సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక భూమి రీసర్వే ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికా బద్ధంగా చేస్తోంది. గత వందేళ్ల చరిత్రలో దేశంలో ఎక్కడా తలపెట్టని అతి పెద్ద సర్వేని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నందున అవసరమైనవన్నీ సమకూర్చుకుంటూ ముందుకెళుతోంది. హైబ్రిడ్ మెథడ్‌లో కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్), డ్రోన్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ధిష్ట సమయంలో సర్వే క్రతువు పూర్తి చేసేందుకు టైమ్‌లైన్ రూపొందించింది. రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్, సర్వే ఆఫ్ ఇండియా సమన్వయంతో రీసర్వేకు నిబంధనావళి రూపొందించాయి.
17,460 రెవెన్యూ గ్రామాల్లో..
– రాష్ట్ర వ్యాప్తంగా 17,461 రెవెన్యూ గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని భూములు, స్థలాలు, ఇళ్లు సర్వే చేసి హద్దులు నిర్ణయించి యజమానులకు హక్కు పత్రాలు ఇవ్వాలన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోంది.
– మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో భూములు, స్థలాలు, ఇతర స్థిరాస్తులను మూడు దశల్లో సర్వే చేయనున్నారు. మొదటి దశలో 5,122 గ్రామాల్లో, రెండో దశలో 6000 గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తారు. తదుపరి మూడో దశలో మిగిలిన గ్రామాల్లో సర్వే ప్రారంభించి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేస్తారు.
– డ్రోన్ సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియానే డ్రోన్లను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ సర్వేయర్ల బృందం రాష్ట్రానికి చేరుకుంది.
శరవేగంగా రికార్డుల స్వచ్చికరణ
– రెవెన్యూ రికార్డుల స్వచ్చికరణ కార్యక్రమం చకచకా సాగుతోంది. ఎంపిక చేసిన గ్రామాల సరిహద్దు రాళ్లను అక్కడి సర్వేయర్లు గుర్తించారు. రికార్డులను సర్వే టీమ్‌కు అందజేశారు. సర్వే సమయంలో వచ్చే వివాదాలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి మండలానికి ఒకటి చొప్పున 670 మొబైల్ ట్రైబ్యునల్స్‌ను కూడా ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుంది.
– ఈ సర్వేలో జిల్లాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో రీసర్వేకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. గ్రామాల వారీగా సర్వే ప్రారంభమయ్యే తేదీలను ఆయా జిల్లా కలెక్టర్ల పేరుతో సర్వే అసిస్టెంట్ డైరెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. రీ సర్వే సమయంలో అందుబాటులో ఉండాలని గ్రామ సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాలు, పట్టణాల వారికి సూచిస్తారు.
మొదటి విడతలో 30 బేస్ స్టేషన్లు
– రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే కోసం 70 బేస్ స్టేషన్లు (సెల్‌ఫోన్ పని చేయడానికి సెల్ టవర్లలాగే రోవర్లకు బేస్ స్టేషన్లు అవసరం) ఏర్పాటు చేయాల్సి ఉంది. మొదటి దశలో 5,122 గ్రామాల్లో రీసర్వేకు ఇబ్బంది లేకుండా తొలుత 30 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 5 పూర్తయ్యాయి. మిగిలిన 25 బేస్ స్టేషన్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
– జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 3, విశాఖపట్నంలో 4, తూర్పుగోదావరిలో 7, పశ్చిమ గోదావరిలో 4, కృష్ణాలో 5, గుంటూరులో 3, ప్రకాశంలో 7, నెల్లూరులో 5, చిత్తూరులో 7, వైఎస్సార్ కడపలో 5, కర్నూలులో 5, అనంతపురంలో పది కలిపి మొత్తం 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
రేపు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు
ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద రీసర్వే పూర్తి చేసిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఈ నెల 21వ తేదీ (సోమవారం) పట్టాలు ఇవ్వడం ద్వారా రీసర్వే మహాక్రతువుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పచ్చజెండా ఊపుతారు. భూ యజమానులకు ఫీల్డ్ మ్యాపు, భూ యాజమాన్య హక్కు పత్రం (1బి), గ్రామంలోని స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తుల యజమానులకు ప్రాపర్టీ కార్డు (ఆస్తి పత్రం) అందజేస్తారు. అనంతరం ఈనెల 22వ తేదీన ప్రతి జిల్లాల్లో ఒక్కో గ్రామంలో రీసర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం 13 గ్రామాలను ఇప్పటికే ఎంపిక చేశారు. తదుపరి వారం రోజుల్లో ఒక్కో రెవెన్యూ డివిజన్‌లో ఒక్కో గ్రామం చొప్పున మొత్తం 51 గ్రామాల్లో, తర్వాత నాలుగైదు రోజుల్లో ఒక్కో మండలంలో ఒక్కొక్కటి చొప్పున 670 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రారంభిస్తారు. పక్షం లేదా 20 రోజుల నాటికి 5,122 గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించేలా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన 14,000 మంది సర్వేయర్లలో 9,423 మందికి సర్వే సెటిల్‌మెంట్ విభాగం ఇప్పటికే సంప్రదాయ సర్వే విధానాలపై శిక్షణ ఇచ్చింది. 6,740 మందికి ఆటోక్యాడ్, ఎల్రక్టానిక్ టోటల్ స్టేషన్స్ (ఈటీఎస్), డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) సర్వేపై శిక్షణ పూర్తి చేసింది.
ఎలాంటి రికార్డులు అడగరు
రీ సర్వే సందర్భంగా యజమానులు ఎలాంటి రికార్డులు చూపించాల్సిన పని ఉండదు. రెవెన్యూ శాఖ దగ్గర ఉన్న రికార్డుల ప్రకారమే సర్వే పూర్తి చేస్తారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం అన్నీ పరిశీలించి ఎలాంటి వివాదాలు లేని వారికి నిర్దిష్ట కాల పరిమితిలో శాశ్వత భూ హక్కులు కల్పిస్తారు. ప్రతి భూమి బిట్ (పార్సల్)కు విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తారు. రెవెన్యూ, సర్వే రికార్డులన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. రీ సర్వే తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజి్రస్టేషన్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేస్తోంది.
– నీరబ్ కుమార్ ప్రసాద్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్
రీసర్వేకు సర్వం సిద్ధం
Published Sun, Dec 20 2020 3:10 AM | Last Updated on Sun, Dec 20 2020 1:48 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment