కమిటీల విధివిధానాల ఉత్తర్వులు జారీ
ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో త్వరలో సభ్యుల ఎంపిక
చైర్మన్లుగా సర్పంచ్‌లు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు
ఈ కమిటీల ఆధ్వర్యంలోనే లబ్ధిదారుల ఎంపిక.. తనిఖీ
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. లబ్ధిదారులను గుర్తించేందుకు వీలుగా ఇందిరమ్మ కమిటీల విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినా, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరించింది. మూడు నెలల తర్వా త ఈ పథకాన్ని భద్రాచలంలో మంత్రులందరితో కలిసి సీఎం ప్రారంభించారు. కానీ లబ్ధిదారుల ఎంపికలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఏడున్నర నెలల తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇళ్ల నిర్మాణానికి వీలుగా కసరత్తు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక్కోటి రూ.5 లక్షల వ్యయంతో నియోజకవర్గానికి మూడున్నర వేలు చొప్పున ఇళ్ల నిర్మా ణానికి ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. సొంత స్థలం ఉండి, పక్కా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు.
ప్రస్తుతానికి సొంత జాగా ఉన్నవారికే..
గ్రామ, పట్టణ స్థాయి (వార్డు/డివిజన్‌లవారీగా)లో ఏర్పాటయ్యే ఈ కమిటీలే ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో కీలకంగా వ్యవహరించనున్నాయి. లబ్ధిదారుల ఎంపిక మొదలు, సోషల్ ఆడిట్ వరకు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. గ్రామ స్థాయి కమిటీలను ఎంపీడీవోలు, వార్డు స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు నామినేట్ చేస్తారు. ప్రస్తుతానికి సొంత జాగాలు ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటారు. సొంత జాగా లేని వారికి ఇళ్లను మంజూరు చేయరు. సొంత జాగాలో కచ్చా ఇల్లు ఉన్నవారు, పక్కా ఇల్లు ఉన్నవారెవరన్న విషయంలో జాగ్రత్తగా వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి భారీగా నిధులు రాబట్టే ప్రయత్నంలో రాష్ట్రప్రభుత్వం ఉంది. అనర్హులను లబ్ధిదారులుగా గుర్తిస్తే నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల గుర్తింపులో జాగ్రత్త అవసరమని రాష్ట్రప్రభుత్వం కలెక్టర్లకు స్పష్టం చేసింది. కాగా కమిటీ సభ్యులు లబ్ధిదారుల వివరాలను సేకరించి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తారు.
కొత్త దరఖాస్తులు తీసుకుంటారా?
ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పది నెలల క్రితం సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అప్పట్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షలకు పైగా దరఖాస్తులందాయి. వాటిల్లో ప్రాథమిక స్థాయి వడపోత తర్వాత 50 లక్షల దరఖాస్తులు మిగిలాయి. వీటిల్లో అర్హమైనవి ఎన్ననే విషయం క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. కాగా పాత దరఖాస్తులే పరిగణనలోకి తీసుకుంటారా? కొత్తవి కూడా స్వీకరిస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
ఎంపికకు సుదీర్ఘ సమయం!
లబ్ధిదారుల ఎంపికకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రజాపాలన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకున్నా.. ఒక్కో దరఖాస్తు ఆధారంగా క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి అర్హతను తేల్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం జాబితాను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తర్వాతే నిధుల విడుదల ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హడ్కో నుంచి ఇళ్ల కోసం దాదాపు రూ.3 వేల కోట్ల రుణం పొందింది. కేంద్రం నుంచి మరో రూ.8 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. లబ్ధిదారులకు మొదటి విడత రూ.లక్ష చెల్లించి మిగతా విడతలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు. మొదటి విడతలో మంజూరు చేసే ఇళ్లకు రూ.20 వేల కోట్లు అవసరమవుతాయి.
గ్రామస్థాయి కమిటీ:
సర్పంచ్/ పంచాయితీ ప్రత్యేక అధికారి చైర్మన్‌గా ఉండే కమిటీలో స్వయం సహాయక బృందాలకు చెందిన ఇద్దరు మహిళలు, గ్రామ పురోగతికి పాటుపడే ముగ్గురు స్థానికులు (వీరిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ/ఎస్టీ విధిగా ఉండాలి) సభ్యులుగా, పంచాయితీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు.
పట్టణ స్థాయి కమిటీ:
వార్డు కౌన్సిలర్/కార్పొరేటర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఇద్దరు స్వయం సహాయక బృంద సభ్యులు, స్థానికంగా అభివృద్ధి పనులకు సహకరించే ముగ్గురు స్థానికులు (వీరిలో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ/ఎస్టీ విధిగా ఉండాలి) సభ్యులుగా, వార్డు అధికారి కన్వీనర్‌గా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment