ఖర్చుకు లెక్క.. ప్రతి రోడ్డూ పక్కా!
నగరంలో రోడ్ల మరమ్మతులకు ఏటా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా...జీహెచ్‌ఎంసీకి అపవాదులు..నగరవాసికి ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. రహదారుల దుస్థితిపై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా విమర్శలు వస్తున్నాయి. చివరకు మంత్రులు సైతం నగరంలో రోడ్లు దారుణంగా ఉన్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా...ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నా రోడ్లు ఎందుకు బాగుపడడం లేదని గ్రేటర్ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.
ఇకపై రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలు పక్కాగా ఉండేలా చూడాలని...రోడ్ల కోసం ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్క ఉండాలని...నిర్మించిన ప్రతి రోడ్డు పదికాలాలు మన్నేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. రోడ్ల చరిత్రను, స్వరూపాన్ని, రిపేర్లు, ఖర్చు చేసిన నిధులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసి, నిరంతర పర్యవేక్షణతో అవినీతికి అడ్డుకట్ట వేయాలని కసరత్తు చేస్తున్నారు.
* రహదారులకు ఇక ‘ఆన్‌లైన్’ చికిత్స
* ‘లక్ష రోడ్లు’గా గ్రేటర్ రహదారుల విభజన
* ప్రతి రోడ్డు ‘చరిత్ర’ ఆన్‌లైన్‌లో
* నాణ్యతకు భరోసా.. అవినీతికి అడ్డుకట్ట
* చర్యలకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలోని గగన్‌మహల్‌లో ఒక రోడ్డు కోసం ఐదేళ్లుగా రూ. 31లక్షల7 వేల183 ఖర్చు చేశారు. అయినా ఇది ఎంత కాలం మన్నికగా ఉంటుందో తెలియదు. రాబోయే సంవత్సరాల్లో ఇంకెంత ఖర్చు చేస్తారో తెలియదు. ఈ పరిస్థితి నివారించేందుకు ఇకపై ప్రతి రోడ్డుకు ఎప్పుడు పడితే అప్పుడు ఖర్చు చేయకుండా నిర్ణీత వ్యవధి వరకు మన్నికతో ఉండేలా నాణ్యమైన రోడ్లు వేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.
అందుకుగాను నగరంలోని రోడ్లను మొత్తం లక్ష రోడ్లు(యూనిట్లు)గా విభజించి ప్రతి రోడ్డుకూ ఒక జిప్పర్ కోడ్ ఇవ్వనున్నారు. సదరు నెంబరును వినియోగించి ఆన్‌లైన్ ద్వారా, మొబైల్‌యాప్ ద్వారా రోడ్డు పరిస్థితిని వీక్షించవచ్చు. నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు ఏరోజు ఎంత పని జరిగిందీ దాని ద్వారానే నమోదు చేసి మెజర్‌మెంట్ బుక్(ఎంబీ)లో జరిగిన పని వివరాలను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. తద్వారా ఏ రోడ్డులో ఏ రోజు ఎంత పని జరిగిందనేది తెలుస్తుంది.
అందుకనుగుణంగా బిల్లులు జారీ అవుతాయి. అడ్డగోలుగా ఎక్కువ మొత్తంలో నిధులు దుబారా చేసే అవకాశం ఉండదు. దాంతోపాటు పనుల నాణ్యతను సైతం వీక్షించవచ్చు. ఈ దిశగా ఇప్పటికే గగన్‌మహల్ ప్రాంతంలో దీనికి సంబంధించిన నమూనా కోసం ఒక ప్రైవేటు ఏజెన్సీ ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టింది. దాని ఫలితాన్ని బట్టి తమకు కావల్సిన విధంగా జియోట్యాగింగ్‌తో సహ రోడ్లకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందించేందుకు తగిన ఏజెన్సీని టెండర్ల ద్వారా ఆహ్వానించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఎన్‌ఆర్‌ఎస్‌ఏ(నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ)కు తొలి ప్రాధాన్యతనిస్తూ దానికే ఈ పనులు అప్పగించే యోచన ఉన్నట్లు తెలిసింది.
ప్రతి రోడ్డు చరిత్ర ఆన్‌లైన్‌లో..
ఈ కొత్త విధానం ద్వారా ప్రతి రోడ్డు వివరం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటమే కాక, దానికి ఎప్పుడెప్పుడు ఎంతమొత్తం ఖర్చు చేసింది తెలుస్తుంది. వేసిన రోడ్డునే మళీ ్లమళ్లీ వేసేందుకు నిధులివ్వరు. ఇందుకుగాను ఐదంకెల జిప్పర్ కోడ్‌ను వినియోగిస్తారు. ఇందులో మొదటి రెండు డిజిట్లు ప్రధాన రహదారిని, తర్వాతి రెండు డిజిట్లు ఉప రోడ్డును, ఆ తర్వాతి డిజిట్ ఇంకా లోపల ఉండే అంతర్గత రోడ్డును సూచిస్తుంది.
ఇలా వంద మీటర్ల రోడ్డును ఒక సెగ్మెంట్‌గా గుర్తించి, ప్రతిదానికీ 5 డిజిట్ల కోడ్ ఇస్తారు. ఇలా నగరంలోని మొత్తం రోడ్లను దాదాపు లక్ష యూనిట్లుగా గుర్తించి కోడ్‌ను ఇస్తారు. ఈ కోడ్‌ను ఉపయోగించడం ద్వారా రోడ్డుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు. నిర్మాణం బీటీనా సీసీయా లేక ఇతర రోడ్డా అనేది కూడా తెలుస్తుంది. దానికి గత ఐదేళ్లలో చేసిన ఖర్చుతో పాటు ఇకపై చేయబోయే ప్రతిపైసాకు లెక్క ఉంటుంది. ఇలా సంబంధిత రహదారి చరిత్ర మొత్తం ఆన్‌లైన్‌లో నిక్షిప్తమవుతుంది. ఒకే రోడ్డుకు పదేపదే మరమ్మతుల పేరిట దొంగబిల్లులు పెట్టేందుకు వీలుండదు. చేయని పనుల్ని చేసినట్లు చూపడమూ కుదరదు.
బడ్జెట్‌లో మూడొంతులు రోడ్లకే...
జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లో సింహభాగం..అంటే..నిధుల వ్యయంలో మూడొంతులు రోడ్ల కోసమే ఖర్చు చేస్తున్నారు. ఇలా గడచిన ఏడేళ్లుగా రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి పనుల కోసం జీహెచ్‌ఎంసీ దాదాపు రూ. 3వేల కోట్లు ఖర్చు చేసింది. గత ఒక్క సంవత్సరమే (2015-16) దాదాపు రూ. 800 కోట్లు ఖర్చు చేశారు. అయినా ఎక్కడ చూసినా గుంతలు.. ఎగుడు దిగుళ్లు.. వానొస్తే చెరువులు.. గంటల తరబడి ట్రాఫిక్‌జామ్‌లు తదితర కష్టాలు నిత్యకృత్యాలయ్యాయి.
మంత్రులతో సహా అందరూ నగర రోడ్ల అనుభవంతో పెదవి విరుస్తున్నారు. ఇన్ని కోట్లు ఖర్చు చేసినా రోడ్లు బాగుపడకపోవడానికి నిధుల దుబారానో లేక పనులు నాణ్యతగా లేకపోవడమోనని గుర్తించారు. దీన్ని నివారించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలకే రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఇటీవల జరిగిన సుదీర్ఘ వర్క్‌షాప్‌లో మునిసిపల్ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోడ్ల ‘చరిత్ర’ కనుక్కునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తమ ప్లాన్‌ను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, ఆయన సూచన మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.