రోడ్లకు మరమ్మతులు చేయండి
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో దెబ్బతిన్న నగర రహదారులను వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మెట్రో రైల్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయని... వాటి పనులు చేపట్టేందుకు వెంటనే జీహెచ్‌ఎంసీ, హైద్రాబాద్ మెట్రో రైల్ అధికారులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
శుక్రవారం సచివాలయంలో ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఇఎన్‌సీలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల నాబార్డ్ సహకారంతో ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ రోడ్ల నిర్మాణ పనులను వేగిరం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఆమోదించిన 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్రానికి అప్పగించేవరకు రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుందన్నారు. డిసెంబర్ 15-18 వరకు హైటెక్స్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. దాదాపు 5వేల మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రమాదాల నివారణ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టత, ట్రాఫిక్ నిబంధనలు తదితర అంశాలపై ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు.