పది రోజులకే పాడైన రోడ్డు | Ten days later the road is damaged | Sakshi
Sakshi News home page

పది రోజులకే పాడైన రోడ్డు

Published Mon, Jan 2 2017 10:54 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

పది రోజులకే పాడైన రోడ్డు

పది రోజులకే పాడైన రోడ్డు

పర్సంటేజీల మత్తులో కరువైన పర్యవేక్షణ
నాణ్యతను పట్టించుకోని పీఆర్‌ ఇంజనీర్లు
పైడిపలిల్లో తూతూ మంత్రంగా బీటీ పనులు


వరంగల్‌ : పది కాలాల పాటు ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుండగా.. అధికారుల మాముళ్ల మత్తు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి పనులు మూన్నాళ్ల ముచ్చటగానే మిగులుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు. అ«ధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

13వ ఆర్థిక సంఘం నిధులతో వరంగల్‌–ఏటూరునాగారం జాతీయ రహదారి నుంచి పైడిపల్లి వరకు ఉన్న బీటీ రోడ్డు రెన్యూవల్‌ కోసం 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.10.40లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులకు 2015 నవంబర్‌ 20న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు జాతీయ రహదారి నుంచి అగ్రికల్చర్‌ ఫాంహౌజ్‌ మీదుగా పైడిపల్లి గ్రామం వరకు గుంతలమయంగా ఉన్న రోడ్డును మరమ్మత్తులు చేసి ఆపై బీటీ వేయాల్సి ఉంది. గత నెల రెండో వారంలో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌ ఒక రోజులోనే జాతీయ రహదారి నుంచి 3–4వందల మీటర్ల వరకు బీటీ వేసి చేతులు దులుపుకున్నాడు. ఉన్న రోడ్డుపై జీఎస్‌బీ(గ్రాన్యూల్‌ సబ్‌ బేస్‌) గ్రావెల్‌ వేసి అది పూర్తిగా కంపాక్ట్‌ కాక ముందే నాణ్యత కొరవడిన బీటీ వేయడంతో పది రోజులకే మళ్లీ రోడ్డు కంకర తేలినట్లుగా మారింది. ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పైడిపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని బీటీని వేయడం వల్లే రోడ్డు పది రోజులకు లేస్తోందని వాపోతున్నారు. ఇకనైనా రోడ్డును పునర్మించాలని, లేనిపక్షంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

కల్వర్టు వద్ద గుంతలు...
జాతీయ రహదారి నుంచి పైడిపల్లికి వెళ్లే రహదారి ప్రారంభంలో వర్షపు నీరు వెళ్లేందుకు కల్వర్టు నిర్మించాల్సి ఉండగా పైపులు వేశారు. దీంతో రోడ్డుపై గుంతలు పడ్డాయి. ఇక్కడ కల్వర్డు నిర్మిస్తే వర్షాకాలంలో వరద నీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగేది. పైపు కల్వర్టు నిర్మించేందుకు తొలుత నిర్ధేశించిన మేరకు సిమెంట్‌ కాంక్రీట్‌.. ఆ తర్వాత పైపులు వేయాల్సి ఉంటుంది. ఈ పనులను పీఆర్‌ ఇంజనీర్లు పర్యవేక్షించకపోవడంతో నిర్మాణ సమయంలో‡కాంట్రాక్టర్‌ ఏం చేశారో... ఎలా చేశారో తెలియకపోగా నాసిరకంగా సాగాయి. కేవలం పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో కాంట్రాక్టర్‌ పైపులు వేసి వాటిపై గ్రావెల్‌ పోయడంతో పది రోజులకే దిగబడి పోయి గుంతలమయమైంది.

తొలగిపోతున్న బీటీ లేయర్‌...
రహదారులను బీటీ రెన్యూవల్‌ చేసే సమయంలో అప్పటి వరకు ఉన్న గుంతలను 20ఎంఎం కంకరను డాంబర్‌తో మిక్స్‌ చేసి పూడ్చాల్సి ఉంటుంది. అనంతరం రోలింగ్‌ చేసిన పిదప దానిపై రెన్యూవల్‌ బీటీ లేయర్‌ వేయాలి. బీటీ లేయర్‌లో నిర్ధేశించిన మేరకు తారు మిక్స్‌ చేయకపోవడం వల్ల లేయర్‌ మొత్తం గ్రావెల్‌గా మారి రోడ్డుపై గుంతలు తేలుతున్నాయి. ఇంత జరుగుతున్నా పంచాయతీ రాజ్‌ ఇంజనీర్లు ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, నాణ్యత లేని బీటీ రెన్యూవల్‌కు క్యూసీ అధికారులు సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారన్న విషయం తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement