సాక్షి, అమరావతి: జీపీఆర్‌ఎస్ సిగ్నల్స్ అందని ప్రాంతాల్లో డీజీపీఎస్ పరికరాల ద్వారా భూములు రీ సర్వే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని ఆరు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) చేపట్టిన సర్వే విజయవంతమైంది. ఆరు గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు నంబర్ 13 నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ప్రైవేట్ ఏజెన్సీలు డీజీపీఎస్ సర్వే నిర్వహిస్తున్నాయి. త్వరలో నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సర్వే చేపట్టనున్నారు.
కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో...
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జీఎన్‌ఎస్‌ఎస్ నెట్‌వర్క్ ద్వారా శాటిలైట్ల నుంచి వచ్చే జీపీఆర్‌ఎస్ సిగ్నల్స్ ఆధారంగా సర్వే నిర్వహిస్తున్నారు. కానీ కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో జీపీఆర్‌ఎస్ సిగ్నల్స్ రాకపోవడం వల్ల సీవోఆర్‌ఎస్ నెట్‌వర్క్ ద్వారా పనిచేసే రోవర్లు సరిగా పనిచేయడంలేదు. దీంతో ఇటువంటి ప్రాంతాల్లో డీజీపీఎస్ పరికరాల ద్వారా రేడియో మోడ్‌లో రీ సర్వే చేస్తున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 2,800 గ్రామాల్లో జీపీఆర్‌ఎస్ సిగ్నల్స్ సరిగా రావడంలేదని గుర్తించారు. ఈ గ్రామాల్లో 28.50 లక్షల ఎకరాలను డీజీపీఎస్ ద్వారా సర్వే చేయనున్నారు.
ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్స్ సమస్య ఎక్కువగా ఉండడంతో అక్కడే ఎక్కువ దృష్టి పెట్టారు. మొత్తం 2,800 గ్రామాలను నాలుగు ప్యాకేజీలుగా విభజించి డీజీపీఎస్ సర్వేకు టెండర్లు పిలిచారు. తొలి ప్యాకేజీని గతంలోనే ఖరారు చేసి ఐదు ఏజెన్సీలకు పనులు అప్పగించడంతో సర్వే ముమ్మరంగా సాగుతోంది. మిగిలిన మూడు ప్యాకేజీల టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తయింది. త్వరలో అక్కడ కూడా సర్వే ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముమ్మరంగా డీజీపీఎస్ సర్వే
Published Tue, Nov 8 2022 6:00 AM | Last Updated on Tue, Nov 8 2022 6:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment