సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఆరాంఘర్ జంక్షన్‌ను సకల హంగులతో, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి సిద్ధమైన జీహెచ్‌ఎంసీ త్వరలో పనులు ప్రారంభించనుంది. దేశంలోని ఏ ఇతర నగరానికీ తీసిపోని విధంగా నగరంలోని జంక్షన్లను అభివృద్ధి పరచాలన్న మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో పట్టణ, నగర ప్రాంతాల్ని అందంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్న బెంగళూరుకు చెందిన ‘జన అర్బన్ స్పేస్’ రూపొందించిన డిజైన్‌తో ఆరాంఘర్ జంక్షన్‌ను తీర్చిదిద్దే చర్యలకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు.
ఆరాంఘర్ జంక్షన్ విశాలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం పాదచారులు రోడ్డు ఒకవైపు నుంచి మరో వైపు వెళ్లాలంటే ముప్పుతిప్పలు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు సైతం ఎక్కడ పడితే అక్కడ ఆగుతుండటంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అండర్‌పాస్ సైతం ఉన్నప్పటికీ రోడ్డుపై వాహనాల రాకపోకలతో గందరగోళ పరిస్థితులేర్పడుతున్నాయి.
కొత్త డిజైన్‌తో జంక్షన్‌ను అభివృద్ధి చేయడం వల్ల ఈ పరిస్థితులు మారనున్నాయి. పాదచారులు సులభంగా రోడ్లు దాటేలా జీబ్రాక్రాసింగ్స్ ఉంటాయి. ఆర్టీసీ బస్సులు నిర్ణీత ప్రదేశాల్లో నిలిచే ఏర్పాట్లుంటాయి. వీటితోపాటు జంక్షన్‌లోని నాలుగువైపులా రోడ్లకు అందమైన ఫుట్‌పాత్‌లు, జంక్షన్ మధ్యలో పచ్చదనంతో పరిసరాలు ఆహ్లాదంగా ఉంటాయి. ప్రయాణికులు సేద దీరేందుకు బెంచీల ఏర్పాట్లు తదితర సదుపాయాలుంటాయి.ఈ పనుల అంచనా వ్యయం రూ.2.63 కోట్లు.
జంక్షన్ అభివృద్ధి ఇలా..
►జంక్షన్ నలువైపులా పాదచారులు సులభంగా రోడ్డు దాటేలా జీబ్రాక్రాసింగ్స్ వంటివి ఏర్పాటు చేస్తారు.
►జంక్షన్ మధ్య వలయాకార ప్రదేశంలో పచ్చదనం పెంపుతోపాటు ఫౌంటెన్లు తదితరమైనవి ఏర్పాటు చేసి అందంగా కనిపించేలా చేస్తారు.
►వాహనాలు సాఫీగా మలుపు తిరిగేలా రోడ్డును విశాలం చేస్తారు.
►జంక్షన్‌కు నలువైపులా బస్టాప్‌లు. ఎటు వైపు వెళ్లే బస్సును ఎక్కాలనుకుంటే పాదచారులు అటువైపు వెళ్లేందుకు వీలుగా అన్ని వైపుల నుంచీ తగిన సదుపాయం.
►ఫ్రీ లెఫ్ట్ కోసం ప్రత్యేక మార్కింగ్స్, తదితర ఏర్పాట్లు.
►రాత్రివేళ సైతం జంక్షన్ అందంగా కనిపించేందుకు ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు.
►త్వరలోనే పనులు చేపట్టి, ఆర్నెళ్లలో పూర్తిచేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
12 జంక్షన్ల గుర్తింపు...
నగర ఖ్యాతిని ఇనుమడింపచేసేలా జోన్‌కు రెండు చొప్పున జంక్షన్లను ఇలా అభివృద్ధి చేయాలని తొలుత భావించారు. ఆమేరకు 12 జంక్షన్లను గుర్తించారు. వాటిల్లో ఆరాంఘర్‌తోపాటు ఐఎస్ సదన్, హబ్సిగూడ, కొత్తపేట, సోమాజిగూడ, పంజగుట్ట, మియాపూర్, గుల్ మొహర్‌కాలనీ, నారాయణగూడ, సంగీత్ తదితర జంక్షన్లున్నాయి. వీటిని జన అర్బన్‌స్పేస్ డిజైన్లతో తీర్చిదిద్దనున్నారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో వీటితోపాటు మరో 48 జంక్షన్లను కూడా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment