
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ ముఠా పశ్చిమ మండలంలోని స్పా సెంటర్లను టార్గెట్‌గా చేసుకుంది. ఆయా సెంటర్లకు కస్టమర్‌గా వెళ్లి, అసాంఘిక కార్యకలాపాల రంగు పూసి, సోదాలు చేసి, భయభ్రాంతులకు గురి చేసి, సెటిల్‌మెంట్‌కు పిలిచి, అందినకాడికి దండుకుంటోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ సహా అనేక చోట్ల పంజా విసిరిన ఈ ముఠా ఇప్పటికి దాదాపు రూ.50 లక్షల వరకు కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ గ్యాంగ్‌కు కొందరు పోలీసులు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫోన్ చేసి, కస్టమర్‌గా వెళ్లి...
వెస్ట్‌జోన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్పా లేదా మసాజ్ సెంటర్ వద్ద రెక్కీ నిర్వహిస్తున్న ఈ ముఠా అనువైన దాన్ని టార్గెట్ చేసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్‌లోనూ వీటిని ఎంపిక చేసుకుంటోంది. ఆపై దాని ఫోన్ నెంబర్ సేకరించే ఈ ముఠా సభ్యుడు నిర్వాహకులకు కాల్ చేస్తాడు. కస్టమర్ మాదిరిగా మాట్లాడుతూ ఆయా సెంటర్లు అందించే సేవలు, వాటి రుసుముల్ని తెలుసుకుంటాడు. ఈ తంతు పూర్తయిన తర్వాత వినియోగదారుడి మాదిరిగా ఆ సెంటర్‌కు వెళ్లే అతగాడు తనతో పాటు కండోమ్ ప్యాకెట్లు తీసుకువెళ్తాడు. ఇతడు వెళ్లే సమయంలో మిగిలిన ముఠా సభ్యులు ఆ సెంటర్‌కు సమీపంలోనే వేచి ఉంటారు. స్పా సెంటర్‌లోకి వెళ్లిన ముఠా సభ్యుడు అదును చూసుకుని తనతో తెచ్చిన కండోమ్ ప్యాకెట్లను మసాజ్ టేబుల్ కింద పడేస్తాడు. ఆ తర్వాత మిగిలిన వారికి సందేశం ఇచ్చి పోలీసుల మాదిరిగా రమ్మంటాడు.
దాడి చేసి, హడావుడి చేస్తూ....
ఈ సందేశం అందుకున్న వెంటనే సమీపంలో వేచి ఉన్న ముఠా సభ్యులు పోలీసుల మాదిరిగా ఆ సెంటర్‌పై దాడి చేస్తారు. తొలుత సీసీ కెమెరాలను ఆపేసి, వాటి దృశ్యాలు రికార్డు అయ్యే డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) స్వాదీనం చేసుకుంటున్నారు. స్పా మొత్తం సోదాలు చేస్తున్నట్లు నటిస్తూ తమ ముఠా సభ్యుడు ఉన్న గదిలోకి వెళ్తారు. అక్కడి టేబుల్ కింద పడి ఉండే కండోమ్ ప్యాకెట్లు స్వాదీనం చేసుకుని, అతడితో పాటు థెరపిస్టును ‘అదుపులోకి’ తీసుకుంటారు. వీటి ఆధారంగా ఆ స్పాలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ హడావుడి చేసి నిర్వాహకులను పూర్తి భయభ్రాంతులకు గురి చేస్తారు.
వాళ్లు పూర్తిగా తమ ట్రాప్‌లో పడ్డారని నిర్థారించుకున్న తర్వాత మరో అంకానికి తెరలేపుతారు. ముఠాకు చెందిన ఓ సభ్యుడు స్పా సెంటర్ నిర్వాహకులకు సహాయం చేస్తున్నట్లు ముందుకు వచ్చి వారితో మాట్లాడతాడు. సెంటర్‌లో ఏ తప్పు జరగట్లేదని తాను నమ్ముతున్నానని, ఈ విషయాన్ని తాను సెటిల్ చేస్తానంటూ చెప్తాడు. అటు నిర్వాహకులు, ఇటు పోలీసులుగా వచ్చిన తమ ముఠా సభ్యులతో మాట్లాడుతూ రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నాడు. ఈ తంతు మొత్తం అయితే అదే స్పా సెంటర్‌లో లేదంటే మరో ప్రాంతంలోని రెస్టారెంట్‌లో జరుగుతోంది.
కాగా అప్పుడప్పుడు స్పా సెంటర్ల కేంద్రంగా జరిగే అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్‌్కఫోర్స్‌తో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి వివాదాలను క్యాష్ చేసుకుంటూ ఈ ముఠా తమ దందా కొనసాగిస్తోంది. ఇలా ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు పశ్చిమ మండలంలోని పలు సెంటర్లపై పంజా విసిరి దాదాపు రూ.50 లక్షల వరకు కొల్లగొట్టినట్లు తెలిసింది. ఈ ముఠాకు సహకరిస్తున్న వారిలో కొందరు పోలీసులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment