసులు లేకుండానే కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్ : వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో కొత్త జీహెచ్ఎంసీ చట్టం తీసుకొస్తున్నామని రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వరద వెళ్లేందుకు మార్గం లేక ఇటీవల కురిసిన వర్షాలతో నగరంలోని చాలా కాలనీలు జలమయమయ్యాయని అన్నారు. చెరువుల ఎఫ్టీఎల్, నాలాలు, బఫర్ జోన్లలోని నిర్మాణాలను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసే అధికారం అధికారులకు కట్టబెడుతూ కొత్తగా తీసుకురానున్న జీహెచ్ఎంసీ చట్టంలో కఠినమైన నిబంధనలు పొందుపరచనున్నట్లు వెల్లడించారు. దీనికోసం అవసరమైతే న్యాయ నిపుణులు, న్యాయస్థానాలను సంప్రదిస్తామన్నారు. హైదరాబాద్ నగర ఉజ్వల భవిష్యత్ కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ అనుమతుల జారీకి కొత్తగా తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ సిస్టం(టీఎస్–బీపాస్)ను సోమవారం ఆయన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్–బీపాస్ విధానం దేశంలోనే అత్యుత్తమమైందని, ఒక రూపాయి లంచం ఇవ్వకుండానే ఇళ్ల నిర్మాణ అనుమతులు పొందేలా దీనికి రూపకల్పన చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇతర పాలసీల తరహాలో టీఎస్–బీపాస్ విధానం కూడా దేశానికి ఆదర్శంగా మారబోతుందన్నారు. బాధ్యతాయుతంగా మెలగాలి.. 75 చదరపు గజాల లోపు స్థలంలో నిర్మించే ఇళ్లకు అనుమతులు అవసరం లేదని, రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందన్నారు. 75 నుంచి 300 చదరపు గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం టీఎస్–బీపాస్ వెబ్సైట్లో స్వీయ ధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమెటిక్‌గా అనుమతులు జారీ అవుతాయన్నారు. అయితే, తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు పొందినా, నిర్మాణంలో సెట్ బ్యాక్ రూల్స్‌ను ఉల్లంఘించినా, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను కబ్జా చేసి ఇళ్ల నిర్మాణ అనుమతులు పొందినట్లు తేలినా తక్షణమే నోటీసులు లేకుండా కూల్చివేస్తారన్నారు. ఈ విషయంలో పౌరులు బాధ్యతాయుతంగా మెలగాలని, ప్రజల మేలు కోరి తీసుకొచ్చిన ఈ విధానాన్ని దుర్వినియోగం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. 300 చదరపు గజాలకు పైబడిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కేవలం 21 రోజుల్లోగా అన్ని రకాల అనుమతులను, ఎన్ఓసీలను జారీ చేస్తామన్నారు. దరఖాస్తుల్లో ఏవైనా లోపాలుంటే తొలి వారంలోనే దరఖాస్తుదారులకు తెలియజేసి వాటిని సరిదిద్దడానికి అవకాశం కల్పిస్తారన్నారు. ఒకవేళ గడువులోగా అనుమతులు రాకుంటే వచ్చినట్లు పరిగణించాలని చెప్పారు. అనుమతులకు చట్టబద్ధత.. టీఎస్–బీపాస్ ద్వారా జారీ చేసే తక్షణ ఇళ్ల అనుమతులకు చట్టబద్ధత ఉంటుందని, బ్యాంకుల నుంచి గృహ రుణాలు పొందడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. టీఎస్–బీపాస్ విధానాన్ని రెరా ఆథారిటీతో అనుసంధానం చేస్తామని, అనుమతులు పొందిన ప్రాజెక్టుల సమాచారం అటోమెటిక్‌గా రెరా ఆథారిటీకి వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే అత్యున్నతమైన జీవన ప్రమాణాలు, అత్యధిక ఆఫీస్ స్పేస్ వినియోగం కలిగిన నగరంగా హైదరాబాద్‌కు పేరుందని, నగరంలో స్థిరాస్తి వ్యాపారం బాగా జరుగుతోందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలకే ఇక్కడ ఇళ్లు లభిస్తాయని పేరుందని, డిమాండ్ ఉందని అడ్డగోలుగా ధరలు పెంచవద్దని స్థిరాస్తి వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. కొత్తగా అమలు చేస్తున్న టీఎస్–బీపాస్ విధానం అమలుపై కొంత కాలం పరిశీలన జరుపుతామని, ఆ తర్వాత అవసరమైన మార్పులు చేర్పులు తీసుకొస్తామని వెల్లడించారు. స్వీయ ధ్రువీకరణ ద్వారా ఇళ్లకు అనుమతి పొందిన పలువురు దరఖాస్తుదారులకు మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమంలో అనుమతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవందర్ రెడ్డి, డీటీసీపీ విద్యాధర్ రావు, క్రెడాయ్ రామకృష్ణా తదితరులు పాల్గొన్నారు. -
21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు
సాక్షి, హైదరాబాద్ : నగరాలు, పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతుల జారీలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను 21 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించింది. అనుమతి పొందిన/క్రమబద్ధీకరణ పొందిన లే అవుట్లలోని ప్లాట్ల విషయంలో తనిఖీలు అవసరం లేకుండానే దరఖాస్తుల పరిశీలన ప్రారంభించాలని సూచించింది. అనుమతుల జారీ/తిరస్కరణపై నిర్ణయాన్ని దరఖాస్తుదారులకు 21 రోజుల్లోగా రాతపూర్వకంగా తెలపని పక్షంలో సంబంధిత భవన నిర్మాణ ప్లాన్లతోనే సదరు దరఖాస్తులకు అనుమతి జారీ చేసినట్లు పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ విధంగా అనుమతులిచ్చినా, నియమ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరపడానికి అనుమతిచ్చినట్లు కాదని పేర్కొంది. 21 రోజుల గడువులోగా దరఖాస్తులకు అనుమతి జారీ/తిరస్కరణలో విఫలమైతే సంబంధిత అధికారులు, సిబ్బందిని బాధ్యులను చేసి జరిగిన జాప్యంలో రోజుకు రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దరఖాస్తుల్లో ఏవైనా పత్రాలు, సమాచారం కొరవడితే (షార్ట్‌ఫాల్) దరఖాస్తుదారులకు 10 రోజుల గడువులోగా సమాచారమివ్వాలని, 21 రోజుల గడువులోగా ఈ దరఖాస్తులను పరిష్కరించేందుకు కృషి చేయాలని స్పష్టం చేసింది. శనివారం ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇతర అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీలు, రాష్ట్రంలోని ఇతర అన్ని మునిసిపాలిటీలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. షార్ట్‌ఫాల్ గడువును అమలు చేయడంలో విఫలమైతే అందుకు కారణమైన అధికారులు, సిబ్బందిని బాధ్యులుగా చేసి జరిగిన జాప్యంలో రోజుకు రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పైన పైర్కొన్న గడువులను కచ్చితంగా అమలు చేసేందుకు 7 రోజుల్లోగా తనిఖీలు/పరిశీలనలు పూర్తి చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ/జీహెచ్ఎంసీలోని ల్యాండ్ సెక్షన్ కూడా సమాంతరంగా 7 రోజుల గడువులోగా భూ యాజమాన్య హక్కుల పరిశీలన జరిపి అభిప్రాయాన్ని తెలపాలని సూచించారు. దరఖాస్తుదారులను వేధింపులకు గురి చేయకుండా, సమగ్ర రూపంలో భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు దాఖలు అయ్యేలా చేసేందుకు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్స్‌ను బాధ్యులను చేయాలని పేర్కొన్నారు. అసమగ్రంగా/చెక్ లిస్ట్ పాటించకుండా/తప్పుడు సమాచారంతో దరఖాస్తులు సమర్పిస్తున్న లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్స్ మూడు పర్యాయాలు తప్పులు చేస్తే లైసెన్స్‌లు రద్దు చేసి వారి పేర్లను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వెబ్సైట్లలో బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. గడువులు ఎందుకంటే.. సరళీకృత వ్యాపార (ఈఓడీబీ) సంస్కరణల్లో భాగంగా ఏడాదిన్నర కింద లే అవుట్లు, భవన నిర్మాణాలకు ఆన్లైన్లో అనుమతుల జారీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సత్వరంగా అనుమతుల జారీ కోసం పలు ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లోపు తనిఖీ నివేదికలు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, అనుమతులు పొందిన/క్రమబద్ధీకరణ పొందిన లే అవుట్లలోని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతుల విషయంలో రిస్క్ బేస్డ్ క్లాసిఫికేషన్ ప్రక్రియ జరపాల్సిన అవసరం లేదని గతంలోనే తెలిపింది. అన్ని శాఖల అధికారులు ఒకేసారి తనిఖీలు జరపాలని సూచించింది. ఇలా అనుమతుల జారీ ప్రక్రియను ప్రభుత్వం సరళీకరించినా దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన/తనిఖీల విషయంలో ఆలస్యం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం 30 రోజుల్లో అనుమతులు జారీ చేయాల్సి ఉండగా.. ఆ గడువుకు రెండు మూడు రోజుల ముందు అదనపు సమాచారం, పత్రాలు కావాలని దరఖాస్తుదారులను కోరుతున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల్లోని ల్యాండ్ విభాగం దరఖాస్తుల పరిశీలనకు ఓ నిర్దేశిత సమయం అంటూ పాటించడం లేదు. మరి కొన్ని కేసుల్లో లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్స్ నిబంధనలకు అనుగుణంగా ఇంటి ప్లాన్స్‌ను సమర్పించకపోవడంతో దరఖాస్తులను తిరస్కరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా భవన నిర్మాణాల అనుమతుల జారీలో జాప్యాన్ని నివారించేందుకు గడువులు విధించింది. -
‘ఆన్లైన్’ అనుమతులు వేగవంతం
మూడు వారాల్లో164 భవనాలకు ఓకే మలిదశలో క్షేత్ర పరిశీలన లేకుండానే జారీకి ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతుల జారీ ప్రారంభించిన జీహెచ్ఎంసీ... ఈ ప్రక్రియ విజయవంతమవడంతో మరింత ఉత్సాహంతో ముందుకు కదులుతోంది. గడచిన మూడు వారాల్లో 164 భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేసింది. ఈ విధానం మంచి ఫలితాలనిస్తుండటంతో మలిదశలో... క్షేత్ర స్థాయి తనిఖీలు కూడా లేకుండా ప్రభుత్వ భూమి, యూఎల్సీ, హెచ్ఎండీఏ ల్యాండ్ యూజ్ తదితర వివరాలు సైతం ఆన్లైన్లోనే తెలిపేలా ప్రత్యేక ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. తద్వారా అధికారులకు సమయం కలసిరానుండటంతో మరింత త్వరితంగా అనుమతులు జారీ చేయవచ్చునని టౌన్‌ప్లానింగ్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ‘మాభూమి’ వెబ్‌సైట్‌తో అనుసంధానం దరఖాస్తు చేసుకున్న నెలలోగా అనుమతులిస్తామన్న మంత్రి కేటీఆర్ ప్రకటనకు అనుగుంణంగా, 21 రోజుల్లోనే అనుమతులు జారీ అయ్యేలా టౌన్‌ప్లానింగ్ విభాగం చర్య లు తీసుకుంటోంది. ఇప్పటి వదరకు అందిన దరఖాస్తుల్లో సర్కిళ్ల స్థాయిలో 140, జోనల్ స్థాయిలో 10, ప్రధాన కార్యాలయం స్థాయిలో 14 భవనాలకు అనుమతులు జారీ చేశారు. వీటిల్లో అత్యధికంగా ఎల్బీనగర్ సర్కిల్లో 48 ఉన్నాయి. కాగా, అబిడ్స్ (సర్కిల్-8)లో మాత్రం ఒక్క భవనానికి కూడా అనుమతి లభించలేదు. మలి దశలో క్షేత్రస్థాయి తనిఖీల్లేకుండానే అనుమతుల జారీకి రెవెన్యూ విభాగపు ‘మా భూమి’ వెబ్‌సైట్‌తో పాటు ఇతరత్రా అంశాల పరిశీలనకు సంబంధిత వెబ్సైట్లతో అనుసంధానం చేయనున్నారు. ఇందుకవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఎవరి వద్ద ఉంది.. క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత ఎంత సమయంలో వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు.. ఎక్కడైనా జాప్యం జరిగితే అది ఎవ రి వద్ద... ఎందుకు తదితర వివరాలు పైస్థాయి అధికారులు వారి కార్యాలయాల నుంచే వీక్షించే సదుపాయం ఉండటంతో వచ్చిన ఫైళ్లను వచ్చినట్లు పరిశీలిస్తున్నారు. సందేహాల నివృత్తికి సదుపాయ కేంద్రాలు ఆన్లైన్లో దరఖాస్తు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్న యజమానులు/ ఆర్కిటె క్టుల కోసం త్వరలోనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తును ప్రాసెస్ చేసే ఆటో డీసీఆర్ సాఫ్ట్వేర్ సాయంతో ప్లాన్‌లో ఏవైనా లోటుపాట్లున్నా ఫెసిలిటీ సెంటర్లలో తెలియజేస్తారన్నారు. దరఖాస్తు సమయంలో ఎదురయ్యే సందేహాలను నివృత్తిచేయడంతో పాటు అవసరమైన సహకారం అందిస్తారు. -
ఆన్లైన్లో భవన నిర్మాణాల అనుమతులు
- నవంబర్ 1 నుంచి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో అమలు - సాఫ్టెక్ సొల్యూషన్స్‌కు రూ. 26.06 కోట్లకు టెండర్ ఖరారు - రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో అమలుకు నిర్ణయం - విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీటీసీపీ రఘురామ్ సాక్షి, గుంటూరు: నగరపాలక సంస్థలు, పురపాలక సంఘ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా త్వరలో ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణాల అనుమతులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ (డీటీసీపీ) జి.వి.రఘురామ్ తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థలోని ప్రత్యేకాధికారి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంటి వద్ద నుంచి భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే.. కొద్ది రోజుల్లోనే ఆన్లైన్లో అనుమతులు పొందే ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాఫ్టెక్ సొల్యూషన్స్‌కు రూ.26.06 కోట్లకు టెండర్‌ను ఖరారు చేశామని చెప్పారు. ముందుగా పెలైట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరపాలక సంస్థల్లో నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జీఎంసీలో ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 83 బిల్డింగ్ ప్లాన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామని, అందులో 54 దరఖాస్తు దారుల వద్దే పెండింగ్ ఉన్నాయని వివరించారు. ఈ ఒక్క రోజులో 11 దరఖాస్తులు పూర్తి చేసి అనుమతులు ఇచ్చామని తెలిపారు. 200 చదరపు గజాల కంటే లోపు ఉన్న వారు దరఖాస్తుతోపాటు డబ్బు మొత్తం కట్టేస్తే రెండు లేదా మూడు రోజుల్లో అనుమతులు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. అనుమతుల మంజూరులో ఆలస్యం చేసిన ఓ బిల్డింగ్ ఇన్స్పెక్టర్కు రోజుకు రూ. 50 చొప్పున పెనాల్టీ వేశామని చెప్పారు. టీడీఆర్ బాండ్లకు కామన్ రిజిస్టర్ లేదని గుర్తించామని, దీని వల్ల ఇప్పటికి ఎన్ని తప్పులు జరిగాయనేది అటుంచితే భవిష్యత్తులో తప్పులు జరిగే ప్రమాదం ఉందని డీటీసీపీ అన్నారు. రోడ్డు, కాలువలు ఏర్పాటు చేయకపోతే అపార్ట్ మెంట్లకు అనుమతిచ్చే సమస్యే లేదు. ఖచ్చితంగా బీటీ రోడ్ ఏర్పాటు చేయాలి. బీపీఎస్‌ను అందరూ వినియోగించుకోవాలని డీటీసీపీ రఘురామ్ కోరారు. -
కేజీహెచ్‌కు త్వరలో నవశకం
విశాఖ మెడికల్: కేజీహెచ్ రూపురేఖలు త్వరలో మారనున్నాయి. కొత్త భవనాలు రానున్నాయి. నిధులున్నా ఏడాదిన్నరగా నిర్మాణ అనుమతులు రాక ఎదురుచూస్తున్న ఆసుపత్రిలోని ప్రతిష్టాత్మక సీఎస్ఆర్ (సామాజిక భాధ్యతానిధులు) ప్రాజెక్టు కింద వీటిని నిర్మించనున్నారు. రూ.70 కోట్ల వ్యయంతో ఆసుపత్రి ఆవరణలో పాత ఈఎన్టీ బ్లాకు స్థానే ఎకరా స్థలంలో పది అంతస్తుల సర్జికల్ ఆంకాలజీ సూపర్ స్పెషాలిటీ భవన సముదాయ నిర్మాణానికి ఏడాదిన్నర క్రితం శంకుస్థాపన చేసినా, ఇంతవరకు అనుమతులురాలేదు. దీంతో ఈప్రాజెక్టు చతికిలపడింది. ఈమేరకు ఆసుపత్రి వర్గాలు అనుమతులు కోసం పదేపదే ప్రతిపాదనలు పంపుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని,ఆశాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంలు తాజాగా ఈప్రాజెక్టు ప్రతిపాదనలు పంపాలంటూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో ఈప్రాజెక్టు నిర్మాణంపై ఆసుపత్రి వర్గాల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇందుకోసం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదనబాబు ఆసుపత్రి సర్వీసులు మౌలిక వసతుల సంస్థ డీఈ ప్రభాకర్ లు రెండురోజులు క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎస్ఆర్ ప్రాజెక్టు నిర్మాణానికి స్టీల్‌ప్లాంట్, పోర్టుట్రస్టు,ఓఎన్జీసీ,గెయిల్,ఎన్టీపీసీలు నిధులు సమకూర్చేందుకు కేజీహెచ్‌తో ఎంఓయూలను కుదుర్చుకున్నాయి. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ కూడా ఐదుకోట్లు ఇవ్వడానికి ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్రప్రభుత్వ సంస్థలు 65 కోట్ల రూపాయలను రానున్న నాలుగు ఐదు ఏళ్లలో దశల వారీగా ఇవ్వడానికి అంగీకారం తెలిపాయి. ఇందులో భాగంగా రూ.5 కోట్లు చెక్కును తొలివిడతగా ఓఎన్జీసీ ఇప్పటికే అందచేసింది. టీఎస్సార్ చొరవ: ఈప్రాజెక్టు నిర్మాణ నిధులను సేకరించడంలో రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాలతో చర్చించి నిధులు వచ్చేలా చొరవ చూపారు. వాస్తవానికి ఈప్రాజెక్టు నిర్మాణ అనుమతులు కోసం ప్రభుత్వానికి ఆర్నెళ్ల క్రితమే ప్రతిపాదనలు పంపగా అప్పట్లోనే అనుమతులు వస్తాయని ఆసుపత్రి వర్గాలు భావించాయి. ఈలోగా ప్రభుత్వం కేజీహెచ్ సమగ్ర అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ప్లాన్పైకి తమ దృష్టిని మరల్చడంతో ఈప్రాజెక్టు నిర్మాణ అనుమతులకు బ్రేక్ పడింది. మాస్టర్ ప్లానులో భాగంగా సీఎస్ఆర్ నిధులతో పాటు మరికొంత సొమ్మును జతచేసి వందకోట్లుతో మాస్టర్‌ప్లానును రూపొందించాలని ప్రభుత్వ పెద్దలు భావించారు. ఇందుకోసం సీఎస్ఆర్ భవన సముదాయానికి ముందు వరుసలో మరో పది అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించి వార్డులు, ఐసీయూలు అన్నింటినీ అందులోకి తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రస్తుతం అదే స్ధలంలో ఉన్న ఎముకలు,ప్రసూతి వార్డులను తొలగించాలని ఆలోచిస్తున్నట్టు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బహుల అంతస్తుల భవన నిర్మాణం కూడా సాకారమైతే కేజీహెచ్ మొత్తం సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌తో సహా 20అంతస్తులు భవన సముదాయాల కల నెరవేరనుంది. ఇవీ ప్రతిపాదనలు ఈప్రాజెక్టు కింద రానున్న పది అంతస్తుల సీఎస్ఆర్ర్ భవన సముదాయంలో ఐదు వందల పడకలు ఏర్పాటు కానున్నాయి. తొలిఅంతస్తులో క్యాన్సర్‌కు సంబంధించిన వైద్యసదుపాయాలు ఉంటాయి. తరువాతఅంతస్తులలో ఆపరేషన్ ధియేటర్ల కాంప్లెక్సు, సెమినార్ హాళ్లు, లెర్చర్హాళ్లు,రోగుల ప్రత్యేక గదులు, ఆరోగ్యశ్రీవార్డులుతోపాటు పలు రకాల వసతి సదుపాయాలు వచ్చే విధంగా ప్రణాళాకలను రూపొందించారు. దిగువ అంతస్తులో వాహనాల పార్కింగ్‌కు సదుపాయాన్ని కూడా కల్పించాలని నిర్ణయించారు.