హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభించిన కొత్తగూడ మల్టీలెవెల్ ఫ్లైఓవర్
గచ్చిబౌలి (హైదరాబాద్): వంద శాతం మురుగు నీటి శుద్ధి చేసిన నగరంగా కొద్ది నెలల్లోనే హైదరాబాద్ నిలవనుందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇలా దేశంలోనే మొదటి నగరంగా చరిత్రలో నిలిచిపోనుందని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీతోపాటు ఏడెనిమిది మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వంద శాతం మురుగునీటి శుద్ధీకరణకు రూ.3,866 కోట్ల నిధులను కేటాయించామన్నారు.
31 కొత్త ఎస్‌టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్, మే నాటికి ఎస్‌టీపీల పనులు పూర్తవుతాయని, 100 శాతం మురుగునీటిని శుద్ధి చేసిన నగరంగా హైదరాబాద్ నిలవనుందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో రూ.263 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్తగూడ మల్టీ లెవెల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ను కొత్త సంవత్సరం కానుకగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో జీవన ప్రమాణాలు పెంచి విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
వెయ్యి కోట్లతో నాలాల విస్తరణ
స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (ఎస్‌ఎన్‌డీపీ)లో భాగంగా వెయ్యి కోట్లతో నాలాల విస్తరణ చేపడతామని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ విజన్‌తో దేశంలో ఏ నగరంలో జరగనంత మౌలిక వసతుల విస్తరణ హైదరాబాద్‌లో జరుగుతోందన్నారు. వేగంగా విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా ఎన్నో ప్రాజెక్ట్‌లు చేపడుతున్నామని, అందులో ముఖ్యమైనది స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) అని చెప్పారు.
దీని ద్వారా చేపట్టిన 34 ప్రాజెక్ట్‌లను ఇప్పటికే ప్రారంభించామని, ఈ సంవత్సరంలో మరో 11 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తవారు ఇక్కడి అభివృద్ధిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, రెండు మూడేళ్లలో పెద్దఎత్తున మార్పులు వచ్చాయని సోషల్ మీడియాలో చెబుతుంటే సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత అభివృద్ధి–సంక్షేమం అనే ద్విముఖ లక్ష్యంతో విస్తృతమైన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
విద్య–ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇతర పట్టణాలు, రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హైదరాబాద్‌కు వలస వస్తున్నారని, అందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు పనుల్ని వేగంగా పూర్తిచేస్తున్న ఇంజినీర్ల కృషిని గుర్తించిన కేటీఆర్ కొత్తగూడ ఫ్‌లై ఓవర్‌ను ఈ ప్రాజెక్టు పనులు పర్యవేక్షించిన జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ) వెంకటరమణచే రిబ్బన్ కట్ చేయించడం విశేషం. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మేయర్ విజయ లక్ష్మీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment