సీఎం గారూ.. రండి
ఐనవోలు బ్రహ్మోత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానించిన ఎమ్మెల్యే అరూరి రమేష్
వరంగల్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆహ్వానించారు. ఎమ్మెల్యే అరూరి రమేష్ మంగళవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. జనవరి 12 నుంచి ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయని, ఈ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోనే ప్రముఖ ఆలయంగా ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి క్షేత్రానికి గుర్తింపు ఉందని పేర్కొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆహ్వానం అందుకున్న సీఎం కేసీఆర్... ఐనవోలుకు వచ్చే విషయంలో సానుకూలంగా స్పందించారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తోపాటు వర్ధన్నపేట ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు ఉన్నారు.
20 మందితో కమిటీ...
ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణ(ఉత్సవ) కమిటీని నియమించారు. టీఆర్‌ఎస్ నేత గజ్జెల్లి శ్రీరాములు చైర్మన్‌గా 20 మందితో కమిటీని ఖరారు చేశారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ కమిటీలో స్థానం కోసం వర్ధన్నపేట, ఐనవోలు మండలాల్లోని టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు తీవ్రంగా పోటీ పడ్డారు. దీంతో 20 మందికి స్థానం కల్పించాల్సి వచ్చింది. ఉత్సవాల జరిగే వరకు (ఉగాది వరకు) ఈ కమిటీ ఉండనుంది.