భైంసా మున్సిపల్ కార్యాలయం
భైంసా(ముథోల్) : పట్టణాల్లో ఇళ్ల క్రమబద్ధీకరణ విషయంలో ఎన్ని ఆధునిక పద్ధతులు అనుసరిస్తున్నా అక్రమాలు ఆగడంలేదు. షాటిలైట్ ఆధారంగా జియోట్యాగింగ్ విధానంతో ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు ఇంటి పన్ను నిర్ధారణ ప్రక్రియను ప్రారంభించినా అక్రమాలు నిలుపడంలో విఫలమవుతున్నారు. మున్సిపాలిటీల్లోని పెద్దపెద్ద భవనాలు, ఇళ్లు, వ్యాపార సముదాయాలకు డిజిటల్‌లో సూచించిన లోన్‌ల ప్రకారం పన్నులు రావడంలేదు. దీంతో ప్రభుత్వం పట్టణాల్లో ఇళ్లకు డిజిటల్ నంబర్లను కేటాయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అమలులోకి తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్‌లకు ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు మున్సిపాలిటీల్లో...
జిల్లాలో నిర్మల్, భైంసా రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. నిర్మల్ మున్సిపాలిటీలో 36 వార్డులు, 1.10లక్షల జనాభా ఉన్నారు. భైంసా మున్సిపాలిటీలో 23 వార్డులు, 56వేల జనాభా ఉన్నారు. పట్టణాల్లోని వార్డులను వార్డులుగా లేదా బ్లాకులుగా విభజిస్తారు. బ్లాకుకు ఒక నంబరును కేటాయించి ఇళ్లకు వరుసగా నంబర్లు నమోదు చేస్తారు. ఖాళీస్థలాలు, ప్లాట్లు ఉన్న వాటికి నంబర్లు కేటాయించి పన్ను నిర్ధారిస్తారు. మున్సిపాలిటీలో ఒకటవ వార్డును ఒకటవ బ్లాకుగా గుర్తిస్తే ఆ వార్డుకు సైతం ఒకటవ నంబరు నమోదవుతుంది. ఒకటవబ్లాకు, ఒకటవ వీది, ఒకటవ ఇంటి నంబరు(111) ఇలా డిజిటల్ నంబరు నమోదవుతుంది. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో బ్లాకులు, వీధులను, ఇళ్లను ఇలా మూడంకెలతో నిర్ణయించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. వార్డు వారిగా డిజిటల్‌మ్యాప్‌లను ఆన్‌లైన్‌లో చేర్చి ఇల్లు, చిరునామా తెలుసుకునేలా పూర్తి సమాచారం అందుబాటులో ఉంచనున్నారు.
తొలగనున్న ఇబ్బందులు
ఇళ్లకు డిజిటల్ నంబర్లు నమోదుచేస్తే ఇంటి పన్ను విషయంలో ఎలాంటి అవకతవకలు జరుగవు. మున్సిపాలిటీ నిర్ధారించిన ఆదాయం సమకూరుతుంది. ప్రజలకు చిరునామ ఇబ్బందులు తొలగుతాయి. పట్టణానికి ఎవరైనా కొత్తవారు వస్తే ఇంటి చిరునామా డిజిటల్ నంబరు ఆధారంగా తెలిసిపోతుంది. ఈవిధానంతో పౌర సరఫరాల శాఖ, పోస్టల్, పోలీసు, టెలికాం, విద్యుత్‌శాఖ, జనాభాగణన, ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీలు, ఇతర సేవలకు సైతం ఇబ్బందులు తీరనున్నాయి. డిజిటల్ నంబర్లతో మున్సిపాలిటీల్లోనూ పారదర్శకత నెలకొనే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment