నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగింది. తరచు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి,కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తుప్రారంభించింది. సిటీకి సంబంధించి మొత్తం 85 బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు గతేడాది గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఇప్పుడు పూర్తిస్థాయి నిరోధక చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
సాక్షి, సిటీబ్యూరో:
నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి జీహెచ్‌ఎంసీ రంగంలోకి దిగింది. తరచు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు ప్రారంభించింది. సిటీకి సంబంధించి మొత్తం 85 బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు గతేడాది గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఇప్పుడు పూర్తిస్థాయి నిరోధక చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
2016 గణాంకాలతో స్టడీ...
సిటీలో బ్లాక్‌స్పాట్స్‌గా పరిగణించే ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులు శాంతిభద్రతల విభాగం అధికారుల సహాయం తీసుకున్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నిరోధానికి ట్రాఫిక్ పోలీసులు పని చేస్తారు. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసేది మాత్రం లా అండ్ ఆర్డర్ పోలీసులే. ఈ నేపథ్యంలోనే వారి వద్ద ఉన్న గణాంకాలు సేకరించారు. 2016లో సిటీలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల జాబితాలను సేకరించి అధ్యయనం చేశారు. ఒకే ప్రాంతం, స్టెచ్‌లో రెండు కంటే ఎక్కువ యాక్సిడెంట్స్ చోటు చేసుకున్న ప్రాంతాలను గుర్తించారు. వీటిలో యాదృచ్ఛికంగా జరిగిన వాటిని మినహాయించారు. ఇంజినీరింగ్ సహా ఇతర లోపాల వల్ల చోటు చేసుకున్న ప్రమాదాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆయా ప్రాంతాలను గుర్తించారు.
‘ఇన్నర్’లోనే అత్యధికంగా...
నగర ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 25 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటిలో కేవలం ఏడింటి పరిధిలో మాత్రమే బ్లాక్‌స్పాట్స్ లేవని తేలింది. మిగిలిన 18 ట్రాఫిక్ ఠాణాల పరిధిలోనూ తరచుగా ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్‌స్పాట్స్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటిలోనూ ఒక ఠాణా పరిధిలో ఆరు, మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో ఐదేసి, పదింటి పరిధిలో మూడేసి చొప్పున యాక్సిడెంట్స్ స్పాట్స్ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్‌లో (ఐఆర్‌ఆర్) విస్తరించిన ఉన్న ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధుల్లోనే బ్లాక్‌స్పాట్స్ ఎక్కువగా ఉంటున్నాయని తేలింది.
అనేకం ‘చావు’రస్తాలే...
నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో అత్యధికం చౌరస్తాలు, జంక్షన్లే ఉంటున్నాయి. రద్దీ వేళలు, సిగ్నల్స్ యాక్టివ్‌గా ఉండే సమయంలో కంటే మిగిలిన సమయాల్లోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ 85 బ్లాక్‌స్పాట్స్‌లో దాదాపు 80 శాతం చౌరస్తాల్లో ఉన్నవే. ఆయా ప్రాంతాలు సైతం హైదరాబాద్–సైబరాబాద్–రాచకొండ సరిహద్దుల్లో ఉన్నవే ఎక్కువ కావడం గమనార్హం. వీటిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో మరణించిన/క్షతగాత్రులైన వారిలో 40 శాతం పాదచారులు, మరో 40 శాతం ద్విచక్రవాహనచోదకులే ఉంటున్నారు.
ఒక్కోచోట ఒక్కో కారణం...
సిటీలోని ఆయా ప్రాంతాలు బ్లాక్‌స్పాట్స్‌గా మారడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. అత్యధికంగా రోడ్డు దాటే ప్రయత్నాల్లో ఉన్న పాదచారులే కావడం గమనార్హం. తాడ్‌బంద్ ముస్లిం గ్రేవ్‌యార్డ్ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో పాటు ఇంజినీరింగ్ లోపాలు సైతం వాహనచోదకులు, పాదచారులకు శాపాలుగా మారాయి. అలాగే 2016లో నలుగురు చనిపోయిన కోఠి జంక్షన్ సైతం పాదచారులకు ప్రమాదహేతువుగా మారింది. ఇలాంటి కారణాలు ఎన్నో ఈ 85 ప్రాంతాల్లో ఉన్నాయి.
30 శాతం మరణాలు అక్కడే...
2016లో నగర వ్యాప్తంగా 2398 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిలో 375 మంది మరణించగా... మరో 2023 మంది క్షతగాత్రులయ్యారు. సిటీ మొత్తమ్మీద గణాంకాలు ఇలా ఉంటే... ఆ 85 ప్రాంతాల్లోనే 647 ప్రమాదాలు చోటు చేసుకుని మొత్తం సంఖ్యలో 26.9 శాతంగా నమోదయ్యాయి. అలాగే మొత్తం మృతుల్లో 31.4 శాతం (118) మంది బ్లాక్‌స్పాట్స్‌లోనే ప్రాణాలు కోల్పోయినట్లు నగర పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నారు.
ఇవే ప్రధాన కారణాలు: పరిమితికి మించిన వేగం (ప్రధానంగా ఐఆర్‌ఆర్‌లో)
♦ మద్యం తాగి వాహనాలను నడపటం
♦ మలుపులు ఉన్న చోట్ల డివైడర్లు, మీడియమ్స్ లేకపోవడం
♦ అత్యంత సమస్యాత్మకంగా (బ్లైండ్) ఉన్న మలుపులు
♦ కీలక సూచనలు చేసే సైనేజ్ బోర్డులు లేకపోవడం
♦ ఇరుకైనా రోడ్లు, ఆపై అక్కడే ఉంటున్న ఆక్రమణలు
♦ రోడ్ ఇంజినీరింగ్‌ను పట్టించుకోకుండా రహదారి నిర్మాణం
♦ రహదారులపై హఠాత్తుగా చేపడుతున్న మరమ్మతులు
♦ క్యారేజ్ వేలో తొలగించకుండా వదిలేసిన చెట్లు, కరెంటు స్తంభాలు
♦ అవసరమైన స్థాయిలో విద్యుత్ దీపాలు లేకపోవడం
♦ వాహనచోదకులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం
♦ నో–ఎంట్రీల్లోకి వాహనాలతో దూసుకుపోవడం
♦ రోడ్ మార్కింగ్ లేకపోవడం,శాస్త్రీయత కొరవడటం.
Comments
Please login to add a commentAdd a comment