
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రత్యేక వెబ్‌సైట్
ఆన్‌లైన్‌లో ఫిర్యాదుకు అవకాశం
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోజూ వందల్లో ఫిర్యాదులు
బంజారాహిల్స్ : అర్హులైన నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చింది. ఏడాది క్రితం ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరించగా సర్వే నిర్వహించి లబి్ధదారులను గుర్తించారు. అయితే జాబితాలో పేర్లు లేని వారి కోసం మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే సర్వే సమయంలో పలువురు దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఏ విధంగా నమోదు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తమ దరఖాస్తు పరిస్థితి ఏమిటో సమాచారం తెలియక చాలా మంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అటు జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి ఇటు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ, ఇంకోవైపు కలెక్టర్ ప్రజావాణి, మరోవైపు ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ప్రజావాణిలోనూ పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం దరఖాస్తు స్థితి తెలుసుకునేందుకు సర్వే నిర్వహణపై ఫిర్యాదులకు అవకాశం కల్పించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజీగూడ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్ డివిజన్లు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధి కిందికి వచ్చే షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, వెంగళరావునగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ల పరిధిలో సర్వే నిర్వహణపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. సర్వేపై సందేహాలు ఉంటే ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ అవకాశం కలి్పంచారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో రోజూ 150కి పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. వాటికి సమాధానం చెప్పేందుకు అధికారులు ఆన్‌లైన్‌లో జాబితాను రూపొందిస్తున్నారు.
అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయొచ్చు..
👉: ఇందిరమ్మ ఇళ్ల సర్వే వివరాల నమోదుపై అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేసుకునే సదుపాయం ఉంది. దీనికి ఫిర్యాదులపై క్లిక్ చేసి మన మొబైల్ నెంబర్ టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది.
👉: ఓటీపీ ఎంటర్ చేయగానే ఫిర్యాదు పేజీ ఓపెన్ అవుతుంది.
👉: మన ఆధార్ నెంబర్ నమోదు చేయగానే పలు వ్యక్తిగత వివరాలు, చిరునామా నమోదవుతాయి.
👉: ఫిర్యాదుల కేటగిరి ఎంచుకోగానే కింద ఐచి్ఛకలు కనిపిస్తాయి.
👉: సర్వేయర్ సందర్శించలేదు, సంతృప్తి చెందలేదు, సర్వే సక్రమంగా జరగలేదు, సర్వే సమయంలో గైర్హాజర్ అయ్యారు, ప్రజాపాలనలో దరఖాస్తు చేయలేదు, మధ్యవర్తితో సమస్యలు, డబ్బులు డిమాండ్ చేస్తున్న సర్వేయర్.. వీటిలో దరఖాస్తుదారుడు ఎదుర్కొన్న సమస్యను ఎంచుకుని ఫిర్యాదు వివరాలు రాయాల్సి ఉంటుంది.
👉: అనంతరం ఏదేని ధ్రువపత్రాన్ని అప్‌లోడ్ చేసి సబ్మిట్ పై నొక్కాలి.
👉: వెంటనే మొబైల్ ఫోన్‌కు ఫిర్యాదు నెంబర్ వస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఫిర్యాదు వివరాలు తెలుసుకోవచ్చు.
దరఖాస్తు స్థితి ఇలా తెలుసుకోవచ్చు..
గూగుల్‌లోhttps://indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్‌ను నమోదు చేయగానే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అప్లికేషన్ సెర్చ్‌ను ఎంపిక చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఆధార్‌కార్డు, అప్లికేషన్ ఐడీ, రేషన్‌కార్డు అంశాల్లో ఏదో ఒక వివరాలు నమోదు చేయగానే మన అప్లికేషన్ వివరాలు ప్రత్యక్షమవుతాయి. సర్వే స్థితి, అది ఏ పరిస్థితిలో ఉందో గమనించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment