dgps
-
ఆక్రమణలే అడ్డంకులు!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరికి వడ్డాణంలో వంకెలు తిరుగుతూ వయ్యారంగా ఉండే మూసీ నదిని సుందరీకరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే, ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రధాన అడ్డంకులు మూసీ చుట్టూ ఉన్న ఆక్రమణలే. మూసీ నది పరివాహకం వెంబడి 8,500 ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. చారిత్రక మూసీ నదికి ఇరువైపులా బఫర్ జోన్లో, నదీగర్భంలో కూడా భవన నిర్మాణాలు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), రెవెన్యూ, నీటి పారుదల శాఖ సంయుక్తంగా డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డీజీపీఎస్) సాంకేతికతను ఉపయోగించి మూసీ నది వెంట విస్తృత సర్వే చేశారు. మూసీ వెంబడి ఉన్న గ్రామ పటాలపై ఆ చిత్రాలను స్పష్టంగా కనిపించేలా (సూపర్ఇంపోజ్) చేశారు. ఆక్రమణలే పెద్ద సవాల్.. మూసీని శుభ్రం చేయడం ఎంత పెద్ద సవాలో అంతకు రెట్టింపు మూసీ నదికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నది పరివాహకం వెంబడి చాలా చోట్ల చిన్న గుడిసెలు, బస్తీలతో పాటు భవన నిర్మాణాలు ఉన్నాయి. నది గర్భంలో 1,700, బఫర్ జోన్లో 6,800 నిర్మాణాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వరకు మతపరమైన కట్టడాలున్నాయి. వీటిలో చాలా వరకు గత రెండు దశాబ్ధాల కాలంలోనే నిర్మితమయ్యాయి. ముఖ్యంగా హైకోర్టు నుంచి చాదర్‌ఘాట్ మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. ప్రజల విశ్వాసాలకు సంబంధించిన ఈ మతపరమైన కట్టడాలను తొలగించడం చాలా అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంత నివాసితులకు 2 బీహెచ్‌కే గృహాలను కేటాయించి ఆక్రమణలను తొలగించాలని భావించింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. భన్వర్‌లాల్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన తరుణంలో మూసీ ఒడ్డున నివసిస్తున్న కాలనీ వాసుల కోసం నందనవనంలో ప్రత్యేకంగా గృహా సముదాయం కట్టించి ఇచ్చినా.. నదీ గర్భంలో ఆక్రమణలు మాత్రం ఆగలేదు. మూసీకి మాస్టర్ ప్లాన్.. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ భూ వినియోగం, ఇతర వివరాలు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. తాజాగా మూసీ నదిలో వరద స్థాయి, సరిహద్దులను గుర్తించేందుకు 55 కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే చేయాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) నిర్ణయించింది. హద్దుల లెక్క తేలిన తర్వాత గ్లోబల్ కన్సల్టెంట్ల సహాయంతో మూసీ నదీ గర్భంలో రిక్రియేషనల్ జోన్, ల్యాండ్ స్కేపింగ్, కమర్షియల్ జోన్లతో సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను అభివృద్ధి చేయనున్నారు. మూసీని సుందరీకరించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వ్యాపార కేంద్రాలకు నిలయంగా గ్లోబల్ సిటీ రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి కల. మూసీ అభివృద్ధికి అయ్యే వ్యయంలో కొంత బ్యాంకు నుంచి రుణం, మరికొంత పీపీపీ పద్ధతిలో చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశాలను పరిశీలించాలని సీఎం మున్సిపల్ అధికారులను ఆదేశించారు. -
విశాఖలో నేడు ఎనిమిది రాష్ట్రాల డీజీపీల సదస్సు
-
ముమ్మరంగా డీజీపీఎస్ సర్వే
సాక్షి, అమరావతి: జీపీఆర్ఎస్ సిగ్నల్స్ అందని ప్రాంతాల్లో డీజీపీఎస్ పరికరాల ద్వారా భూములు రీ సర్వే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని ఆరు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) చేపట్టిన సర్వే విజయవంతమైంది. ఆరు గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు నంబర్ 13 నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ప్రైవేట్ ఏజెన్సీలు డీజీపీఎస్ సర్వే నిర్వహిస్తున్నాయి. త్వరలో నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సర్వే చేపట్టనున్నారు. కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో... ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జీఎన్ఎస్ఎస్ నెట్వర్క్ ద్వారా శాటిలైట్ల నుంచి వచ్చే జీపీఆర్ఎస్ సిగ్నల్స్ ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారు. కానీ కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ రాకపోవడం వల్ల సీవోఆర్‌ఎస్ నెట్వర్క్ ద్వారా పనిచేసే రోవర్లు సరిగా పనిచేయడంలేదు. దీంతో ఇటువంటి ప్రాంతాల్లో డీజీపీఎస్ పరికరాల ద్వారా రేడియో మోడ్‌లో రీ సర్వే చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 2,800 గ్రామాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ సరిగా రావడంలేదని గుర్తించారు. ఈ గ్రామాల్లో 28.50 లక్షల ఎకరాలను డీజీపీఎస్ ద్వారా సర్వే చేయనున్నారు. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్స్ సమస్య ఎక్కువగా ఉండడంతో అక్కడే ఎక్కువ దృష్టి పెట్టారు. మొత్తం 2,800 గ్రామాలను నాలుగు ప్యాకేజీలుగా విభజించి డీజీపీఎస్ సర్వేకు టెండర్లు పిలిచారు. తొలి ప్యాకేజీని గతంలోనే ఖరారు చేసి ఐదు ఏజెన్సీలకు పనులు అప్పగించడంతో సర్వే ముమ్మరంగా సాగుతోంది. మిగిలిన మూడు ప్యాకేజీల టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తయింది. త్వరలో అక్కడ కూడా సర్వే ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
2,783 గ్రామాల్లో డీజీపీఎస్ పరికరాలతో రీ సర్వే
సాక్షి, అమరావతి: జీపీఆర్ఎస్ సిగ్నల్స్ అందని 2,783 గ్రామాల్లో ప్రభుత్వం డీజీపీఎస్ పరికరాల ద్వారా భూముల రీ సర్వే చేపట్టింది. కొన్ని గ్రామాల్లో ఈ సర్వే మొదలైంది. డ్రోన్లు, జీఎన్ఎస్ఎస్ రోవర్ల ద్వారా అత్యంత ఆధునికమైన హైబ్రిడ్ టెక్నాలజీతో సర్వే సెటిల్మెంట్ శాఖ రీ సర్వేలో భాగంగా భూములను కొలుస్తోంది. ఇందుకోసం జీఎన్ఎస్ఎస్ నెట్వర్క్ ద్వారా 70 సీవోఆర్‌ఎస్ (కంటిన్యుయస్లీ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్) బేస్‌స్టేషన్లను శాశ్వతపద్ధతిలో ఏర్పాటు చేసింది. శాటిలైట్ల ద్వారా వచ్చే జీపీఆర్ఎస్ సిగ్నల్స్ ఆధారంగా జీఎన్ఎస్ఎస్ నెట్వర్క్ ద్వారా ఈ కేంద్రాలు 24 గంటలు పనిచేస్తున్నాయి. కానీ కొండలు, దట్టమైన అటవీప్రాంతాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ రాకపోవడం వల్ల సీవోఆర్‌ఎస్ నెట్వర్క్ ద్వారా రోవర్లు సరిగా పనిచేయడంలేదు. ఇలాంటి ప్రాంతాల్లో డీజీపీఎస్ పరికరాల ద్వారా రేడియో మోడ్‌లో రీ సర్వే చేయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 189 మండలాల్లో 2,783 గ్రామాల్లో జీపీఆర్ఎస్ సిగ్నల్స్ సరిగా రావడంలేదని గుర్తించారు. ఈ గ్రామాల్లో 28.50 లక్షల ఎకరాలను రీ సర్వే చేయాల్సి ఉంది. అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 1,809 గ్రామాల్లో సిగ్నల్స్ అందడంలేదని గుర్తించారు. మొత్తం 2,783 గ్రామాల్లో ప్రైవేటు ఏజెన్సీల ద్వారా డీజీపీఎస్ ద్వారా రీ సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ గ్రామాలను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. అత్యధిక గ్రామాలున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్యాకేజీ–1కి టెండర్ల ప్రక్రియ ముగిసింది. విశాఖకు చెందిన జియోకాన్ సర్వేస్, విశాఖకు చెందిన సిల్వర్ టెక్నో సొల్యూషన్స్ కంపెనీలు ఈ టెండరు దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని ఆరుగ్రామాల్లో కొద్దిరోజుల కిందట ప్రయోగాత్మక సర్వేని విజయవంతంగా నిర్వహించాయి. రెండురోజుల కిందట ఈ గ్రామాల్లో డీజీపీఎస్ సర్వేను ప్రారంభించాయి. మిగిలిన మూడు ప్యాకేజీలకు త్వరలో టెండర్లు ఖరారు చేయనున్నారు. -
హద్దులు ఎలా తెలిసేది?
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని 13 మండలాల్లో 255 గ్రామాలు, 171 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం 91,416 సర్వేనంబరు ఉండగా.. వారి పరిధిలో 4,68,532 ఎకరాల భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. వీటిని సుమారు నాలుగు దశాబ్దాల క్రితం సర్వే చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల భూరికార్డుల ప్రక్షాళన సర్వే చేపట్టి కొన్నింటిని పరిష్కరించింది. చాలా వరకు వివాదాస్పదంగా ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన అధికారులు.. సర్వేయర్ల కొరతతో పనిలో జాప్యమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాలు ఉండగా 9 మంది సర్వేయర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. జిల్లా కార్యాలయంలో ఇద్దరు డెప్యూటీ సర్వేయర్లు, మరో ఇద్దరు సర్వేయర్లు ఉండాల్సి ఉండగా.. ఒక్కరితోనే నెట్టుకు వస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏడుగురు సర్వేయర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో భూమి కొలతలు ముందుకు సాగడం లేదు. ప్రైవేటు సర్వేయర్లపై నమ్మకం లేకపోవడం.. క్షేత్రస్థాయిలో రైతులు అంగీకరించకపోవడంతో ప్రభుత్వ సర్వేయర్ల కోసం నిరీక్షిస్తోది. ప్రతినెలా రూ.40వేల వరకు సర్వే కోసం ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నా.. సర్వేయర్ల కొరతతో ఇబ్బందిగా మారింది. సామాన్యులు భూమిని సర్వే చేయించుకోవడం ఓ సవాల్‌గా పరిణమించింది. కాసులిస్తేనే నోటీసులు.. భూమి సర్వేకు సంబంధించి ఒక్కో సర్వే నంబరుకు మండల సర్వేయర్‌కు రూ.250, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్(జిల్లాస్థాయిలో)కు రూ.300 ప్రభుత్వానికి ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజు మీ సేవ కేంద్రం ద్వారా చెల్లించినా సర్వేయర్లు భూమి కొలతకు ముందుకు రావడం లేదు. సరిహద్దు భూముల యజమానులకు నోటీసులు ఇవ్వడం లేదు. భూమి కొలతలకు సంబంధించి చుట్టూ ఉన్న భూముల యజమానులకు నోటీసులు ఇవ్వాలి. కానీ దరఖాస్తుదారుల వద్ద పెద్దఎత్తున మామూళ్లు దండుకుంటూ సర్వే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వేములవాడలో మండల సర్వేయర్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు ఇటీవల పట్టుకుని జైలుకు తరలించారు. నాలా మార్పిడి కోసం కాసులు తీసుకుంటూ ఆయన పట్టుబడ్డారు. అనేకమంది రైతులు భూములను సర్వే చేయించుకునేందుకు నిరీక్షిస్తున్నారు. ముడుపులు ఇస్తామని చెప్పినా.. సర్వేలు చేసేందుకు అప్పుడప్పుడు సతాయిస్తున్నారనే ఆరోపణ వస్తున్నాయి. ప్రభుత్వ భూసేకరణ పనులు.. జిల్లాలో ప్రభుత్వ భూసేకరణ పనులు ఎక్కువగా ఉన్నాయి. మధ్యమానేరు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ –9, 10, 11, 12 పనులు జిల్లాలో సాగుతున్నాయి. మల్కపేట రిజర్వాయర్, అనంతగిరి జలాశయం, కాల్వలు, రైల్వేలైన్, బైపాస్ రోడ్డు, అపరెల్ పార్క్ కోసం భూసేకరణ.. ఇలా జిల్లాలో అనేక పనులకు భూసేకరణ యుద్ధప్రాతిపదికన చేయాల్సి ఉంటోంది. దీంతో ప్రభుత్వ సర్వేయర్లు తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. సామాన్య రైతులు భూమి కొలతలు చేయించుకునే పరిస్థితి లేకుండా పోయింది. సర్వేయర్ శాఖ అధికారులు డిజిటల్ గ్లోబల్ పోజిషల్ సిస్టమ్ (డీజీపీఎస్) విధానంలో శాటిలైట్‌తో అనుసంధానంతో సర్వేలు చేయడంతో భూసేకరణ పనులు కాస్త వేగవంతమయ్యాయి. అయినా ఇంకా సర్వే కోసం చలానా చెల్లించిన రైతులు వందల్లో ఉన్నారు. మండలానికో సర్వేయర్‌ను పూర్తిస్థాయిలో నియమించి క్షేత్రస్థాయిలో భూములను సర్వేలు చేస్తే.. వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని అభిప్రాయపడుతున్నారు. హద్దులు పక్కాగా నిర్ధారణ అవుతాయి. ఆ దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పనిఒత్తిడి ఉంది మాపై పనిఒత్తిడి ఉంది. ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నమాట వాస్తమే. కానీ ప్రభుత్వ పరంగా వచ్చే సర్వే ఆర్డర్లను ముందుగా సర్వే చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు జిల్లెల్ల, మర్రిపెల్లి, పెద్దూరు శివారుల్లో 4వేల ఎకరాల భూములను సర్వే చేసి సేకరించారు. సీరియల్ ఆధారంగా, ప్రాధాన్యతాక్రమంలో సర్వే చేస్తాం. – వి.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సిరిసిల్ల -
రెండు రాష్ట్రాల డీజీపీలు ఒకేచోట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోనే రెండు రాష్ట్రాల డీజీపీలు కొనసాగనున్నారు. అలాగే ప్రస్తుతం హైదరాబాద్‌లో గల రాష్ర్టస్థాయి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విభాగాధిపతుల కార్యాలయాల్లోనే రెండు రాష్ట్రాలకు చెందిన కార్యాలయాలు కొనసాగుతాయి. ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాలకు భవనాల కేటాయింపు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఇందుకు సంబంధించిన కమిటీ చైర్మన్‌గా ఉన్న శ్యాంబాబు హైదరాబాద్‌లోని 179 విభాగాధిపతులతో సమావేశాలను దశల వారీగా శుక్రవారంతో పూర్తి చేశారు. ఉమ్మడి రాజధానిలో ప్రభుత్వ కార్యాలయ భవనాలు ఇరు రాష్ట్రాలకు కేటాయించే అధికారం రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌కు ఉంది. ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోనే కొన్ని అంతస్తులను తెలంగాణ డీజీపీ కార్యాలయానికి, మరి కొన్ని అంతస్తులను ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయానికి కేటాయించనున్నారు. అలాగే పోలీసు శాఖకు చెందిన అన్ని కార్యాలయాలను ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విభజించనున్నారు. సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాకును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంగా కేటాయించాలని నిర్ణయించిన నేపథ్యంలో భద్రతాపరంగా దాని ఎదురుగా గల పాడుపడిన జి-బ్లాకును కూల్చి వేయాలని పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రపతి పాలన సమయంలో ఎటువంటి నిర్మాణాలను కూల్చివేతకు అనుమతించబోనని నర్సింహన్ స్పష్టం చేశారు.