gio tagging
-
తొలిరోజు పింఛన్లు 96.5% మందికి
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయి గత రెండు నెలలుగా పింఛను తీసుకోలేకపోయినవారికి ఊరట కల్పిస్తూ బకాయిలతో కలిపి మూడు నెలల డబ్బులను సోమవారం ఒకేసారి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందచేసింది. వలంటీర్లు ఉదయమే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి 8 గంటల కల్లా 70 శాతం మందికి పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. ఉదయం పది గంటల కల్లా 83 శాతం పంపిణీ పూర్తయింది. రాత్రి 8 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 55,86,571 మందికి పింఛన్ డబ్బులు రూ.1,337.85 కోట్లు అందజేశారు. తొలిరోజు మొత్తంగా 96.5 శాతం మంది పింఛను డబ్బులు అందుకున్నారు. నెల్లూరులో లివర్ వ్యాధిగ్రస్తుడు హరికి పెన్షన్ ఇస్తున్న వలంటీర్లు జియో ట్యాగింగ్‌తో పారదర్శకంగా... కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా బయోమెట్రిక్ విధానంలో కాకుండా మొబైల్ యాప్ ద్వారా జియో ట్యాగింగ్‌తో లబ్ధిదారుల ఫోటో తీసుకుని వలంటీర్లు పారదర్శకంగా పెన్షన్ డబ్బులు అందజేశారు. –రాష్ట్రవ్యాప్తంగా 2,37,615 మంది గ్రామ, వార్డు వలంటీర్లు తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టారు. – లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 30 వేల మంది పింఛనుదారులు పెన్షన్ తీసుకోలేకపోతున్నట్లు వలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో వారికి బకాయిలతో కలిపి వచ్చే నెలలో చెల్లించేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు ఏర్పాట్లు చేశారు. అనివార్య కారణాలతో జూన్ నెల పెన్షన్ డబ్బులు తీసుకోలేకపోయిన వారికి జూలైలో బకాయితో కలిపి ఇస్తామని సెర్ఫ్ సీఈవో పి.రాజాబాబు తెలిపారు. వలంటీర్లకు మంత్రి పెద్దిరెడ్డి అభినందనలు రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 55 లక్షల మందికిపైగా పింఛన్ లబ్ధిదారులకు గంటల వ్యవధిలో నేరుగా డబ్బులు అందచేసిన వలంటీర్లను గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. కరోనా జాగ్రత్తలను పాటిస్తూ పెన్షన్లు పంపిణీ చేశారని చెప్పారు. పాలనను గ్రామస్థాయిలో ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపకల్పన చేసిన సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ సాధిస్తున్న ఫలితాలకు పెన్షన్ల పంపిణీ నిదర్శనమన్నారు. వలంటీర్ల విశేష కృషి – పిడుగులు పడ్డా పింఛన్ల పంపిణీ ఆగలేదు.. – పోర్టబులిటీ ద్వారా ఉన్నచోటే నిశ్చింతంగా పెన్షన్ – ఐసీయూల్లో ఉన్నా అందుకున్నా లబ్ధిదారులు విశాఖ ఏజెన్సీలో సకాలంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు వలంటీర్లు అడవిలో సాహస యాత్ర చేశారు. పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీలోని మారుమూల ప్రాంతమైన చింతగున్నలు, మాతికబంద గ్రామాలకు చెందిన వలంటీర్లు పాంగి రాంబాబు, లోంబేరి వెంకటరమణ ఈదురు గాలులు, భారీ వర్షంతో ఆదివారం సాయంత్రం అడవిలో పెన్షన్ డబ్బులతో చిక్కుపోయారు. చీకటి పడే సమయానికి వర్షం తగ్గడంతో గ్రామానికి సురక్షితంగా చేరుకుని ఉదయాన్నే యధావిధిగా పింఛన్ల సొమ్ము పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా చాబోలు గ్రామానికి చెందిన వితంతు మహిళ ఎస్తేరు అనారోగ్యంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది. గ్రామ వలంటీర్ ముస్తాక్ (దివ్యాంగుడు) సోమవారం ఐసీయూ వద్దే ఆమెకు పింఛన్ అందజేశాడు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం డి.చెక్కవారిపల్లి గ్రామ వలంటీర్ కోమలకు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆమె పరిధిలో 38 పింఛన్లు ఉండగా నడవలేని స్థితిలోనూ ఆటో అద్దెకు తీసుకొని మొదటి రోజు 35 మందికి పంపిణీ చేయడం విశేషం జగ్గయ్యపేటకు చెందిన 85 ఏళ్ల వృద్ధుడు ఉప్పుటూరి నాగేశ్వరరావు లాక్‌డౌన్‌తో తెలంగాణాలోని భద్రాచలంలో తన కుమార్తె ఇంట్లో చిక్కుకుపోయాడు. 10వ సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ కొండా దుర్గారావు ఆధ్వర్యంలో వలంటీర్లు ఎం.ముత్యంబాబు, ఆర్.వరప్రసాద్ సోమవారం భద్రాచలం వెళ్లి నాగేశ్వరరావుకు నాలుగు నెలల పింఛన్ రూ.9 వేలు అందించారు. ఒకటో తేదీ వచ్చిందంటే వలంటీర్లు కచ్చితంగా తమ ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందచేస్తారని లబ్ధిదారులు భరోసాగా ఉంటారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు 10వ వార్డు శ్రీనివాసనగర్‌లో దివ్యాంగుడైన వలంటీర్ అఫ్జల్ వృద్ధురాలు ఖాసిం బీకి వితంతు పించను అందచేశాడు. చిత్తూరులోని కట్టమంచికి చెందిన పుష్పవాణి మూత్రపిండాల వ్యాధితో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వార్డు వలంటీర్లు దినేష్‌బాబు, జగదీష్ సోమవారం ద్విచక్రవాహనంలో 140 కి.మీ ప్రయాణించి స్విమ్స్ ఆస్పత్రిలో పుష్పవాణికి రూ.10 వేల పెన్షన్ అందించారు. వాకాడుకు చెందిన ముగూరు పోలమ్మ రెండు నెలల నుంచి సూళ్లూరుపేట మండలం కడపట్రలో బంధువుల ఇంట్లో ఉండిపోయింది. సూళ్లూరుపేట నుంచి వాకాడు 53 కిలో మీటర్ల దూరం ఉంది. పోర్టబిలిటీ ద్వారా ఆమెకు సూళ్లూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం రెండు నెలల పింఛన్ అందజేశారు. పట్టణంలో ఉంటున్న మరో 10 మందికి కూడా ఇలాగే అందించారు. -
అందరికీ రుణపడి ఉంటాం: డీజీపీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతిక బృందాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. డీజీపీ శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారిపై నిఘా కోసం అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించినట్లు వెల్లడించారు. దేశంలోనే మొదటిసారిగా హోం క్వారంటైన్ యాప్ ద్వారా జియో ఫెన్సింగ్ టెక్నాలజీతో పర్యవేక్షించినట్లు చెప్పారు. (సమన్వయంతో పోరాడుతున్నాం) 22,478 మందిపై ఇరవై ఎనిమిది రోజులపాటు నిఘా ఏర్పాటు చేశామని, జియో ఫెన్సింగ్ టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘించిన 3043 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు. 28 రోజుల హోం క్వారంటెన్ పూర్తి కావడంతో వారిపైన ఉన్న ప్రత్యేక ఆంక్షలను తొలగిస్తున్నట్లు చెప్పారు. యాప్ ద్వారా అత్యధికంగా తూర్పు గోదావరి, విశాఖ పట్నం జిల్లాలలో ఎక్కువ మందిపై నిఘా పెట్టామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సాధారణ ప్రజలతో కలసి బయట తిరిగేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని డీజీపీ తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాల వారిపై నిఘా కోసం సాంకేతికత పరిజ్ఞానంతో మరో మొబైలు యాప్ సిద్ధం చేస్తున్నామన్నారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు పోలీస్ శాఖకు సహకరించడం వారి దేశ భక్తికి నిదర్శనని కొనియాడారు. కరోనా కట్టడికి సహకరించిన వారికి సర్వదా రుణపడి ఉంటామన్నారు. (కోవిడ్ పరీక్షల్లో.. మరింత దూకుడు) -
ఎన్నికలకు సర్వం సిద్ధం..
సాక్షి, కల్వకుర్తి టౌన్ : రానున్న ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు నమోదు దరఖాస్తు గడువు పూర్తయింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ పక్క రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నం కాగా.. అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లను జియో ట్యాగింగ్ చేశారు. దీనికోసం లాంగిట్యూడ్, లాటిట్యూడ్ పక్రియ పూర్తయింది. తద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ పోలింగ్ స్టేషన్లో జరిగే పోలింగ్ సరళినైనా అధికారులు పరిశీలించే వెసలుబాటు కలగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలే కాకుండా మారుమూల గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల జియో ట్యాగింగ్ కూడా పూర్తయింది. ఇందుకోసం ప్రతీ పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ల ఛాయాచిత్రాలను ఎస్ఐలు, సిబ్బంది ట్యాబ్‌ల ద్వారా సేకరించి జియో ట్యాగింగ్ చేశారు. తద్వారా పోలింగ్ స్టేషన్ ఆవరణలో ఏవైనా అనుకోని సంఘటనలు, గొడవలు జరిగితే రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుర్తించేందుకు వెసలుబాటు కలుగుతుంది. దీంతో కింది స్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఘటనా స్థలానికి పంపించేందుకు జియో ట్యాగింగ్ ఉపయోగపడనుంది. పకడ్బందీగా నిర్వహించేందుకు... ముందస్తు ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ముందుచూపుతో వ్యవహరిస్తోంది. జిల్లాలోని సున్నితమైన ప్రాంతాలను, అత్యంత సున్నితమైన ప్రాంతాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పక్రియ చివరి దశకు చేరుకుంది. పోలింగ్ కేంద్రాలలో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల భవనాలు, ప్రభుత్వ కార్యాలయ భవనాల్లో ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు జరిగి కేసులు నమోదై ఉంటే ఆ ఘటనలను పరిగణనలోకి తీసుకుని వాటిపై ప్రత్యేక నిఘా ఉంచునున్నారు. పాత నేరస్తులపై నిఘా అన్ని పోలింగ్ కేంద్రాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటుగా ఆయా పోలింగ్ కేంద్రాలలో ఉన్న పాత నేరస్తులు, హిస్టరీ షీట్స్ ఉన్న వ్యక్తులు, ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోనే కాకుండా నియోజకవర్గ పరిధిలో ఉన్న వారందరినీ బైండోవర్ చేస్తున్నారు. తద్వారా వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు అవకాశం కలుగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఆయా వ్యక్తులు ఎక్కడకు వెళ్తున్నారు, ఇంకా నేర ప్రవృత్తిలో యాక్టివ్‌గా ఉన్నారా, లేదా అన్న పూర్తి విషయాలపై సమాచారాన్ని కూడా సిద్ధం చేశారు. గుర్తింపు సులభం.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,635 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ మేరకు నాగర్‌కర్నూల్ జిల్లాలో 775 పోలింగ్ కేంద్రాలు, వనపర్తి జిల్లాలో 278, జోగులాంబ గద్వాల జిల్లాలో 507, మహబూబ్‌నగర్ జిల్లాలో 1,332 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించినప్పుడు నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని అత్యధిక మండలాలు రంగారెడ్డి జిల్లా కలవటంతో ఎన్నికల నిర్వహణ బాధ్యత అంతా రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లపోయింది. షాద్‌నగర్ నియోజకవర్గం కూడా రంగారెడ్డి జిల్లాలోకి, కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలు వికారాబాద్ జిల్లాలోకి వెళ్లిపోయాయి. ఇలా వెళ్లిన నియోజకవర్గాల ఎన్నికల పక్రియ ఆయా నూతన జిల్లాల అధికారులే నిర్వహిస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 257 పోలింగ్ కేంద్రాలు, కొడంగల్‌లో 264 పోలింగ్ కేంద్రాలు, షాద్‌నగర్‌లో 242 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సీసీ కెమెరాలతో నిఘా ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ గట్టి బందోబస్తులో పాటు పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం ప్రతీ పోలింగ్ స్టేషన్‌ను జియో ట్యాగింగ్ చేశారు. అలాగే, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను జియో ట్యాగింగ్ పక్రియ పూర్తయింది. జియో ట్యాగింగ్ చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయా మండల పోలీస్ స్టేషన్‌కు అనుసంధానించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. జియో ట్యాగింగ్ చేసిన పోలింగ్ స్టేషన్లను ప్రత్యేక విభాగం ద్వారా పరిశీలించనున్నారు. అంతేకాకుండా మొత్తం పోలింగ్ కేంద్రాలపై జియో ట్యాగింగ్‌తో పాటుగా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఆయా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ పోలింగ్ నిర్వహణ తీరు ఎలా ఉందనే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర స్థాయిలో డీజీపీ తెలుసుకొనే వెసులుబాటు కలగనుంది. జియో ట్యాగింగ్ పూర్తయింది.. అన్ని పోలింగ్ కేం ద్రాలను జియో ట్యాగింగ్ ద్వారా ల్యాంగిట్యూడ్, లాటిట్యూడ్ పూర్తి చేశాం. నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మరికొన్ని చోట్ల కేంద్రాలను అదే గ్రామంలో వేరే ప్రాంతానికి మార్చటం వల్ల వాటి జియోట్యాగింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఇప్పటికే దాదాపుగా అన్ని పోలింగ్ స్టేషన్లను జియోట్యాగింగ్ చేసి ఆయా మండలాల పోలీస్స్టేషన్లకు అనుసంధానం చేశాం. పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి ఉంచి, వారి కార్యాకలాపాలపై నిఘా పెంచాం. - పుష్పారెడ్డి, కల్వకుర్తి డీఎస్పీ -
ఇంటికి ఇక డిజిటల్ నంబర్
భైంసా(ముథోల్) : పట్టణాల్లో ఇళ్ల క్రమబద్ధీకరణ విషయంలో ఎన్ని ఆధునిక పద్ధతులు అనుసరిస్తున్నా అక్రమాలు ఆగడంలేదు. షాటిలైట్ ఆధారంగా జియోట్యాగింగ్ విధానంతో ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు ఇంటి పన్ను నిర్ధారణ ప్రక్రియను ప్రారంభించినా అక్రమాలు నిలుపడంలో విఫలమవుతున్నారు. మున్సిపాలిటీల్లోని పెద్దపెద్ద భవనాలు, ఇళ్లు, వ్యాపార సముదాయాలకు డిజిటల్లో సూచించిన లోన్ల ప్రకారం పన్నులు రావడంలేదు. దీంతో ప్రభుత్వం పట్టణాల్లో ఇళ్లకు డిజిటల్ నంబర్లను కేటాయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అమలులోకి తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు మున్సిపాలిటీల్లో... జిల్లాలో నిర్మల్, భైంసా రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. నిర్మల్ మున్సిపాలిటీలో 36 వార్డులు, 1.10లక్షల జనాభా ఉన్నారు. భైంసా మున్సిపాలిటీలో 23 వార్డులు, 56వేల జనాభా ఉన్నారు. పట్టణాల్లోని వార్డులను వార్డులుగా లేదా బ్లాకులుగా విభజిస్తారు. బ్లాకుకు ఒక నంబరును కేటాయించి ఇళ్లకు వరుసగా నంబర్లు నమోదు చేస్తారు. ఖాళీస్థలాలు, ప్లాట్లు ఉన్న వాటికి నంబర్లు కేటాయించి పన్ను నిర్ధారిస్తారు. మున్సిపాలిటీలో ఒకటవ వార్డును ఒకటవ బ్లాకుగా గుర్తిస్తే ఆ వార్డుకు సైతం ఒకటవ నంబరు నమోదవుతుంది. ఒకటవబ్లాకు, ఒకటవ వీది, ఒకటవ ఇంటి నంబరు(111) ఇలా డిజిటల్ నంబరు నమోదవుతుంది. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో బ్లాకులు, వీధులను, ఇళ్లను ఇలా మూడంకెలతో నిర్ణయించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. వార్డు వారిగా డిజిటల్మ్యాప్లను ఆన్లైన్లో చేర్చి ఇల్లు, చిరునామా తెలుసుకునేలా పూర్తి సమాచారం అందుబాటులో ఉంచనున్నారు. తొలగనున్న ఇబ్బందులు ఇళ్లకు డిజిటల్ నంబర్లు నమోదుచేస్తే ఇంటి పన్ను విషయంలో ఎలాంటి అవకతవకలు జరుగవు. మున్సిపాలిటీ నిర్ధారించిన ఆదాయం సమకూరుతుంది. ప్రజలకు చిరునామ ఇబ్బందులు తొలగుతాయి. పట్టణానికి ఎవరైనా కొత్తవారు వస్తే ఇంటి చిరునామా డిజిటల్ నంబరు ఆధారంగా తెలిసిపోతుంది. ఈవిధానంతో పౌర సరఫరాల శాఖ, పోస్టల్, పోలీసు, టెలికాం, విద్యుత్‌శాఖ, జనాభాగణన, ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీలు, ఇతర సేవలకు సైతం ఇబ్బందులు తీరనున్నాయి. డిజిటల్ నంబర్లతో మున్సిపాలిటీల్లోనూ పారదర్శకత నెలకొనే అవకాశం ఉంటుంది. -
'జియో'మంతర్ 'ఖాళీ'!
- సొంతింటి కలకు 'జియో ట్యాగింగ్' గ్రహణం – సమన్వయంతో సాగని డ్వామా, హౌసింగ్ అధికారులు – గృహనిర్మాణ సంస్థకు అనుమతులు మంజూరు – ఉపాధి కోటా కింద అనుమతులే రాని వైనం – జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్లతో 'బిల్లులు' కష్టం అనంతపురం టౌన్ : పేదల సొంతింటి కలకు 'జియో' గ్రహణం పట్టుకుంది. గృహ నిర్మాణ సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు సమన్వయంతో వెళ్లాల్సి ఉన్నా.. ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన సాగుతున్నారు. ఇప్పటికే ఇళ్లు మంజూరయ్యాయి..గ్రౌండింగ్‌కు వెళ్లి ఖాళీ స్థలాలకు జియోట్యాగింగ్ ప్రారంభిస్తామని హౌసింగ్ అధికారులు చెబుతుంటే.. మా ఫైల్ ఇంకా పెండింగ్‌లోనే ఉందంటూ డ్వామా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలీని పరిస్థితి నెలకొంది. వేర్వేరుగా అనుమతులు రావాల్సిందే! ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీంకు సంబంధించి రూ.1.50 లక్షలతో 200 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.95 వేలు, ఉపాధి నిధులు రూ.55 వేలు చెల్లిస్తారు. ఈ మొత్తమంతా సబ్సిడీనే. ఉపాధి నిధులకు సంబంధించి ఇంటి నిర్మాణం పూర్తయ్యేలోపు 90 రోజుల పనిదినాలు చేయాల్సి ఉంటుంది. రోజుకు రూ.194 వేతనం చొప్పున కూలికి రూ.17,460, ఇటుకల కోసం రూ.25,540, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలను ఉపాధి నిధుల నుంచి కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో డ్వామా, హౌసింగ్లకు వేర్వేరుగా అనుమతులు రావాల్సి ఉంటుంది. అనంతపురం, హిందూపురం నియోజకవర్గాల్లో 350 ఇళ్లు చొప్పున, మిగిలిన 12 నియోజకవర్గాలకు 900 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం గృహ నిర్మాణ సంస్థకు ఇచ్చే రూ.95 వేల సబ్సిడీ(ఒక్కో యూనిట్)కి సంబంధించి సుమారు 7,600 ఇళ్ల నిర్మాణాలకు కలెక్టర్ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధి కింద వచ్చే రూ.55 వేలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అనుమతులు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం డ్వామా తరఫున 5,822 ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలను కలెక్టర్‌కు పంపారు. వీటికి అనుమతులు వచ్చాకే ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాల్సి ఉంటుంది. అంటే ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీంకు సంబంధించి గృహ నిర్మాణ సంస్థకు ఎన్ని ఇళ్లు మంజూరు చేసినా ఫలితం లేదు. అంతిమంగా డ్వామా అధికారులకు మంజూరయ్యేవే లెక్కలోకి తీసుకోవాల్సిన పరిస్థితి. జియోట్యాగింగ్‌తో గుబులు ఇళ్ల నిర్మాణాలకు ప్రస్తుతం జియోట్యాగింగ్ గుబులు పట్టుకుంది. లబ్ధిదారులకు బిల్లులను బేస్మెంట్, రూఫ్ లెవల్ (ఆర్ఎల్), రూఫ్ క్యాస్ట్ (ఆర్సీ), కంప్లీషన్ అయ్యాక నాలుగు దశల్లో ఇవ్వనున్నారు. బిల్లులు మంజూరు చేసే ప్రతిదశలోనూ జియోట్యాగింగ్ తప్పనిసరి. ప్రస్తుతానికి ఖాళీ స్థలాన్ని రెండు శాఖల అధికారులు ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ హౌసింగ్ అధికారులు చేసేశారని భావించి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం ప్రారంభించేస్తే బేస్మెంట్ బిల్లు రానిపరిస్థితి ఉంటుంది. బేస్మెంట్ కోసం 28 రోజుల పనికి సంబంధించి ఉపాధి నిధులు మంజూరవుతాయి. డ్వామా అధికారులకు అనుమతులు రాకపోవడంతో వారు క్షేత్రస్థాయికి వెళ్లలేకపోతున్నారు. హౌసింగ్ అధికారులు మాత్రం గ్రౌండింగ్‌కు పరుగులు పెడుతున్నారు. జన్‌ధన్ ఖాతాతో ఇక్కట్లే ఇంటి నిర్మాణం ప్రారంభించాక బిల్లును లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లకు నేరుగా వేయనున్నారు. ప్రస్తుతం ఎంపికైన వారిలో కొందరు ఆధార్ లింక్‌తో జన్‌ధన్ యోజన కింద బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు తెలుస్తోంది. ఇలాంటి వారికి బిల్లుల కష్టాలు తప్పవు. పేమెంట్స్ అన్నీ ఆన్లైన్లో జరగనున్న నేపథ్యంలో జన్‌ధన్ ఖాతాలకు మనీ ట్రాన్స్ఫర్ విషయంలో పరిమితులు ఉంటాయి. కొన్ని ఖాతాలు రూ.20 వేలు, మరికొన్ని రూ.50 వేల వరకు మాత్రమే ఆన్లైన్ లావాదేవీలకు అనుమతి ఇస్తారు. ఈ క్రమంలో సేవింగ్స్ ఖాతాలు ఉంటేనే బిల్లులు సకాలంలో అందే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు. మొత్తానికి రెండు శాఖల మధ్య సమన్వయలోపంతో 'ఇంటి'బెంగ తప్పేలా లేదు. -
మెుక్కలకు జియో ట్యాగింగ్
హన్మకొండ : హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్ శర్మ కలెక్టర్ కరుణను ఆదేశించారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారం, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల భూసేకరణపై రాజీవ్‌శర్మ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం మేర కు మొక్కలు నాటాలని ఆదేశించారు. హరిత హారంలో నాటిన మొక్కల వివరాలను 100 శాతం రిజిస్టర్లో నమోదు చేసి, జియో ట్యా గింగ్ చేయాలని సూచించారు. వచ్చే సంవత్స రం జిల్లాలకు నిర్ణయించిన లక్ష్యం మేరకు నర్సరీలలో మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. జగిత్యాల–కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి నిర్మాణాని కి భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కింద ఇప్పటివరకు 3.86 కోట్ల మొక్కలు నాటామన్నారు. జిల్లాలో 5 రో జులుగా వర్షాలు కురుస్తున్నాయని, నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరలో పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో జాతీయ రహదారి 365కు సం బంధించి తానంచర్ల నుంచి జమాండ్లపల్లి వరకు భూసేకరణ పూర్తి చేశామన్నారు. మంగళ్వారిపేట–మల్లంపల్లి వరకు 400 మీటర్లు, నల్లబెల్లి మండలం అర్షన్పల్లి వద్ద భూసేకరణ వారం రోజుల్లో పూర్తి అవుతుందన్నారు. వరంగల్–హైదరాబాద్ 4 లైన్ల రహదారి భూసేకరణ ప్రక్రియ పూర్తి కావచ్చిందన్నారు. ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, హరితహారం ప్రత్యేక అధికారి పృథ్వీరాజ్, ఫారెస్టు కన్జర్వేటర్లు రాజారం, అక్బర్, నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
అను‘గృహం’ దక్కేనా!
జన్మభూమి కమిటీ ఆమోదంతోనే ‘ఇందిరమ్మ’ బిల్లులు నిలువ నీడ లేని బడుగు జీవుల సొంతింటి కల కరిగిపోతోంది. మొండి గోడలు వీరి పేదరికాన్ని వెక్కిరిస్తుండగా.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం సవాలక్ష నిబంధనలతో ముప్పుతిప్పలు పెడుతోంది. టీడీపీ సర్కారు తన మార్కు కనిపించేందుకు చేస్తున్న ప్రయత్నం ‘ఇందిరమ్మ’ గృహ లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతోంది. జియో ట్యాగింగ్ ప్రక్రియ ప్రహసనం కాగా.. బిల్లుల విడుదలకు జన్మభూమి కమిటీ ఆమోదం తప్పనిసరి చేయడం మొదటికే మోసం తీసుకొస్తోంది. కొనసాగుతున్న జియో ట్యాగింగ్ ప్రక్రియ ఔట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లకు ఉద్యోగాల బెంగ ఆధార్ లింకుతో బిల్లుల మంజూరు ఆలోచనలో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో లబ్ధిదారులు కర్నూలు(అర్బన్): జిల్లాలో మూడు విడతల ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా 3.40 లక్షల గృహాలు పూర్తి కాగా.. 44వేల గృహ నిర్మాణాలు వివిధ దశలో ఉన్నట్లు అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇందులో 16వేలు రూఫ్, లెంటల్ లెవల్లో ఉన్నాయి. వీటన్నింటికీ పెండింగ్ బిల్లులు మంజూరు కావాలంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం నియమించిన జన్మభూమి కమిటీలు పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంది. వీరి నివేదికలను మండల స్థాయి ప్రత్యేకాధికారి జిల్లా గృహ నిర్మాణ సంస్థ.. అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే పెండింగ్‌లోని బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో గత మూడు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు మాత్రం 84 శాతం పూర్తయినట్లు చెబుతుండటం గమనార్హం. క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయడంలో వర్క్ ఇన్స్పెక్టర్ల పాత్ర కీలకం. జిల్లా గృహ నిర్మాణ సంస్థలు ఇప్పటి వరకు 160 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పని చేస్తుండగా.. వీరందరితో ఈనెల 31 వరకే పని చేయించుకోవాలని గతలంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో సిబ్బందిలో ఉద్యోగం పట్ల అభద్రతా భావం నెలకొంది. ప్రభుత్వ గడువు దగ్గరపడుతున్న కొద్దీ వీరు విధుల పట్ల శ్రద్ధ కనపర్చకపోగా.. ఉద్యోగం కాపాడుకోవడంలో భాగంగా ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో జియో ట్యాగింగ్ ఈ నెలాఖరులోపు పూర్తి కావడం అనుమానమేనని తెలుస్తోంది. జియో ట్యాగింగ్ పూర్తయిన వెంటనే బిల్లులు విడుదలవుతాయని అధికారులు చెబుతుండగా.. ఈ ప్రక్రియ ఓ పట్టాన కొలిక్కి రాకపోవడం లబ్ధిదారులను ఆందోళనకు గురి చేస్తోంది. బిల్లుల చెల్లింపులో జాప్యం గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి సంబంధించిన బిల్లుల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమాలు, వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎలాంటి బిల్లులు విడుదల కాని పరిస్థితి. కాగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బిల్లులు విడుదలవుతాయని అందరూ భావించినా, ప్రభుత్వం జియో ట్యాగింగ్‌ను ఏర్పాటు చేయడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఆన్లైన్లో జనరేట్ చేసిన బిల్లులు రూ.33 కోట్లు కాగా, ఇంకా జనరేట్ కాని బిల్లులు దాదాపు రూ.20 కోట్లు ఉండొచ్చని అధికారులే చెబుతున్నారు. కాగా ప్రస్తుతం రేషన్‌కార్డు వ్యాప్ నెంబర్ కాకుండా ఆధార్ లింకుతో బిల్లులను మంజూరు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులకు ఆధార్ అనుసంధానం చేయడంలో జాప్యం చోటు చేసుకుని బిల్లుల చెల్లింపు మరింత ఆలస్యం కానుంది. ఎమ్మెల్యేలకు జియో ట్యాగింగ్ సీడీలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జియో ట్యాగింగ్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలకు సీడీల రూపంలో అందించనున్నారు. ఈ మేరకు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. అనుమానం ఉన్న ప్రాంతాలకు సంబంధించిన సీడీలను పరిశీలించేందుకు వీలుగా వీటిని అందిస్తున్నారు. గ్రామ పంచాయతీల వారీగా సమాచారం కోరితే హార్డ్‌కాపీలను కూడా అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.