ఆక్రమణలే అడ్డంకులు!  | Officials confusion over the beautification of Musi | Sakshi
Sakshi News home page

ఆక్రమణలే అడ్డంకులు! 

Published Mon, Feb 26 2024 4:50 AM | Last Updated on Mon, Feb 26 2024 4:50 AM

Officials confusion over the beautification of Musi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరికి వడ్డాణంలో వంకెలు తిరుగుతూ వయ్యారంగా ఉండే మూసీ నదిని సుందరీకరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే, ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రధాన అడ్డంకులు మూసీ చుట్టూ ఉన్న ఆక్రమణలే. మూసీ నది పరివాహకం వెంబడి 8,500 ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. చారిత్రక మూసీ నదికి ఇరువైపులా బఫర్‌ జోన్‌లో, నదీగర్భంలో కూడా భవన నిర్మాణాలు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.

ఐదేళ్ల క్రితం గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ), రెవెన్యూ, నీటి పారుదల శాఖ సంయుక్తంగా డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (డీజీపీఎస్‌) సాంకేతికతను ఉపయోగించి మూసీ నది వెంట విస్తృత సర్వే చేశారు. మూసీ వెంబడి ఉన్న గ్రామ పటాలపై ఆ చిత్రాలను స్పష్టంగా కనిపించేలా (సూపర్‌ఇంపోజ్‌) చేశారు. 

ఆక్రమణలే పెద్ద సవాల్‌.. 
మూసీని శుభ్రం చేయడం ఎంత పెద్ద సవాలో అంతకు రెట్టింపు మూసీ నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నది పరివాహకం వెంబడి చాలా చోట్ల చిన్న గుడిసెలు, బస్తీలతో పాటు భవన నిర్మాణాలు ఉన్నాయి. నది గర్భంలో 1,700, బఫర్‌ జోన్‌లో 6,800 నిర్మాణాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వరకు మతపరమైన కట్టడాలున్నాయి.

వీటిలో చాలా వరకు గత రెండు దశాబ్ధాల కాలంలోనే నిర్మితమయ్యాయి. ముఖ్యంగా హైకోర్టు నుంచి చాదర్‌ఘాట్‌ మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన ఈ మతపరమైన కట్టడాలను తొలగించడం చాలా అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంత నివాసితులకు 2 బీహెచ్‌కే గృహాలను కేటాయించి ఆక్రమణలను తొలగించాలని భావించింది.

కానీ, అది కార్యరూపం దాల్చలేదు. భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన తరుణంలో మూసీ ఒడ్డున నివసిస్తున్న కాలనీ వాసుల కోసం నందనవనంలో ప్రత్యేకంగా గృహా సముదాయం కట్టించి ఇచ్చినా.. నదీ గర్భంలో ఆక్రమణలు మాత్రం ఆగలేదు.  

మూసీకి మాస్టర్‌ ప్లాన్‌.. 
ఇప్పటికే మూసీ రివర్‌ ఫ్రంట్‌ భూ వినియోగం, ఇతర వివరాలు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. తాజాగా మూసీ నదిలో వరద స్థాయి, సరిహద్దులను గుర్తించేందుకు 55 కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే చేయాలని మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) నిర్ణయించింది.

హద్దుల లెక్క తేలిన తర్వాత గ్లోబల్‌ కన్సల్టెంట్ల సహాయంతో మూసీ నదీ గర్భంలో రిక్రియేషనల్‌ జోన్, ల్యాండ్‌ స్కేపింగ్, కమర్షియల్‌ జోన్‌లతో సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ను అభివృద్ధి చేయనున్నారు. మూసీని సుందరీకరించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా గ్లోబల్‌ సిటీ రివర్‌ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి కల.

మూసీ అభివృద్ధికి అయ్యే వ్యయంలో కొంత బ్యాంకు నుంచి రుణం, మరికొంత పీపీపీ పద్ధతిలో చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement