అను‘గృహం’ దక్కేనా! | indiramma bills | Sakshi
Sakshi News home page

అను‘గృహం’ దక్కేనా!

Published Wed, Mar 25 2015 4:39 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM

indiramma bills

 జన్మభూమి కమిటీ ఆమోదంతోనే ‘ఇందిరమ్మ’ బిల్లులు
 నిలువ నీడ లేని బడుగు జీవుల సొంతింటి కల కరిగిపోతోంది. మొండి గోడలు వీరి పేదరికాన్ని వెక్కిరిస్తుండగా.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం సవాలక్ష నిబంధనలతో ముప్పుతిప్పలు పెడుతోంది. టీడీపీ సర్కారు తన మార్కు కనిపించేందుకు చేస్తున్న ప్రయత్నం ‘ఇందిరమ్మ’ గృహ లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతోంది. జియో ట్యాగింగ్ ప్రక్రియ ప్రహసనం కాగా.. బిల్లుల విడుదలకు జన్మభూమి కమిటీ ఆమోదం తప్పనిసరి చేయడం మొదటికే మోసం తీసుకొస్తోంది.
     కొనసాగుతున్న జియో ట్యాగింగ్ ప్రక్రియ
     ఔట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లకు ఉద్యోగాల బెంగ
     ఆధార్ లింకుతో బిల్లుల మంజూరు ఆలోచనలో ప్రభుత్వం
     దిక్కుతోచని స్థితిలో లబ్ధిదారులు
 కర్నూలు(అర్బన్): జిల్లాలో మూడు విడతల ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా 3.40 లక్షల గృహాలు పూర్తి కాగా.. 44వేల గృహ నిర్మాణాలు వివిధ దశలో ఉన్నట్లు అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇందులో 16వేలు రూఫ్, లెంటల్ లెవల్‌లో ఉన్నాయి. వీటన్నింటికీ పెండింగ్ బిల్లులు మంజూరు కావాలంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం నియమించిన జన్మభూమి కమిటీలు పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంది. వీరి నివేదికలను మండల స్థాయి ప్రత్యేకాధికారి జిల్లా గృహ నిర్మాణ సంస్థ.. అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే పెండింగ్‌లోని బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది.

అయితే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో గత మూడు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు మాత్రం 84 శాతం పూర్తయినట్లు చెబుతుండటం గమనార్హం. క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయడంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ల పాత్ర కీలకం. జిల్లా గృహ నిర్మాణ సంస్థలు ఇప్పటి వరకు 160 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పని చేస్తుండగా.. వీరందరితో ఈనెల 31 వరకే పని చేయించుకోవాలని గతలంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో సిబ్బందిలో ఉద్యోగం పట్ల అభద్రతా భావం నెలకొంది. ప్రభుత్వ గడువు దగ్గరపడుతున్న కొద్దీ వీరు విధుల పట్ల శ్రద్ధ కనపర్చకపోగా.. ఉద్యోగం కాపాడుకోవడంలో భాగంగా ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో జియో ట్యాగింగ్ ఈ నెలాఖరులోపు పూర్తి కావడం అనుమానమేనని తెలుస్తోంది. జియో ట్యాగింగ్ పూర్తయిన వెంటనే బిల్లులు విడుదలవుతాయని అధికారులు చెబుతుండగా.. ఈ ప్రక్రియ ఓ పట్టాన కొలిక్కి రాకపోవడం లబ్ధిదారులను ఆందోళనకు గురి చేస్తోంది.
 బిల్లుల చెల్లింపులో జాప్యం
 గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి సంబంధించిన బిల్లుల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమాలు, వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎలాంటి బిల్లులు విడుదల కాని పరిస్థితి. కాగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బిల్లులు విడుదలవుతాయని అందరూ భావించినా, ప్రభుత్వం జియో ట్యాగింగ్‌ను ఏర్పాటు చేయడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఆన్‌లైన్‌లో జనరేట్ చేసిన బిల్లులు రూ.33 కోట్లు కాగా, ఇంకా జనరేట్ కాని బిల్లులు దాదాపు రూ.20 కోట్లు ఉండొచ్చని అధికారులే చెబుతున్నారు. కాగా ప్రస్తుతం రేషన్‌కార్డు వ్యాప్ నెంబర్ కాకుండా ఆధార్ లింకుతో బిల్లులను మంజూరు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులకు ఆధార్ అనుసంధానం చేయడంలో జాప్యం చోటు చేసుకుని బిల్లుల చెల్లింపు మరింత ఆలస్యం కానుంది.
 ఎమ్మెల్యేలకు జియో ట్యాగింగ్ సీడీలు
 జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జియో ట్యాగింగ్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలకు సీడీల రూపంలో అందించనున్నారు. ఈ మేరకు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. అనుమానం ఉన్న ప్రాంతాలకు సంబంధించిన సీడీలను పరిశీలించేందుకు వీలుగా వీటిని అందిస్తున్నారు. గ్రామ పంచాయతీల వారీగా సమాచారం కోరితే హార్డ్‌కాపీలను కూడా అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement