సాక్షి, హైదరాబాద్: కాగిత రహిత పాలనలో తమను మించిన వారు లేరని, అన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న జీహెచ్‌ఎంసీ పరిస్థితి పైన పటారం.. లోన లొటారంలా మారింది. అన్నీ ఆన్‌లైన్ ద్వారానే అని చెబుతున్నప్పటికీ.. సవ్యంగా పనిచేయాల్సిన జీహెచ్‌ఎంసీ సర్వరే మొరాయిస్తుండటంతో వివిధ పనులు అవసరమైన వారు పడరాని పాట్లు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీలోని వివిధ సేవలకు సంబంధించి ఇదివరకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సదుపాయం ఉండేది. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోని సిటిజెన్ సర్వీస్ సెంటర్ల ద్వారా మ్యుటేషన్లు, బర్త్ సర్టిఫికెట్లు, ట్రేడ్‌లైసెన్సుల వంటి సేవలందేవి.
ఇటీవలి కాలంలో ప్రజలు నేరుగా ఆన్‌లైన్ ద్వారా లేదా మీసేవా కేంద్రాల ద్వారా మాత్రమే సదరు సేవలు వినియోగించుకునేలా చేశారు. జీహెచ్‌ఎంసీలో వేళ్లూనుకుపోయిన అవినీతిని అరికట్టేందుకు అధికారులను కలిసే పనే లేకుండా యూజర్‌ఫ్రెండ్లీగా ఆన్‌లైన్ ద్వారానే ఈ సదుపాయాలు కల్పించినట్లు ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది కానీ, ఇంతకీ ప్రజలకు అంతరాయాల్లేకుండా సేవలందుతున్నాయా.. సాంకేతికంగా ఇబ్బందులెదురవుతున్నాయా ? వంటి విషయాలను మాత్రం ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. దాంతో తరచూ సాంకేతిక సమస్యలతో పనులు కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. మీసేవా కేంద్రాల ద్వారా సైతం అదే పరిస్థితని చెబుతున్నారు. కొత్త మ్యుటేషన్లు ఆటోమేటిక్‌గా జరుగుతున్నప్పటికీ, పాతవాటికి సంబంధించి ఇబ్బందులెదురవుతున్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందాలనుకునేవారికీ ఇదే పరిస్థితి.
ఇక టౌన్‌ప్లానింగ్‌లో అన్నీ ఆన్‌లైనే అని చెబుతున్నప్పటికీ, అధికారులను మచ్చిక చేసుకోకపోతే పనులు కావడం లేదనే ఆరోపణలున్నాయి. కొత్తగా ఇల్లు కుట్టుకున్న వారి ఆస్తిపన్నుకు సంబంధించిన సెల్ఫ్ అసెస్‌మెంట్ నుంచి దుకాణదారుల ట్రేడ్‌లైసెన్సుల వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే సదుపాయం కల్పించినప్పటికీ, తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రజల ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకొని, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే సమస్యలుండవని హిమాయత్‌నగర్‌కు చెందిన రాకేశ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఉన్నతాధికారులు చేపట్టిన ‘ఆన్‌లైన్ మంత్ర’ వల్ల తమకు రావాల్సిన పై ఆదాయం రానందున జీహెచ్‌ఎంసీలోని కొందరు ఉద్యోగులే సమస్యలు సృష్టిస్తున్నారనే అనుమానాలు సైతం ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, సదుపాయాలు అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం వినియోగం సైతం పరిశీలించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. (క్లిక్: హైదరాబాద్‌లో బోనాల జాతర.. తేదీలు ఖరారు)
ఆన్‌లైన్ సేవలు..
► సెల్ఫ్ అసెస్‌మెంట్స్
► మ్యుటేషన్స్
► బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
► ట్రేడ్ లైసెన్స్
నెలల తరబడి తిప్పుకుంటున్నారు
రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మ్యుటేషన్ జరుగు తుందని చెబుతున్నప్పటికీ అమలు కావడం లేదు. సర్వర్‌డౌన్ పేరిట నెలల తరబడి తిప్ప డం సమంజసం కాదు. లోపాలెక్కడున్నాయో పరిశీలించి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బందులు తొలగించాలి.
– లక్ష్మణ్, ఉప్పల్
Comments
Please login to add a commentAdd a comment