Hyderabad Heavy Rains: Minister KTR Visits Rain Flood Affected Areas - Sakshi
Sakshi News home page

అతి భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో కేటీఆర్‌ పర్యటన.. వారికి హెచ్చరిక!

Published Thu, Jul 27 2023 3:16 PM | Last Updated on Thu, Jul 27 2023 4:01 PM

Hyderabad Rains: KTR Visits Rain Flood Affected Areas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో హైదరాబాద్‌ తాజా పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి పురపాలకశాఖ అధికారులు, అడిషనల్‌ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో  మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. 


అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలని ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య తగ్గిందన్నారు.

మూసీ వరదను మానిటర్‌ చేస్తున్నాం
అనంతరం మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. పురపాలకశాఖ అధికారులతోనూ కేసీఆర్‌ ప్రత్యేకంగా మాట్లాడారని తెలిపారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మూసీ వరదను ఎప్పటికప్పుడు మానిటర్‌ చేస్తున్నామని తెలిపారు.

వరద ప్రభావం కొంత తగ్గింది
కుంభవృష్టిగా, ఎడతెరిపి లేకుండా వర్షం పడటం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతుందని, పలు కాలనీల్లో మాత్రం తాత్కాలికంగా వరదనీరు వచ్చి చేరిందని అన్నారు. నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గిందన్నారు. తమ ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడమేనని స్పష్టం చేశారు. 

వాళ్ల సెలవులు రద్దు
హైదరాబాద్ నగరంలోనూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సహా ఇతర ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారని తెలిపారు. పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులు రద్దు చేసినట్లు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సాధ్యమైన ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

135 చెరువులకు గేట్లు బిగించాం
హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. హైదరాబాద్ నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేశాం. దీంతోపాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాము. 135 చెరువులకు గేట్లు బిగించాం. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారు 

ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది
గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేది. అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గింది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని . భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం  దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి. వారి మనో ధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుంది. 

చెరువులకు గండి పడే ప్రమాదం
వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. చెరువులకు గండి పడే ప్రమాదం ఉంటే వాటిని కూడా సమీక్షిస్తున్నాం. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం. వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాము. అవసరమైతే రేపు నేను కూడా స్వయంగా వెళ్తాను’ అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement