Repaired roads
-
బడ్జెట్ ఆహా..! పనులు ఊహ!!
►అంచనా చేరని ఆదాయం ►ముందుకు సాగని పనులు ►ఇదీ జీహెచ్ఎంసీ సంప్రదాయం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అభివృద్ధికి వేస్తున్న బడ్జెట్ మహా గొప్పగా ఉంటోంది. కానీ, వస్తున్న నిధులకు.. చేస్తున్న ఖర్చుకు పొంతన కుదరడం లేదు. కలల బడ్జెట్ వాస్తవరూపం దాల్చకపోవడం ఏటా ఓ ప్రహసనంలా మారింది. ఊహిస్తున్న ఆదాయానికి.. వాస్తవంగా సమకూరుతున్న నిధులకు సంబంధం ఉండడం లేదు. దీంతో ఏటేటా జీహెచ్ఎంసీ బడ్జెట్‌కు, ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి చేస్తున్న ఖర్చు మధ్య అంతరం భారీగా ఉంటోంది. ఈ సారీ అదే పునరావృతమైంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో ఇరవైరోజులే ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సర బడ్జెట్ శాసనసభ సమావేశాలు సైతం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ బడ్జెట్‌పై ‘సాక్షి’ విశ్లేషణ. సాక్షి, సిటీబ్యూరో : మహానగరంలో పలు చోట్ల బహుళ వరుసల ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి పనుల కోసం ఎస్సార్డీపీ కింద రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్ లెక్కల్లో చూపారు. కానీ ఏడాది కాలంలో కేవలం రూ.125 కోట్లే ఖర్చు చేశారు. ఈ పనులకు నిధుల లేమి పెద్ద సమస్య అయితే.. భూసేకరణ, మెట్రోరైలు పనులు వంటి ఆటంకాలు మరోవైపు వచ్చిపడ్డాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి తప్ప, పురోగతి మాత్రం లేదు. మైండ్‌స్పేస్ జంక్షన్ వద్ద పనులు సాగుతుండగా.. చింతల్‌కుంట వద్ద మొదలయ్యాయి. మిగతా జంక్షన్లలో ప్రారంభమే కాలేదు. రోడ్లదీ అదేదారి.. నగర రోడ్లకు సైతం బడ్జెట్లో రూ.860 కోట్లు చూపించారు. కానీ ఈ ఆర్థిక సంవత్సర నిధుల్లోంచి రూ.209 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. గత ఏడాది వేసిన రోడ్ల పనులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు తప్ప కొత్తవాటిపై దృష్టి పెట్టలేదు. వైట్ టాపింగ్, పేవర్‌బ్లాక్‌లు, ప్లాస్టిక్ రోడ్లు వేసేందుకు ప్రతిపాదనాలు చేసినప్పటికీ నిధుల లేమితో ముందడుగు పడలేదు. కదలని వరద కాలువ వరద కాలువల ఆధునీకరణకు బడ్జెట్లో రూ.257 కోట్లు చూపించారు. ఈ సంవత్సరం వర్షాకాలంలో పలు ప్రాంతాల ముంపు నేపథ్యంలో తిరిగి సర్వే పనులు చేపట్టారు. ఇప్పటి వరకు సర్వే మాత్రమే జరిగింది. వరద కాలువలను ఆధునికీకరించేందుకు భారీసంఖ్యలో ఆస్తుల్ని తొలగించాల్సి రావడంతో పునరాలోచనలో పడ్డారు. తొలగించాల్సిన ఆస్తుల్ని వీలైనంతమేరకు తగ్గించాలనే యోచనలో ఉన్నారు. వరద కాలువల (నాలాల) వెంబడి నివాసాలు ఏర్పరచుకున్నవారితో పాటు స్థానిక నేతల ఒత్తిళ్ల వల్ల ప్రకటనలకు తగ్గట్లుగా పనులు సాగలేదు. దీంతో రూ.50 కోట్లు మాత్రం ఖర్చు చేశారు. స్లాటర్ హౌస్లదీ ఆతీరే.. ఇక స్లాటర్‌హౌస్‌ల కోసం బడ్జెట్లో రూ.20 కోట్లు చూపించారు. వీటిపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. నగరంలోని జీహెచ్ఎంసీ స్లాటర్‌హౌస్‌లు ప్రారంభమైనా తగిన విధంగా ప్రచారం చేయకపోవడంతో ఇప్పటికే ఎక్కువ మంది చెంగిచెర్లకే వెళ్తున్నారు. అయినా అధికారుల ఉదాసీనతకు కారణాలేమిటో వారికే తెలియాలి. పేదల ఇళ్లు మరింత ఆలస్యం నగరంలో నిరుపేదల ఇళ్ల కోసం రూ.250 కోట్లు బడ్జెట్లో ఉన్నప్పటికీ, స్థల సేకరణలో జాప్యం.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వంటి కారణాలతో ఈ సంవత్సరం ఎలాంటి పనులూ జరగలేదు. ఈ పద్దులో కేవలం రూ.15 కోట్లే ఖర్చయ్యాయి. అన్నింటిదీ అదే పరిస్థితి.. మోడ్రన్ మార్కెట్లు.. బస్షెల్టర్లు, పార్కింగ్ ప్రదేశాలు, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.140 కోట్లు కేటాయించారు. కానీ ఎలాంటి ఖర్చు చేయకపోవడంతో పథకాలు అమలుకు నోచుకోలేదు. చాలా పథకాలు ప్రారంభం కాకపోగా, మరికొన్ని కొంతమేర మాత్రమే జరిగాయి. ఇందుకు ఎన్ని కారణాలున్నా, ప్రధాన కారణం మాత్రం నిధుల సమస్యే. రాబడి పరిస్థితి ఇదీ.. రెవెన్యూ రసీదుల ద్వారా మొత్తం రూ.2,768.56 కోట్లు రాగలవని అంచనా వేస్తే, ఇప్పటి వరకు వచ్చింది రూ.1850 కోట్లు మాత్రమే. అలాగే క్యాపిటల్ రసీదుల ద్వారా రూ.4,938.43 కోట్లు రాగలవనేది అంచనా కాగా, వచ్చింది రూ.2,200 కోట్లు మాత్రమే. -
పది రోజులకే పాడైన రోడ్డు
పర్సంటేజీల మత్తులో కరువైన పర్యవేక్షణ నాణ్యతను పట్టించుకోని పీఆర్ ఇంజనీర్లు పైడిపలిల్లో తూతూ మంత్రంగా బీటీ పనులు వరంగల్ : పది కాలాల పాటు ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుండగా.. అధికారుల మాముళ్ల మత్తు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి పనులు మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు. అ«ధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 13వ ఆర్థిక సంఘం నిధులతో వరంగల్–ఏటూరునాగారం జాతీయ రహదారి నుంచి పైడిపల్లి వరకు ఉన్న బీటీ రోడ్డు రెన్యూవల్ కోసం 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.10.40లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులకు 2015 నవంబర్ 20న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు జాతీయ రహదారి నుంచి అగ్రికల్చర్ ఫాంహౌజ్ మీదుగా పైడిపల్లి గ్రామం వరకు గుంతలమయంగా ఉన్న రోడ్డును మరమ్మత్తులు చేసి ఆపై బీటీ వేయాల్సి ఉంది. గత నెల రెండో వారంలో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ ఒక రోజులోనే జాతీయ రహదారి నుంచి 3–4వందల మీటర్ల వరకు బీటీ వేసి చేతులు దులుపుకున్నాడు. ఉన్న రోడ్డుపై జీఎస్బీ(గ్రాన్యూల్ సబ్ బేస్) గ్రావెల్ వేసి అది పూర్తిగా కంపాక్ట్ కాక ముందే నాణ్యత కొరవడిన బీటీ వేయడంతో పది రోజులకే మళ్లీ రోడ్డు కంకర తేలినట్లుగా మారింది. ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పైడిపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని బీటీని వేయడం వల్లే రోడ్డు పది రోజులకు లేస్తోందని వాపోతున్నారు. ఇకనైనా రోడ్డును పునర్మించాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. కల్వర్టు వద్ద గుంతలు... జాతీయ రహదారి నుంచి పైడిపల్లికి వెళ్లే రహదారి ప్రారంభంలో వర్షపు నీరు వెళ్లేందుకు కల్వర్టు నిర్మించాల్సి ఉండగా పైపులు వేశారు. దీంతో రోడ్డుపై గుంతలు పడ్డాయి. ఇక్కడ కల్వర్డు నిర్మిస్తే వర్షాకాలంలో వరద నీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగేది. పైపు కల్వర్టు నిర్మించేందుకు తొలుత నిర్ధేశించిన మేరకు సిమెంట్ కాంక్రీట్.. ఆ తర్వాత పైపులు వేయాల్సి ఉంటుంది. ఈ పనులను పీఆర్ ఇంజనీర్లు పర్యవేక్షించకపోవడంతో నిర్మాణ సమయంలో‡కాంట్రాక్టర్ ఏం చేశారో... ఎలా చేశారో తెలియకపోగా నాసిరకంగా సాగాయి. కేవలం పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో కాంట్రాక్టర్ పైపులు వేసి వాటిపై గ్రావెల్ పోయడంతో పది రోజులకే దిగబడి పోయి గుంతలమయమైంది. తొలగిపోతున్న బీటీ లేయర్... రహదారులను బీటీ రెన్యూవల్ చేసే సమయంలో అప్పటి వరకు ఉన్న గుంతలను 20ఎంఎం కంకరను డాంబర్‌తో మిక్స్ చేసి పూడ్చాల్సి ఉంటుంది. అనంతరం రోలింగ్ చేసిన పిదప దానిపై రెన్యూవల్ బీటీ లేయర్ వేయాలి. బీటీ లేయర్లో నిర్ధేశించిన మేరకు తారు మిక్స్ చేయకపోవడం వల్ల లేయర్ మొత్తం గ్రావెల్‌గా మారి రోడ్డుపై గుంతలు తేలుతున్నాయి. ఇంత జరుగుతున్నా పంచాయతీ రాజ్ ఇంజనీర్లు ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, నాణ్యత లేని బీటీ రెన్యూవల్‌కు క్యూసీ అధికారులు సర్టిఫికెట్ ఎలా ఇచ్చారన్న విషయం తేలాల్సి ఉంది. -
రోడ్లకు మరమ్మతులు చేయండి
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో దెబ్బతిన్న నగర రహదారులను వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మెట్రో రైల్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయని... వాటి పనులు చేపట్టేందుకు వెంటనే జీహెచ్ఎంసీ, హైద్రాబాద్ మెట్రో రైల్ అధికారులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఇఎన్సీలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల నాబార్డ్ సహకారంతో ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ రోడ్ల నిర్మాణ పనులను వేగిరం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఆమోదించిన 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్రానికి అప్పగించేవరకు రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుందన్నారు. డిసెంబర్ 15-18 వరకు హైటెక్స్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. దాదాపు 5వేల మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రమాదాల నివారణ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టత, ట్రాఫిక్ నిబంధనలు తదితర అంశాలపై ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. -
ఖర్చుకు లెక్క.. ప్రతి రోడ్డూ పక్కా!
నగరంలో రోడ్ల మరమ్మతులకు ఏటా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా...జీహెచ్ఎంసీకి అపవాదులు..నగరవాసికి ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. రహదారుల దుస్థితిపై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా విమర్శలు వస్తున్నాయి. చివరకు మంత్రులు సైతం నగరంలో రోడ్లు దారుణంగా ఉన్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా...ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నా రోడ్లు ఎందుకు బాగుపడడం లేదని గ్రేటర్ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇకపై రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలు పక్కాగా ఉండేలా చూడాలని...రోడ్ల కోసం ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్క ఉండాలని...నిర్మించిన ప్రతి రోడ్డు పదికాలాలు మన్నేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. రోడ్ల చరిత్రను, స్వరూపాన్ని, రిపేర్లు, ఖర్చు చేసిన నిధులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నిక్షిప్తం చేసి, నిరంతర పర్యవేక్షణతో అవినీతికి అడ్డుకట్ట వేయాలని కసరత్తు చేస్తున్నారు. * రహదారులకు ఇక ‘ఆన్లైన్’ చికిత్స * ‘లక్ష రోడ్లు’గా గ్రేటర్ రహదారుల విభజన * ప్రతి రోడ్డు ‘చరిత్ర’ ఆన్లైన్లో * నాణ్యతకు భరోసా.. అవినీతికి అడ్డుకట్ట * చర్యలకు సిద్ధమైన జీహెచ్ఎంసీ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని గగన్‌మహల్‌లో ఒక రోడ్డు కోసం ఐదేళ్లుగా రూ. 31లక్షల7 వేల183 ఖర్చు చేశారు. అయినా ఇది ఎంత కాలం మన్నికగా ఉంటుందో తెలియదు. రాబోయే సంవత్సరాల్లో ఇంకెంత ఖర్చు చేస్తారో తెలియదు. ఈ పరిస్థితి నివారించేందుకు ఇకపై ప్రతి రోడ్డుకు ఎప్పుడు పడితే అప్పుడు ఖర్చు చేయకుండా నిర్ణీత వ్యవధి వరకు మన్నికతో ఉండేలా నాణ్యమైన రోడ్లు వేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. అందుకుగాను నగరంలోని రోడ్లను మొత్తం లక్ష రోడ్లు(యూనిట్లు)గా విభజించి ప్రతి రోడ్డుకూ ఒక జిప్పర్ కోడ్ ఇవ్వనున్నారు. సదరు నెంబరును వినియోగించి ఆన్లైన్ ద్వారా, మొబైల్యాప్ ద్వారా రోడ్డు పరిస్థితిని వీక్షించవచ్చు. నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు ఏరోజు ఎంత పని జరిగిందీ దాని ద్వారానే నమోదు చేసి మెజర్మెంట్ బుక్(ఎంబీ)లో జరిగిన పని వివరాలను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. తద్వారా ఏ రోడ్డులో ఏ రోజు ఎంత పని జరిగిందనేది తెలుస్తుంది. అందుకనుగుణంగా బిల్లులు జారీ అవుతాయి. అడ్డగోలుగా ఎక్కువ మొత్తంలో నిధులు దుబారా చేసే అవకాశం ఉండదు. దాంతోపాటు పనుల నాణ్యతను సైతం వీక్షించవచ్చు. ఈ దిశగా ఇప్పటికే గగన్‌మహల్ ప్రాంతంలో దీనికి సంబంధించిన నమూనా కోసం ఒక ప్రైవేటు ఏజెన్సీ ప్రయోగాత్మకంగా సర్వే చేపట్టింది. దాని ఫలితాన్ని బట్టి తమకు కావల్సిన విధంగా జియోట్యాగింగ్‌తో సహ రోడ్లకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందించేందుకు తగిన ఏజెన్సీని టెండర్ల ద్వారా ఆహ్వానించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఎన్ఆర్ఎస్ఏ(నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ)కు తొలి ప్రాధాన్యతనిస్తూ దానికే ఈ పనులు అప్పగించే యోచన ఉన్నట్లు తెలిసింది. ప్రతి రోడ్డు చరిత్ర ఆన్లైన్లో.. ఈ కొత్త విధానం ద్వారా ప్రతి రోడ్డు వివరం ఆన్లైన్లో అందుబాటులో ఉండటమే కాక, దానికి ఎప్పుడెప్పుడు ఎంతమొత్తం ఖర్చు చేసింది తెలుస్తుంది. వేసిన రోడ్డునే మళీ ్లమళ్లీ వేసేందుకు నిధులివ్వరు. ఇందుకుగాను ఐదంకెల జిప్పర్ కోడ్‌ను వినియోగిస్తారు. ఇందులో మొదటి రెండు డిజిట్లు ప్రధాన రహదారిని, తర్వాతి రెండు డిజిట్లు ఉప రోడ్డును, ఆ తర్వాతి డిజిట్ ఇంకా లోపల ఉండే అంతర్గత రోడ్డును సూచిస్తుంది. ఇలా వంద మీటర్ల రోడ్డును ఒక సెగ్మెంట్‌గా గుర్తించి, ప్రతిదానికీ 5 డిజిట్ల కోడ్ ఇస్తారు. ఇలా నగరంలోని మొత్తం రోడ్లను దాదాపు లక్ష యూనిట్లుగా గుర్తించి కోడ్‌ను ఇస్తారు. ఈ కోడ్‌ను ఉపయోగించడం ద్వారా రోడ్డుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు. నిర్మాణం బీటీనా సీసీయా లేక ఇతర రోడ్డా అనేది కూడా తెలుస్తుంది. దానికి గత ఐదేళ్లలో చేసిన ఖర్చుతో పాటు ఇకపై చేయబోయే ప్రతిపైసాకు లెక్క ఉంటుంది. ఇలా సంబంధిత రహదారి చరిత్ర మొత్తం ఆన్లైన్లో నిక్షిప్తమవుతుంది. ఒకే రోడ్డుకు పదేపదే మరమ్మతుల పేరిట దొంగబిల్లులు పెట్టేందుకు వీలుండదు. చేయని పనుల్ని చేసినట్లు చూపడమూ కుదరదు. బడ్జెట్లో మూడొంతులు రోడ్లకే... జీహెచ్ఎంసీ బడ్జెట్లో సింహభాగం..అంటే..నిధుల వ్యయంలో మూడొంతులు రోడ్ల కోసమే ఖర్చు చేస్తున్నారు. ఇలా గడచిన ఏడేళ్లుగా రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి పనుల కోసం జీహెచ్ఎంసీ దాదాపు రూ. 3వేల కోట్లు ఖర్చు చేసింది. గత ఒక్క సంవత్సరమే (2015-16) దాదాపు రూ. 800 కోట్లు ఖర్చు చేశారు. అయినా ఎక్కడ చూసినా గుంతలు.. ఎగుడు దిగుళ్లు.. వానొస్తే చెరువులు.. గంటల తరబడి ట్రాఫిక్‌జామ్‌లు తదితర కష్టాలు నిత్యకృత్యాలయ్యాయి. మంత్రులతో సహా అందరూ నగర రోడ్ల అనుభవంతో పెదవి విరుస్తున్నారు. ఇన్ని కోట్లు ఖర్చు చేసినా రోడ్లు బాగుపడకపోవడానికి నిధుల దుబారానో లేక పనులు నాణ్యతగా లేకపోవడమోనని గుర్తించారు. దీన్ని నివారించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలకే రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఇటీవల జరిగిన సుదీర్ఘ వర్క్‌షాప్‌లో మునిసిపల్ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోడ్ల ‘చరిత్ర’ కనుక్కునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తమ ప్లాన్‌ను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, ఆయన సూచన మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.