ఉస్మాన్ సాగర్ ఉదృతం, హిమయత్ సాగర్ ఉగ్రరూపం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ భాగ్యరేఖ చారిత్రక మూసీనది ఉగ్రరూపం దాల్చింది. వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో జలమండలి అధికారులు వరుసగా జలాశయాల గేట్లను తెరచి మూసీలోకి వరద నీటిని వదిలిపెడుతున్నారు. బుధవారం ఏకంగా గండిపేట్‌కు 13, హిమాయత్‌సాగర్‌కు 8 గేట్లను ఎత్తివేశారు. దీంతో మూసీలో వరదనీటి ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది.
నగరంలో మూసీ ప్రవహించే బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ)మార్గంలో మూసీ మునుపెన్నడూ లేనివిధంగా పరవళ్లు తొక్కుతోంది. ఇదే క్రమంలో చాదర్‌ఘాట్ మూసీ చిన్న వంతెనపై నుంచి వరద ప్రవాహం పెరగడంతో ట్రాఫిక్‌పోలీసులు ఈ బ్రిడ్జీని మూసివేశారు. మూసారాంబాగ్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. నగరంలో బుధవారం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. మూసారాంబాగ్ వంతెన మూసివేయడంతో అంబర్‌పేట్ కొత్త బ్రిడ్జీపైనుంచి వాహనాల రాక పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక మూసీ పరివాహక ప్రాంతమైన మూసానగర్, కమలానగర్ పరిసరాలను మూసీ వరదనీరు చుట్టేసింది.
మన్సూర్‌నగర్, చాదర్‌నగర్ సమీపంలోని ఇళ్లలో చేరిన నీరు
అంబర్‌పేట్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. రత్నానగర్, పటేల్‌నగర్, గోల్నాక ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మదర్సా, శంకర్‌నగర్, మూసానగర్ నుంచి సుమారు రెండు వేల మందిని ఈ కేంద్రాలకు తరలించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో బాధితులకు ఆహారం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
జంట జలాశయాలకు వరద ప్రవాహం
- ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఇన్‌ఫ్లో భారీగా పెరుగుతుండడంతో రెండు జలాశయాల గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. బుధవారం ఉస్మాన్ సాగర్‌కు 13 గేట్లు, హిమాయత్ సాగర్ 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
- భారీగా వరద చేరుతున్న జంట జలాశయాలను బుధవారం ఉదయం జలమండలి ఎండీ దానకిశోర్ సందర్శించారు. వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్షించారు. రెండు జలాశయాల వద్ద భద్రత మరింత పెంచాలని పోలీసులకు సూచించారు. సామాన్య ప్రజలు, సందర్శకులు జంట జలాశయాల వద్దకు రావొద్దని ఆయన కోరారు. మూడు పోలీస్ కమిషనరేట్లతో జలమండలి నిరంతరం సమన్వయం చేసుకుంటుందని తెలిపారు.
జాతీయ రహదారి జలదిగ్బంధం
జియాగూడ/దూద్‌బౌలి/అఫ్జల్‌గంజ్: జంట జలాశయాల గేట్లను ఎత్తివేయడంతో పురానాపూల్ పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారి పూర్తిగా మునిగాయి. పురానాపూల్ వంతెన, సమాంతర వంతెనలు శిథిలావస్థకు చేరడంతో ముందు జాగ్రత్త చర్యగా రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
- జాతీయ రహదారిపై వరదనీరు పొంగిపొర్లుతుండగా అర్ధరాత్రి ప్రాంతంలో జియాగూడ దుర్గానగర్ నుండి జాతీయ రహదారి పైకి వెళ్లిన లారీ, పురానాపూల్ నుండి అత్తాపూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు నీట మునిగాయి.
- పురానాపూల్ లోతట్టు ప్రాంతం కావడంతో వంతెన కానాలు సగానికి పైగా మునిగాయి.
- అలాగే జాతీయ రహదారి పక్కనే ఉన్న నివాసాలు, చాకిరేవులు నీట మునిగాయి.
మూసీ సమీపంలోని మన్సూర్‌నగర్‌లో నీట మునిగిన ఇళ్లు కాలనీని ముంచెత్తిన వరద నీరు
వ్యక్తిని కాపాడిన పోలీసులు
- అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో పురానాపూల్ ఇక్బాల్‌గంజ్ నుండి మూసీనదిలోకి ఓ వ్యక్తి మద్యం మత్తులో జాతీయ రహదారికి రాగా అప్పటికే పొంగిపొర్లుతున్న నీటిలోకి పడిపోయి గల్లంతయ్యాడు.
- సమాచారం అందుకున్న హబీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదబాబు, మంగళ్‌హాట్ ఎస్.ఐ రాంబాబు ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని రక్షించారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
- పురానాపూల్ మూసీనది పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ మేరకు ఆయన మూసీనది పరివాహక ప్రాంతం జాతీయ రహదారిని సందర్శించారు.
సీపీ స్టీఫెన్ రవీంద్ర పరిశీలన
బండ్లగూడ: బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిమాయత్‌సాగర్ జలాశయాన్ని బుధవారం సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మంగళవారం హిమాయత్‌సాగర్ సరీ్వస్ రోడ్డులో వరదలో చిక్కుకుపోయిన యువకుడిని కాపాడిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ హెచ్ కానిస్టేబుల్ బేగ్, డ్రైవర్ మల్లాంగ్‌షా, హెల్పర్స్ రాకేష్, విజయ్‌లను సీపీ స్టీఫెన్ రవీంద్ర, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్‌రావు, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లవకుమార్‌రెడ్డిలు అభినందించారు.
సహాయక చర్యలకు సిద్ధం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
మూసీ, ఈసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకా‹Ùగౌడ్ సూచించారు. జంట జలాశయాల గేట్లను ఎత్తడంతో బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టిప్పుఖాన్ బ్రిడ్జీ, హైదర్షాకోట్, గంధంగూడ, కాలనీలు, బస్తీలు, ఈసీ,మూసీ వాగులను ఆయన సందర్శించారు. సహాయక చర్యలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
సందర్శకులకు అనుమతి లేదు..
రాజేంద్రనగర్ నుంచి హిమాయత్‌సాగర్‌కు వెళ్లే ఓఆర్‌ఆర్ సబ్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అంధకారంలో పరీవాహక ప్రాంతాలు
మూసీ ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని పలు సబ్‌స్టేషన్లకు వరద ముప్పు ఏర్పడింది. సబ్‌స్టేషన్లలోకి నీరు చేరడం, డిస్ట్రబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునగడంతో ఆయా ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇబ్రహీంబాగ్ డివిజన్ నార్సింగ్ సెక్షన్ పరిధిలోని 11 కేవీ గండిపేట ఫీడర్ సహా 33/11 కేవీ సీబీఐటీ స బ్‌స్టేషన్‌లోకి గండిపేట చెరువు నీరు వచ్చి చేరింది. మెహిదీపట్నం డివిజన్ లంగర్‌హౌస్ సెక్షన్ పరిధిలోని బాపూఘాట్, లంగర్‌హౌస్ టుప్‌ఖాన్ బ్రిడ్జ్‌పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో దాని కింద ఉన్న ఆరు ఎల్టీ విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
దీంతో ఆయా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయి ంది. పురానాపూల్, కుల్సుంపుర, రహీంపుర ఫీడర్ల పరిధిలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్మాన్‌ఘడ్, చాదర్‌ఘట్, వెంకట్‌నగర్, శంకర్‌నగర్, మూసా నగర్, యశోద ఆస్పత్రి, హనుమాన్‌నగర్ ఫీడర్ల పరిధిలోని 12 గంటల పాటు సరఫరా నిలిచిపోయింది. సరూర్‌నగర్ ఆర్కేపురం ప్రజయ్‌నివాస్ అపార్ట్‌మెంట్స్ ఫేజ్–1 మూడు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు నీటమునిగాయి. వీటిలో రెండు డీటీఆర్‌లను పునరుద్ధరించారు.
పురానాపూల్ బ్రిడ్జి వద్ద నీటిలో మునిగిన లారీ,సాలార్జంగ్ బ్రిడ్జి వద్ద నీటిలో మునిగిన ఆలయం
ఆలయంలోకి నీరు..
దూద్‌బౌలి పరిధిలోని శివాలయఘాట్ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. నవగ్రహాల గుడి నీటిలో మునిగిపోయింది. పక్కనే ఉన్న నివాసితులు భయాందోళనకు గురయ్యారు. పురానాపూల్ శ్మశాన వాటికలో వరదనీరు పూర్తిగా నిండిపోవడంతో బుధవారం చనిపోయిన వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. దహన సంస్కారాలకు ఎలాంటి స్థలం లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు.
ప్రమాదకరంగా ఎంజీబీఎస్ ప్రహరీ
నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఎంజీబీఎస్ వరద నీటిలో మునిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల గేట్లు ఎత్తడంతో మూసీ పరిహక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో మూసీ నది దారి మధ్యలో ఉండే ఎంజీబీఎస్ సైతం నీట మునిగింది. ఎంజీబీఎస్ చుట్టూ రహదారుల వెంట ఉన్న ప్రహరీ ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు కూలుతుందో ఏమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
(చదవండి: గాడి తప్పిన ‘గ్యాస్’!)
Comments
Please login to add a commentAdd a comment