‘ఆన్‌లైన్’ అనుమతులు వేగవంతం
మూడు వారాల్లో164 భవనాలకు ఓకే
మలిదశలో క్షేత్ర పరిశీలన లేకుండానే జారీకి ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతుల జారీ ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ... ఈ ప్రక్రియ విజయవంతమవడంతో మరింత ఉత్సాహంతో ముందుకు కదులుతోంది. గడచిన మూడు వారాల్లో 164 భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేసింది. ఈ విధానం మంచి ఫలితాలనిస్తుండటంతో మలిదశలో... క్షేత్ర స్థాయి తనిఖీలు కూడా లేకుండా ప్రభుత్వ భూమి, యూఎల్‌సీ, హెచ్‌ఎండీఏ ల్యాండ్ యూజ్ తదితర వివరాలు సైతం ఆన్‌లైన్‌లోనే తెలిపేలా ప్రత్యేక ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. తద్వారా అధికారులకు సమయం కలసిరానుండటంతో మరింత త్వరితంగా అనుమతులు జారీ చేయవచ్చునని టౌన్‌ప్లానింగ్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
‘మాభూమి’ వెబ్‌సైట్‌తో అనుసంధానం
దరఖాస్తు చేసుకున్న నెలలోగా అనుమతులిస్తామన్న మంత్రి కేటీఆర్ ప్రకటనకు అనుగుంణంగా, 21 రోజుల్లోనే అనుమతులు జారీ అయ్యేలా టౌన్‌ప్లానింగ్ విభాగం చర్య లు తీసుకుంటోంది. ఇప్పటి వదరకు అందిన దరఖాస్తుల్లో సర్కిళ్ల స్థాయిలో 140, జోనల్ స్థాయిలో 10, ప్రధాన కార్యాలయం స్థాయిలో 14 భవనాలకు అనుమతులు జారీ చేశారు. వీటిల్లో అత్యధికంగా ఎల్‌బీనగర్ సర్కిల్‌లో 48 ఉన్నాయి. కాగా, అబిడ్స్ (సర్కిల్-8)లో మాత్రం ఒక్క భవనానికి కూడా అనుమతి లభించలేదు. మలి దశలో క్షేత్రస్థాయి తనిఖీల్లేకుండానే అనుమతుల జారీకి రెవెన్యూ విభాగపు ‘మా భూమి’ వెబ్‌సైట్‌తో పాటు ఇతరత్రా అంశాల పరిశీలనకు సంబంధిత వెబ్‌సైట్లతో అనుసంధానం చేయనున్నారు. ఇందుకవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ఎవరి వద్ద ఉంది.. క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత ఎంత సమయంలో వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు.. ఎక్కడైనా జాప్యం జరిగితే అది ఎవ రి వద్ద... ఎందుకు తదితర వివరాలు పైస్థాయి అధికారులు వారి కార్యాలయాల నుంచే వీక్షించే సదుపాయం ఉండటంతో వచ్చిన ఫైళ్లను వచ్చినట్లు పరిశీలిస్తున్నారు.
సందేహాల నివృత్తికి సదుపాయ కేంద్రాలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్న యజమానులు/ ఆర్కిటె క్టుల కోసం త్వరలోనే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తును ప్రాసెస్ చేసే ఆటో డీసీఆర్ సాఫ్ట్‌వేర్ సాయంతో ప్లాన్‌లో ఏవైనా లోటుపాట్లున్నా ఫెసిలిటీ సెంటర్లలో తెలియజేస్తారన్నారు. దరఖాస్తు సమయంలో ఎదురయ్యే సందేహాలను నివృత్తిచేయడంతో పాటు అవసరమైన సహకారం అందిస్తారు.