నాణ్యత డొల్ల రోడ్లు గుల్ల
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ంఎసీ రోడ్ల మరమ్మతులు, రీకార్పెటింగ్ పనులకు ఏటా దాదాపు రూ. 200 కోట్లు ఖర్చుచేస్తున్నా నాలుగు జల్లులకే నిలువెల్లా తూట్లు పడుతున్నాయి. పనులపై అధికారుల అశ్రద్ధ, పైపై పూతలతో కాంట్రాక్టర్లు పనులను మమ అనిపిస్తుండటంతో ఈ దుస్థితి తలెత్తుతోంది. మరోవైపు వర్షాకాలానికి ముందే పూర్తిచేయాల్సిన మరమ్మతు పనులు పూర్తికాకపోవడంతో తీరా వర్షాలొచ్చేసరికి సమస్య జటిలమవుతోంది. ఏటా ఇదే తీరు. మరోవైపు వివిధ ప్రభుత్వ యంత్రాంగాల మధ్య సమన్వయలేమి సైతం సమస్యల్ని పెంచుతున్నాయి.
సమాచారమే లేదు.. పరిష్కారమెలా?
నగరంలో ఏ రోడ్ల కింద ఎన్ని నాలాలున్నాయి?, ఏ రోడ్డు కింద ఏ గండం పొంచి ఉంది?, చెరువులు ఎంత మేర కబ్జా అయ్యాయి, ఎక్కడెన్ని పైప్‌లైన్లున్నాయనే సమాచారం సైతం జీహెచ్‌ంఎసీ వద్ద లేదు. గ్రేటర్‌లో ఏ రహదారి పరిస్థితి ఏమిటో, ఏ ఫై ్లఓవర్‌కు పొంచిఉన్న ప్రమాదమెంతో ముందే తెలుసుకొని ప్రమాదాల్ని నివారించాలనే ధ్యాస అసలే లేదు. నాలాలు, పైపులైన్లు, రోడ్లకు సంబంధించిన డేటేబేస్ ఏదీ జీహెచ్‌ఎంసీ వద్ద లేదు. దీంతో సమస్యకు అసలు కారణాలు తెలియడం లేవు. సమస్యే తెలియనప్పుడు శాశ్వత పరిష్కారం ఎలా సాధ్యం?. జీహెచ్‌ంఎసీ లో ఏళ్లతరబడి ఇదే జరుగుతోంది.
వందల కోట్లు ఖర్చవుతున్నా..
నగరంలో రోడ్లు త్వరితంగా దెబ్బతినేందుకు ప్రధాన కారణం వర్షపు నీరు వెళ్లే మార్గాల్లేకపోవడం. దాంతో నీరు చాలాసేపు రోడ్లపై నిలుస్తుండటంతో త్వరగా దెబ్బతింటున్నాయి. పైప్‌లైన్, కేబుల్ పనులు చేసినప్పుడు వెంటనే పూడ్చివేయకపోవడంతో సమస్యలు పెరుగుతున్నాయి. రోడ్ల ప్యాచ్‌వర్క్ పనులు, పాట్‌హోల్స్ మరమ్మతులు ఏడాది పొడవునా ఎప్పటికప్పుడు చేయాలి. కానీ అదీ జరగడం లేదు. ఏటేటా వేసవిలోనే నాలాల్లోని పూడిక తొలగింపు పనులు జరగకపోవడం వల్ల కూడా నాలాల్లో వాన నీరు వెళ్లే మార్గం లేక రోడ్లపైనే ప్రవహిస్తూ, రోడ్లు తొందరగా దెబ్బతింటున్నాయి.
ఇలా చేస్తేనే పరిష్కారం..
ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లో రోడ్లు వేయాలంటే ఇంజినీరింగ్ కళాశాలు, సాంకేతిక నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటారు.
బీటీ రోడ్లు వేయాల్సిన ప్రాంతాల్ని, ట్రాఫిక్ రద్దీని, వాహన భారాన్ని, భూగర్భంలోని పరిస్థితులు పరిశీలించి ఎంత లోతు నుంచి రోడ్డు వేయాలన్నది నిర్ణయిస్తారు.దాన్ని బట్టే డీబీఎం, బీసీ, ఎస్‌డీబీసీలను వేస్తారు. వీటిల్లో డీబీఎం (డెన్స్ బిటుమినస్) బాగా దఢమైనది కాగా, మిగతా రెండు వరుసగా దానికంటే తక్కువ దఢమైనవి. బీటీరోడ్లు వేశాక రెండేళ్ల తర్వాత నిర్ణీత వ్యవధుల్లో సామర్ధ్య పరీక్షలు నిర్వహించాలి. అందుకుగాను బింకిల్‌మ్యాన్స్ బీమ్ డిఫ్లెక్షన్ టెస్ట్‌లు వంటివి చేయాలి.
రోడ్లు వేసే ముందే ట్రాఫిక్ భారం, డ్రైనేజీ లైన్లు, కేబుల్స్ కోసం తవ్వకాల వంటివీ అంచనా వేసి, అందుకనుగుణండా నిర్మించాలి.నగరంలో ఏ ఒక్క రోడ్డునీ సంపూర్ణంగా వేసింది లేదు. ప్యాచ్‌వర్క్‌లు తప్ప దేన్నీ సరైన పద్ధతిలో నిర్మించట్లేదు.
రోడ్డు నిర్మాణంతోపాటే వరదనీటి కాలువలు, రోడ్డుపై నీరు నిల్వలేకుండా తగిన కేంబర్ (నీరు రోడ్డు నుంచి పక్కకు దిగిపోయేలా)తో వేయాలి. నిర్మాణ పనులను ఇంజినీర్లు దగ్గరుండి పర్యవేక్షించాలి. పనుల్ని కాంట్రాక్టర్ల ఇష్టానుసారం వదిలేస్తుండటంతో పనుల్లో నాణ్యత లోపిస్తోంది.
బీటీ వేసేప్పుడు ఉష్ణోగ్రతలు 200 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గకూడదు. అందుకు డిజిటల్ టెంపరేచర్ మీటర్ వినియోగించాలి. బీటీని బాగా రోలింగ్ చేయాలి. అదీ చేయట్లేదు. రోడ్డు డెన్సిటీ టెస్ట్‌ను మరిచేపోయారు. ఏ ఒక్క ప్రమాణాన్నీ సరిగ్గా పాటించడం లేరు.
భవన నిర్మాణాలకు అనుమతులిచ్చే ముందు ఇంజినీరింగ్ విభాగం సూచనలు పాటిస్తే మేలు. ఆయా భవనాల నుంచి నీరు ఎలా బయటకు వెళ్తుందనే అంచనా కూడా లేకుండా ఇష్టానుసారం బహుళ అంతస్తులకు, ఎంత ఎత్తుకైనా అనుమతులిస్తున్నారు. తద్వారా వాటినుంచి వచ్చేనీరు రోడ్లపై చేరుతోంది.గంటకు 12మి.మీ.
వర్షపాతాన్ని తట్టుకునే సామర్ధ్యం మాత్రమే నగర నాలాలకుంది. గంటకు కనీసం 40 మి.మీ.సామర్ధ్యాన్ని తట్టుకునేలా నాలాలు అభివృద్ధి చెందితే తప్ప నగర ప్రజలకు వాననీటి కష్టాలు తప్పవని ఉన్నతస్థాయి కమిటీ సూచించినా అందుకనుగుణంగా చర్యల్లేవు.
రోడ్డు డాక్టర్ వచ్చేసింది..
ఏటా ఎదురవుతున్న ఈ సమస్యల్ని గుర్తించి రహదారుల మరమ్మతుల్లో భాగంగా పాట్‌హోల్స్ పూడ్చివేతలకు ఇటీవలే ప్రత్యేక యంత్రాన్ని అద్దెప్రాతిపదికన తీసుకున్నారు. రోడ్డు డాక్టరుగా వ్యవహరించే దీని సాయంతో తగిన వేడితో బీటీ వేయవచ్చు. మరమ్మతు చేశాక దీర్ఘకాలం మన్నుతుందని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే దీన్ని వినియోగిస్తున్నారు. దీని ద్వారా కలిగే ఫలితం తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.