INDIRAMMA Scheme
-
‘ఇందిరమ్మ’లో కదలిక
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. లబ్ధిదారులను గుర్తించేందుకు వీలుగా ఇందిరమ్మ కమిటీల విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినా, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరించింది. మూడు నెలల తర్వా త ఈ పథకాన్ని భద్రాచలంలో మంత్రులందరితో కలిసి సీఎం ప్రారంభించారు. కానీ లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఏడున్నర నెలల తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇళ్ల నిర్మాణానికి వీలుగా కసరత్తు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక్కోటి రూ.5 లక్షల వ్యయంతో నియోజకవర్గానికి మూడున్నర వేలు చొప్పున ఇళ్ల నిర్మా ణానికి ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. సొంత స్థలం ఉండి, పక్కా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు. ప్రస్తుతానికి సొంత జాగా ఉన్నవారికే.. గ్రామ, పట్టణ స్థాయి (వార్డు/డివిజన్లవారీగా)లో ఏర్పాటయ్యే ఈ కమిటీలే ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో కీలకంగా వ్యవహరించనున్నాయి. లబ్ధిదారుల ఎంపిక మొదలు, సోషల్ ఆడిట్ వరకు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. గ్రామ స్థాయి కమిటీలను ఎంపీడీవోలు, వార్డు స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు నామినేట్ చేస్తారు. ప్రస్తుతానికి సొంత జాగాలు ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటారు. సొంత జాగా లేని వారికి ఇళ్లను మంజూరు చేయరు. సొంత జాగాలో కచ్చా ఇల్లు ఉన్నవారు, పక్కా ఇల్లు ఉన్నవారెవరన్న విషయంలో జాగ్రత్తగా వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి భారీగా నిధులు రాబట్టే ప్రయత్నంలో రాష్ట్రప్రభుత్వం ఉంది. అనర్హులను లబ్ధిదారులుగా గుర్తిస్తే నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల గుర్తింపులో జాగ్రత్త అవసరమని రాష్ట్రప్రభుత్వం కలెక్టర్లకు స్పష్టం చేసింది. కాగా కమిటీ సభ్యులు లబ్ధిదారుల వివరాలను సేకరించి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తారు. కొత్త దరఖాస్తులు తీసుకుంటారా? ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పది నెలల క్రితం సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అప్పట్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షలకు పైగా దరఖాస్తులందాయి. వాటిల్లో ప్రాథమిక స్థాయి వడపోత తర్వాత 50 లక్షల దరఖాస్తులు మిగిలాయి. వీటిల్లో అర్హమైనవి ఎన్ననే విషయం క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. కాగా పాత దరఖాస్తులే పరిగణనలోకి తీసుకుంటారా? కొత్తవి కూడా స్వీకరిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఎంపికకు సుదీర్ఘ సమయం! లబ్ధిదారుల ఎంపికకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రజాపాలన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకున్నా.. ఒక్కో దరఖాస్తు ఆధారంగా క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి అర్హతను తేల్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం జాబితాను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తర్వాతే నిధుల విడుదల ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హడ్కో నుంచి ఇళ్ల కోసం దాదాపు రూ.3 వేల కోట్ల రుణం పొందింది. కేంద్రం నుంచి మరో రూ.8 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. లబ్ధిదారులకు మొదటి విడత రూ.లక్ష చెల్లించి మిగతా విడతలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు. మొదటి విడతలో మంజూరు చేసే ఇళ్లకు రూ.20 వేల కోట్లు అవసరమవుతాయి. గ్రామస్థాయి కమిటీ: సర్పంచ్/ పంచాయితీ ప్రత్యేక అధికారి చైర్మన్‌గా ఉండే కమిటీలో స్వయం సహాయక బృందాలకు చెందిన ఇద్దరు మహిళలు, గ్రామ పురోగతికి పాటుపడే ముగ్గురు స్థానికులు (వీరిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ/ఎస్టీ విధిగా ఉండాలి) సభ్యులుగా, పంచాయితీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. పట్టణ స్థాయి కమిటీ: వార్డు కౌన్సిలర్/కార్పొరేటర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఇద్దరు స్వయం సహాయక బృంద సభ్యులు, స్థానికంగా అభివృద్ధి పనులకు సహకరించే ముగ్గురు స్థానికులు (వీరిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ/ఎస్టీ విధిగా ఉండాలి) సభ్యులుగా, వార్డు అధికారి కన్వీనర్‌గా ఉంటారు. -
అను‘గృహం’ దక్కేనా!
జన్మభూమి కమిటీ ఆమోదంతోనే ‘ఇందిరమ్మ’ బిల్లులు నిలువ నీడ లేని బడుగు జీవుల సొంతింటి కల కరిగిపోతోంది. మొండి గోడలు వీరి పేదరికాన్ని వెక్కిరిస్తుండగా.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం సవాలక్ష నిబంధనలతో ముప్పుతిప్పలు పెడుతోంది. టీడీపీ సర్కారు తన మార్కు కనిపించేందుకు చేస్తున్న ప్రయత్నం ‘ఇందిరమ్మ’ గృహ లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతోంది. జియో ట్యాగింగ్ ప్రక్రియ ప్రహసనం కాగా.. బిల్లుల విడుదలకు జన్మభూమి కమిటీ ఆమోదం తప్పనిసరి చేయడం మొదటికే మోసం తీసుకొస్తోంది. కొనసాగుతున్న జియో ట్యాగింగ్ ప్రక్రియ ఔట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లకు ఉద్యోగాల బెంగ ఆధార్ లింకుతో బిల్లుల మంజూరు ఆలోచనలో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో లబ్ధిదారులు కర్నూలు(అర్బన్): జిల్లాలో మూడు విడతల ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా 3.40 లక్షల గృహాలు పూర్తి కాగా.. 44వేల గృహ నిర్మాణాలు వివిధ దశలో ఉన్నట్లు అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇందులో 16వేలు రూఫ్, లెంటల్ లెవల్లో ఉన్నాయి. వీటన్నింటికీ పెండింగ్ బిల్లులు మంజూరు కావాలంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం నియమించిన జన్మభూమి కమిటీలు పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంది. వీరి నివేదికలను మండల స్థాయి ప్రత్యేకాధికారి జిల్లా గృహ నిర్మాణ సంస్థ.. అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే పెండింగ్‌లోని బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో గత మూడు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు మాత్రం 84 శాతం పూర్తయినట్లు చెబుతుండటం గమనార్హం. క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయడంలో వర్క్ ఇన్స్పెక్టర్ల పాత్ర కీలకం. జిల్లా గృహ నిర్మాణ సంస్థలు ఇప్పటి వరకు 160 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పని చేస్తుండగా.. వీరందరితో ఈనెల 31 వరకే పని చేయించుకోవాలని గతలంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో సిబ్బందిలో ఉద్యోగం పట్ల అభద్రతా భావం నెలకొంది. ప్రభుత్వ గడువు దగ్గరపడుతున్న కొద్దీ వీరు విధుల పట్ల శ్రద్ధ కనపర్చకపోగా.. ఉద్యోగం కాపాడుకోవడంలో భాగంగా ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో జియో ట్యాగింగ్ ఈ నెలాఖరులోపు పూర్తి కావడం అనుమానమేనని తెలుస్తోంది. జియో ట్యాగింగ్ పూర్తయిన వెంటనే బిల్లులు విడుదలవుతాయని అధికారులు చెబుతుండగా.. ఈ ప్రక్రియ ఓ పట్టాన కొలిక్కి రాకపోవడం లబ్ధిదారులను ఆందోళనకు గురి చేస్తోంది. బిల్లుల చెల్లింపులో జాప్యం గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి సంబంధించిన బిల్లుల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమాలు, వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎలాంటి బిల్లులు విడుదల కాని పరిస్థితి. కాగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బిల్లులు విడుదలవుతాయని అందరూ భావించినా, ప్రభుత్వం జియో ట్యాగింగ్‌ను ఏర్పాటు చేయడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఆన్లైన్లో జనరేట్ చేసిన బిల్లులు రూ.33 కోట్లు కాగా, ఇంకా జనరేట్ కాని బిల్లులు దాదాపు రూ.20 కోట్లు ఉండొచ్చని అధికారులే చెబుతున్నారు. కాగా ప్రస్తుతం రేషన్‌కార్డు వ్యాప్ నెంబర్ కాకుండా ఆధార్ లింకుతో బిల్లులను మంజూరు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులకు ఆధార్ అనుసంధానం చేయడంలో జాప్యం చోటు చేసుకుని బిల్లుల చెల్లింపు మరింత ఆలస్యం కానుంది. ఎమ్మెల్యేలకు జియో ట్యాగింగ్ సీడీలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జియో ట్యాగింగ్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలకు సీడీల రూపంలో అందించనున్నారు. ఈ మేరకు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. అనుమానం ఉన్న ప్రాంతాలకు సంబంధించిన సీడీలను పరిశీలించేందుకు వీలుగా వీటిని అందిస్తున్నారు. గ్రామ పంచాయతీల వారీగా సమాచారం కోరితే హార్డ్‌కాపీలను కూడా అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. -
రూ. 14 కోట్ల ఇందిరమ్మ బకాయిలు
- లబ్ధిదారుల వివరాలు కంప్యూటరీకరణ - ఆధార్ సీడింగ్ తప్పని సరి - హౌసింగ్ ఈఈ శంకరయ్య ధర్పల్లి : జిల్లాలో ఇందిరమ్మ పథకం కింద 4,706 మంది లబ్ధిదారులకు రూ. 14 కోట్ల బిల్లులు బాకాయిలు ఉన్నాయని నిజామాబాద్ డివిజన్ హౌసింగ్ ఈఈ శంకరయ్య తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మండల హౌసింగ్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెందిన ఆధార్ సీడింగ్ డాటాను పరిశీలించారు. మండల హౌసింగ్ ఏఈ గంగాధర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బకాయి బిల్లులను విడుదల చేశారన్నారు. అవీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల వివిధ స్కీమ్‌ల కింద ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 1.58లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయని మిగితా 1.92లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఇందులో ఇప్పటి వరకు 83 వేల ఇళ్లు నిర్మాణాలు చేపట్టలేదన్నారు. మార్చి-2014 నుంచి ఆరు నెలల పాటు హౌసింగ్ బిల్లులు నిలిచి పోయాయన్నారు. ఎన్నికల సందర్భంగా లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగిందన్నారు. నిర్మాణం దశలో ఉన్న ఇళ్లను మండల స్థాయిలో ఈఈలు, గ్రామ స్థాయిలో డీఈలు పరిశీలిస్తున్నారన్నారు. ఎక్కడ బోగస్ లేకుండా తనిఖీలను చేపట్టుతున్నామన్నారు. నిజమైన ఇంటి నిర్మాణాలకు బిల్లులు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. లబ్ధిదారుల వివరాలు కంప్యూటరీకరణ హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి వివిధ స్కీమ్స్ కింద లబ్ధిపొందిన వారి వివరాలను కంప్యూటరీకరణ చేపట్టుతున్నట్లు ఈఈ తెలిపారు. 1983 నుంచి ఇప్పటి వరకు ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారుల వివరాలు అందులో ఉంటాయన్నారు. 30 ఏళ్లలో వివిధ స్కీమ్స్‌ల కింద పొందిన లబ్ధిదారుల గుర్తింపు చేసి కంప్యూటరీకరణ చేస్తామన్నారు. అలాగే ప్రతి లబ్ధిదారుడి ఆధార్ సీడింగ్ తప్పని సరి చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 72 శాతం కంప్యూటరీకరణ పూర్తి అయ్యిందన్నారు. గుగుల్ మ్యాప్స్‌తో ఇళ్ల గుర్తింపు జిల్లాలో 36 మండలాల్లో ఒక్కో మండలంలోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి గుగుల్ మ్యాప్స్ ఆధారంగా ఇళ్ల నిర్మాణాలను గుర్తించే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని అన్సాన్పల్లి గ్రామాన్ని గుగుల్ ఆధారం గ్రామ ఇళ్ల సముదాయం గుర్తించేలా మ్యాప్ తయారు చేశామన్నారు. దీని ఆధారంగా గ్రామంలో హౌసింగ్ బృందం తనిఖీ చేసి ఏఏ ఇళ్లు ఎన్ని ఉన్నాయో పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేస్తామన్నారు. నివేదికను హౌసింగ్ ఎండీకి అందిస్తామన్నారు. దీని వల్ల హౌసింగ్ శాఖలో అవినీతి బయట పడుతుందన్నారు. సీబీ సీఐడీలు తనిఖీలు చేస్తే సులువుగా ఉండేలా లబ్ధిదారుల నివేదికలు తయారు చేస్తున్నామన్నారు. 83 వేల ఇళ్ల జాబితాను ప్రభుత్వానికి పంపించాం జిల్లాలో ఇటీవల హౌసింగ్ కింద మంజూరైన 83 వేల ఇళ్ల నివేదికలను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కింద వీరికి ఇళ్ల మంజూరు ఉంటుందన్నారు. ప్రస్తతం అవీ రద్ధయినట్లేనన్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఆధారంగానే ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇళ్ల మంజూరు పక్కాగా చేపడతామన్నారు.