కొత్త రేషన్‌కార్డుల అంశంపై ప్రజల్లో సందేహాలెన్నో..
రేషన్‌కార్డులకు కోత పడుతుందా? పెళ్లయి విడిపడిన వారికి కార్డులు ఇస్తారా?
అర్హతలను పునః సమీక్షిస్తామన్న మంత్రుల ప్రకటనతో ఆందోళన
బియ్యం అవసరం లేని వారికి స్మార్ట్ హెల్త్‌కార్డులు ఇస్తామన్న దానిపైనా అనుమానాలు
ఇప్పటికే రేషన్‌కార్డు సమస్యలతో ‘రుణమాఫీ’, ఉచిత విద్యుత్ అందని తీరు
భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలకూ లింకు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్‌కార్డుల అంశం ప్రజల్లో పరేషాన్ రేపుతోంది. లక్షలాది మంది కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించిన అంశాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నా యి. రేషన్‌కార్డులకు కోత పెడతారా? పెళ్లిళ్లు అయి కొత్తగా ఏర్పడిన కుటుంబాలన్నింటికీ కొత్తకార్డులు జారీ చేస్తారా? పాతవాటిలో మార్పు చేర్పులపై ఏం చేస్తారు? రేషన్‌కార్డులు లేకుంటే ప్రభుత్వ పథకాలు అందడం ఎలా? అర్హతల పునః సమీక్ష అంటే ఎలాంటి నిబంధనలు పెడతారనే ప్రశ్నలు వస్తున్నాయి.
వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రులు వెల్లడించారు. రేషన్‌కార్డులను విభజించి, స్మార్ట్ రేషన్‌కార్డులు, స్మార్ట్ హెల్త్‌కార్డులు ఇస్తామని.. రేషన్‌కార్డులకు అర్హతలపై పునః సమీక్ష చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు.. ప్రస్తుతం మంత్రులు వెల్లడించిన అంశాలు.. ఇటీవలి పరిణామాలను బేరీజు వేసుకుంటూ.. రేషన్‌కార్డుల అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు మొదలయ్యాయి.
రేషన్ కార్డుల్లో కోత పడుతుందా?
అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రులు ప్రకటించారు. అయితే అర్హు లను ఎలా నిర్ధారిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా కార్డుల కోసం ఏడెనిమిది లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల దరఖాస్తులతోపాటు కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ దరఖాస్తుల డేటాపై స్పష్టత లేదు. దీంతో మరోసారి ప్రజాపాలన నిర్వహించి రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త రేషన్‌కార్డుల జారీకి విధి విధానాలేమిటనే విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సి ఉంది. వార్షికాదాయం ప్రాతిపదికన జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొత్తగా ఇచ్చే రేషన్‌కార్డులకే పరిమితి అమలు చేస్తారా? పాతకార్డులకూ వర్తింపజేస్తూ.. అధికాదాయం ఉన్నవారికి రద్దు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో అడ్డగోలుగా రేషన్‌కార్డులు జారీ చేశారని, అధికాదాయం ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఐటీ కడుతున్నవారికి కూడా రేషన్‌కార్డులు ఉన్నాయని సీఎం రేవంత్ గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్డులకు కోతపడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ పథకాలు అందేది ఎలా?
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డులే ప్రామాణికమని సీఎం రేవంత్ గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పటికే రేషన్‌కార్డు సమస్యలతో చాలా మంది రైతులకు ‘రుణమాఫీ’ అందలేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందనివారూ ఎంతో మంది ఉన్నారు. భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలకూ రేషన్‌కార్డుల లింకు ఉండనుంది. దీనివల్ల ఉన్న రేషన్‌కార్డులు రద్దయినా, కొత్త రేషన్‌కార్డులు మంజూరుకాకున్నా.. తమకు పథకాలు అందేది ఎలాగని పేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని.. అర్హతకోసం పరిగణించే వార్షికాదాయ పరిమితిని దానికి అనుగుణంగా పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక రేషన్‌కార్డులను విభజించి బియ్యం వద్దనుకునే వారికి స్మార్ట్ హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్న మంత్రుల ప్రకటనతోనూ సందేహాలు మొదలయ్యాయి. అలా స్మార్ట్ హెల్త్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా, లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ నెల 21న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం రేషన్‌కార్డుల అంశంపై స్పష్టత రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment