సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్‌లో గంటల కొద్దీ ప్రయాణం.. నివాస, వాణిజ్య సముదాయాల నుంచి ఒక్కసారిగా బయటికొచ్చే జనంతో రోడ్లు జామ్.. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరానికీ అరగంటకుపైగా పట్టడం.. ఇప్పటికే హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. దీనికితోడు భవిష్యత్తులో మరింత పెరిగే ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారంగా తెరపైకి వచ్చినదే ‘ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (టీఐఏ)’.
కొత్తగా భారీ భవనాలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించదలిస్తే.. ఆయా రహదారుల్లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, అదనంగా పెరిగే ట్రాఫిక్‌ను పరిశీలించి తగిన నిబంధనలతో అనుమతులు ఇవ్వడమే ‘టీఐఏ’. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) నాలుగేళ్ల కిందటే ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రద్దీ ప్రదేశాలు, ప్రధాన రోడ్ల పక్కన భారీ నివాస, వాణిజ్య భవనాలు వెలుస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ ఇబ్బంది పెరిగి పోతూనేఉంది.
‘ట్రాఫిక్ ఇంపాక్ట్’ అంచనా ఇలా..
ఉదాహరణకు ఒక మల్టీప్లెక్స్ భవనం నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలంటే భవనం బిల్టప్ ఏరియా, అందులోని సినిమా స్క్రీన్లు, షాపులు ఇలా అన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. వీటికి వచ్చిపోయే వారి సంఖ్య, ఆ ప్రాంతంలో పెరగబోయే రద్దీ, సినిమా షోల ప్రారంభ, ముగింపు సమయాల్లో ప్రభావం తదితర అంశాలు బేరీజు వేస్తారు. అక్కడ ప్రస్తుతం ఉన్న రహదారి òపెరగ నున్న రద్దీకి సరిపోతుందో లేదో అంచనా వేస్తారు. ఒకవేళ సరిపోని పక్షంలో రహదారిని విస్తరించేందుకున్న అవకాశాలు, ప్రత్యామ్నాయ మార్గాలు, సమీపంలోని జంక్షన్లు, వాటి వద్ద ఏర్పడబోయే ట్రాఫిక్ పరిస్థితి వంటి వివిధ అంశాలను పరిశీలి స్తారు. తర్వాత షరతులతో అనుమతులిస్తారు.
ట్రాఫిక్ సమస్య తలెత్తే పరిస్థితి ఉంటే.. దాని పరిష్కారానికి వీలుగా బిల్డర్ ఎక్కువ సెట్‌బ్యాక్‌లు వదలాల్సి ఉంటుంది. లేదా లింక్ రోడ్ల వంటి వాటికి చాన్స్ ఉంటే వేసేందుకు అనుమతిస్తారు. ఒకవేళ జీహెచ్‌ఎంసీయే రోడ్లు వేస్తే అందుకయ్యే వ్యయాన్ని బట్టి ఇంపాక్ట్ ఫీజు వసూలు చేస్తారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలాంటిప్రత్యా మ్నాయ పరిష్కారాలు లేని పక్షంలో బహుళ అంతస్తులకు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తారు.
ఒక్క అడుగూ పడక..
హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ మ రింత జటిలం కాకుండా ఉండేందుకు‘ఇంపాక్ట్’ ఆలోచన చేశారు. కొత్తగా నిర్మించే భవ నాల వల్ల ఆ ప్రాంతంలో ఎంత రద్దీ పెరగనుంది? అప్ప టికే ఉన్న ట్రాఫిక్ ఎంత? కొత్తగా పెరగబోయే వాహనాలు ఎన్ని ఉంటాయి? ఎన్ని వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉంది? పెరిగే ట్రాఫిక్ నుంచి ఉపశమనంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న అంశాలతో ‘ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (టీఐఏ)’ సర్టిఫికెట్‌ను జత పరిచేలా భవన నిర్మాణ నిబంధనల్లో పొందు పర్చేందుకు సిద్ధమయ్యారు. ఇది జరిగి నాలుగేళ్లయినా.. ఇప్పటికీ ముందడుగు పడలేదు.
ప్రధాన ప్రాంతాల్లోనూ ఆకాశ హర్మ్యాలు
కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఆకాశ హర్మ్యాలు పెరుగుతున్నాయి. ఎల్‌బీ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ వంటి అత్యధిక రద్దీ ఉండే ప్రధాన ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. దీనితో ప్రభుత్వం వేల కోట్ల ఖర్చుతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినా ట్రాఫిక్ సమస్యలు తగ్గకపోగా.. పెరిగిపోతూనే ఉన్నాయి. బంజారాహిల్స్‌లో ఇదివరకు ఉన్న భవనాల గరిష్ట ఎత్తు నిబంధనలను సైతం సవరించి ఆకాశ హర్మ్యాలు అనుమతులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ ఇక్కట్లున్న కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో సమస్య మరింత పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
గతేడాది వంద ఆకాశ హర్మ్యాలు: గతంలో జీహెచ్‌ఎంసీ వెలుపల మాత్రమే ఆకాశ హర్మ్యాలను ఎక్కువగా నిర్మించేవారు. ఇటీవలి కాలంలో బల్దియా పరిధిలోనూ ఇవి పెరుగుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు వంద హైరైజ్ భవనాలకు జీహెచ్‌ఎంసీ అనుమతులిచ్చింది. అంతకుముందు ఏడాది వాటి సంఖ్య 80కిపైనే ఉంది.
వారిని తప్పనిసరి చేస్తే మంచిదే..
పెద్ద బిల్డర్లు హైరైజ్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులలో పార్కింగ్ స్థలం వినియోగం కోసం ట్రాఫిక్ కన్సల్టెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నిబంధన తప్పనిసరి చేస్తే ప్రతీ ఒక్కరూ పాటిస్తారు. దీనితో ప్రాజెక్టుతోపాటు సదరు ప్రాంతంపై ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు అవకాశం ఉంటుంది. డివైడర్లు, బారికేడ్లు, వీధి దీపాలు వంటి ట్రాఫిక్ వ్యయా లను సీఎస్‌ఆర్ కింద బిల్డర్ చేపట్టేలా చేయాలి. – నరేంద్ర కుమార్ కామరాజు, ప్రణీత్ గ్రూప్
ఎన్‌ఓసీ ఉంటేనే..
భవనాల నుంచి వచ్చే వాహనాలు, బయట పార్కింగ్ చేసే వాహనాలతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. అందుకే వాణిజ్య సముదాయాలతో పాటు హైరైజ్ నివాస భవనాలకు కూడా ట్రాఫిక్ పోలీసు ఎన్‌ఓసీ ఉంటేనే అనుమతులు జారీ చేయాలి. 25 అంతస్తులకు మించిన ప్రతి భవనానికి ఈ విధానాన్ని అమలు చేస్తే మంచిది. – కె.నారాయణ్ నాయక్, ట్రాఫిక్ జాయింట్ సీపీ, సైబరాబాద్
Comments
Please login to add a commentAdd a comment