మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
తదుపరి విచారణ జనవరి 24కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం నియమించిన ఇందిరమ్మ కమిటీలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపైనా స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.
జీవో 33ని సవాల్ చేస్తూ..
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని, తొలిదశలో 4.5 లక్షల ఇళ్లను నిర్మించాలని సంకలి్పంచిన ప్రభుత్వం.. ఇందుకోసం గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ అక్టోబర్ 11న జీవో 33 జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎ. నితీశ్‌కుమార్‌తోపాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ వేయగా విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి పిటిషన్‌ను నవంబర్ 14న కొట్టేశారు. పథకాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ, విచక్షణ ఉంటుందని.. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేశారు.
సభ్యుల ఎంపిక చట్టవిరుద్ధమంటూ అప్పీల్..
ఈ తీర్పును సవాల్ చేస్తూ నితీశ్‌కుమార్ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ కె.శరత్ శుక్రవారం విచారణ చేపట్టారు. అర్హతలను ప్రకటించకుండానే ఇందిరమ్మ కమిటీల్లోని సభ్యుల ఎంపిక చట్టవిరుద్ధమని.. ఇష్టం వచ్చిన వారిని, రాజకీయ పార్టీల కార్యకర్తలను ప్రభుత్వం సభ్యులుగా నియమించే ప్రమాదం ఉందని పిటిషనర్ వాదించారు. అందువల్ల కేసు విచారణ ముగిసే వరకు ఇందిరమ్మ కమిటీలను నిలుపుదల చేయాలని కోరారు. ఈ వాదనను ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి తోసిపుచ్చారు. పారదర్శకంగా పథకం అమలు ప్రక్రియ కొనసాగుతోందని.. పథకాలను ఎలా అమలు చేయాలనే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ దశలో కమిటీలను నిలుపుదల చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. కమిటీల ఏర్పాటుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment