సాక్షి, కల్వకుర్తి టౌన్ : రానున్న ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు నమోదు దరఖాస్తు గడువు పూర్తయింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ పక్క రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నం కాగా.. అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు.
ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లను జియో ట్యాగింగ్ చేశారు. దీనికోసం లాంగిట్యూడ్, లాటిట్యూడ్ పక్రియ పూర్తయింది. తద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ పోలింగ్ స్టేషన్‌లో జరిగే పోలింగ్ సరళినైనా అధికారులు పరిశీలించే వెసలుబాటు కలగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలే కాకుండా మారుమూల గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల జియో ట్యాగింగ్ కూడా పూర్తయింది.
ఇందుకోసం ప్రతీ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ల ఛాయాచిత్రాలను ఎస్‌ఐలు, సిబ్బంది ట్యాబ్‌ల ద్వారా సేకరించి జియో ట్యాగింగ్ చేశారు. తద్వారా పోలింగ్ స్టేషన్ ఆవరణలో ఏవైనా అనుకోని సంఘటనలు, గొడవలు జరిగితే రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుర్తించేందుకు వెసలుబాటు కలుగుతుంది. దీంతో కింది స్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఘటనా స్థలానికి పంపించేందుకు జియో ట్యాగింగ్ ఉపయోగపడనుంది.
పకడ్బందీగా నిర్వహించేందుకు...
ముందస్తు ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో పోలీస్ శాఖ ముందుచూపుతో వ్యవహరిస్తోంది. జిల్లాలోని సున్నితమైన ప్రాంతాలను, అత్యంత సున్నితమైన ప్రాంతాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పక్రియ చివరి దశకు చేరుకుంది.
పోలింగ్ కేంద్రాలలో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల భవనాలు, ప్రభుత్వ కార్యాలయ భవనాల్లో ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు జరిగి కేసులు నమోదై ఉంటే ఆ ఘటనలను పరిగణనలోకి తీసుకుని వాటిపై ప్రత్యేక నిఘా ఉంచునున్నారు.
పాత నేరస్తులపై నిఘా
అన్ని పోలింగ్ కేంద్రాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటుగా ఆయా పోలింగ్ కేంద్రాలలో ఉన్న పాత నేరస్తులు, హిస్టరీ షీట్స్ ఉన్న వ్యక్తులు, ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోనే కాకుండా నియోజకవర్గ పరిధిలో ఉన్న వారందరినీ బైండోవర్ చేస్తున్నారు. తద్వారా వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు అవకాశం కలుగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఆయా వ్యక్తులు ఎక్కడకు వెళ్తున్నారు, ఇంకా నేర ప్రవృత్తిలో యాక్టివ్‌గా ఉన్నారా, లేదా అన్న పూర్తి విషయాలపై సమాచారాన్ని కూడా సిద్ధం చేశారు.
గుర్తింపు సులభం..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,635 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ మేరకు నాగర్‌కర్నూల్ జిల్లాలో 775 పోలింగ్ కేంద్రాలు, వనపర్తి జిల్లాలో 278, జోగులాంబ గద్వాల జిల్లాలో 507, మహబూబ్‌నగర్ జిల్లాలో 1,332 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించినప్పుడు నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని అత్యధిక మండలాలు రంగారెడ్డి జిల్లా కలవటంతో ఎన్నికల నిర్వహణ బాధ్యత అంతా రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లపోయింది.
షాద్‌నగర్ నియోజకవర్గం కూడా రంగారెడ్డి జిల్లాలోకి, కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలు వికారాబాద్ జిల్లాలోకి వెళ్లిపోయాయి. ఇలా వెళ్లిన నియోజకవర్గాల ఎన్నికల పక్రియ ఆయా నూతన జిల్లాల అధికారులే నిర్వహిస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 257 పోలింగ్ కేంద్రాలు, కొడంగల్‌లో 264 పోలింగ్ కేంద్రాలు, షాద్‌నగర్‌లో 242 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
సీసీ కెమెరాలతో నిఘా
ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ గట్టి బందోబస్తులో పాటు పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం ప్రతీ పోలింగ్ స్టేషన్‌ను జియో ట్యాగింగ్ చేశారు. అలాగే, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను జియో ట్యాగింగ్ పక్రియ పూర్తయింది. జియో ట్యాగింగ్ చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయా మండల పోలీస్ స్టేషన్‌కు అనుసంధానించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
జియో ట్యాగింగ్ చేసిన పోలింగ్ స్టేషన్లను ప్రత్యేక విభాగం ద్వారా పరిశీలించనున్నారు. అంతేకాకుండా మొత్తం పోలింగ్ కేంద్రాలపై జియో ట్యాగింగ్‌తో పాటుగా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఆయా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ పోలింగ్ నిర్వహణ తీరు ఎలా ఉందనే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర స్థాయిలో డీజీపీ తెలుసుకొనే వెసులుబాటు కలగనుంది.
జియో ట్యాగింగ్ పూర్తయింది..
అన్ని పోలింగ్ కేం ద్రాలను జియో ట్యాగింగ్ ద్వారా ల్యాంగిట్యూడ్, లాటిట్యూడ్ పూర్తి చేశాం. నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మరికొన్ని చోట్ల కేంద్రాలను అదే గ్రామంలో వేరే ప్రాంతానికి మార్చటం వల్ల వాటి జియోట్యాగింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఇప్పటికే దాదాపుగా అన్ని పోలింగ్ స్టేషన్లను జియోట్యాగింగ్ చేసి ఆయా మండలాల పోలీస్‌స్టేషన్లకు అనుసంధానం చేశాం. పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి ఉంచి, వారి కార్యాకలాపాలపై నిఘా పెంచాం.
- పుష్పారెడ్డి, కల్వకుర్తి డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment