'జియో'మంతర్‌ 'ఖాళీ'! | gio tagging of housing | Sakshi
Sakshi News home page

'జియో'మంతర్‌ 'ఖాళీ'!

Published Wed, Nov 9 2016 12:07 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

gio tagging of housing

- సొంతింటి కలకు 'జియో ట్యాగింగ్‌' గ్రహణం
– సమన్వయంతో సాగని డ్వామా, హౌసింగ్‌ అధికారులు
 – గృహనిర్మాణ సంస్థకు అనుమతులు మంజూరు
– ఉపాధి కోటా కింద అనుమతులే రాని వైనం
– జన్‌ధన్‌ బ్యాంక్‌ అకౌంట్లతో 'బిల్లులు' కష్టం  


అనంతపురం టౌన్‌ : పేదల సొంతింటి కలకు 'జియో' గ్రహణం పట్టుకుంది. గృహ నిర్మాణ సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ  (డ్వామా) అధికారులు సమన్వయంతో వెళ్లాల్సి ఉన్నా.. ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన సాగుతున్నారు. ఇప్పటికే ఇళ్లు మంజూరయ్యాయి..గ్రౌండింగ్‌కు వెళ్లి ఖాళీ స్థలాలకు జియోట్యాగింగ్‌ ప్రారంభిస్తామని హౌసింగ్‌ అధికారులు చెబుతుంటే.. మా ఫైల్‌ ఇంకా పెండింగ్‌లోనే ఉందంటూ డ్వామా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలీని పరిస్థితి నెలకొంది.   

వేర్వేరుగా అనుమతులు రావాల్సిందే!
ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌ స్కీంకు సంబంధించి రూ.1.50 లక్షలతో 200 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.95 వేలు, ఉపాధి నిధులు రూ.55 వేలు చెల్లిస్తారు. ఈ మొత్తమంతా సబ్సిడీనే. ఉపాధి నిధులకు సంబంధించి ఇంటి నిర్మాణం పూర్తయ్యేలోపు 90 రోజుల పనిదినాలు చేయాల్సి ఉంటుంది. రోజుకు రూ.194 వేతనం చొప్పున కూలికి రూ.17,460, ఇటుకల కోసం రూ.25,540, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలను ఉపాధి నిధుల నుంచి కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో డ్వామా, హౌసింగ్‌లకు వేర్వేరుగా అనుమతులు రావాల్సి ఉంటుంది. అనంతపురం, హిందూపురం నియోజకవర్గాల్లో 350 ఇళ్లు చొప్పున, మిగిలిన 12 నియోజకవర్గాలకు 900 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం గృహ నిర్మాణ సంస్థకు ఇచ్చే రూ.95 వేల సబ్సిడీ(ఒక్కో యూనిట్‌)కి సంబంధించి సుమారు 7,600 ఇళ్ల నిర్మాణాలకు కలెక్టర్‌ కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధి కింద వచ్చే రూ.55 వేలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అనుమతులు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం డ్వామా తరఫున 5,822 ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలను కలెక్టర్‌కు పంపారు. వీటికి అనుమతులు వచ్చాకే ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాల్సి ఉంటుంది. అంటే ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌ స్కీంకు సంబంధించి గృహ నిర్మాణ సంస్థకు ఎన్ని ఇళ్లు మంజూరు చేసినా ఫలితం లేదు. అంతిమంగా డ్వామా అధికారులకు మంజూరయ్యేవే లెక్కలోకి తీసుకోవాల్సిన పరిస్థితి.

జియోట్యాగింగ్‌తో గుబులు
ఇళ్ల నిర్మాణాలకు ప్రస్తుతం జియోట్యాగింగ్‌ గుబులు పట్టుకుంది. లబ్ధిదారులకు బిల్లులను బేస్‌మెంట్, రూఫ్‌ లెవల్‌ (ఆర్‌ఎల్‌), రూఫ్‌ క్యాస్ట్‌ (ఆర్‌సీ), కంప్లీషన్‌ అయ్యాక నాలుగు దశల్లో ఇవ్వనున్నారు. బిల్లులు మంజూరు చేసే ప్రతిదశలోనూ జియోట్యాగింగ్‌ తప్పనిసరి. ప్రస్తుతానికి ఖాళీ స్థలాన్ని రెండు శాఖల అధికారులు ట్యాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ హౌసింగ్‌ అధికారులు చేసేశారని భావించి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం ప్రారంభించేస్తే బేస్‌మెంట్‌ బిల్లు రానిపరిస్థితి ఉంటుంది. బేస్‌మెంట్‌ కోసం 28 రోజుల పనికి సంబంధించి ఉపాధి నిధులు మంజూరవుతాయి. డ్వామా అధికారులకు అనుమతులు రాకపోవడంతో వారు క్షేత్రస్థాయికి వెళ్లలేకపోతున్నారు. హౌసింగ్‌ అధికారులు మాత్రం గ్రౌండింగ్‌కు పరుగులు పెడుతున్నారు.  

జన్‌ధన్‌ ఖాతాతో ఇక్కట్లే
ఇంటి నిర్మాణం ప్రారంభించాక బిల్లును లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్లకు నేరుగా వేయనున్నారు. ప్రస్తుతం ఎంపికైన వారిలో కొందరు ఆధార్‌ లింక్‌తో జన్‌ధన్‌ యోజన కింద బ్యాంక్‌ ఖాతాలు తెరిచినట్లు తెలుస్తోంది. ఇలాంటి వారికి బిల్లుల కష్టాలు తప్పవు. పేమెంట్స్‌ అన్నీ ఆన్‌లైన్‌లో జరగనున్న నేపథ్యంలో జన్‌ధన్‌ ఖాతాలకు మనీ ట్రాన్స్‌ఫర్‌ విషయంలో పరిమితులు ఉంటాయి. కొన్ని ఖాతాలు రూ.20 వేలు, మరికొన్ని రూ.50 వేల వరకు మాత్రమే ఆన్‌లైన్‌ లావాదేవీలకు అనుమతి ఇస్తారు. ఈ క్రమంలో సేవింగ్స్‌ ఖాతాలు ఉంటేనే బిల్లులు సకాలంలో అందే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు. మొత్తానికి రెండు శాఖల మధ్య సమన్వయలోపంతో 'ఇంటి'బెంగ తప్పేలా లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement