సాక్షి, విజయవాడ: భూముల రీసర్వే కచ్చితత్వంతో పూర్తి చేస్తామని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ అన్నారు. మొదటి దశలో భాగంగా ఈ నెల 21న రీసర్వే ప్రారంభవుతుందని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో రాష్ట్రవ్యాప్తంగా భూములను సమగ్రంగా రీసర్వే చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సర్వే ఆఫ్ ఇండియాతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో గిరీష్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో మాత్రమే రీసర్వే జరగనుందని పేర్కొన్నారు. తమతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘ పూర్తి ఆధునిక సాంకేతికత ద్వారా రీసర్వే చేపడతాం. ఒప్పందంలో భాగంగా ఏపీ ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తాం. అత్యాధునిక కెమెరాలు, డ్రోన్లు వినియోగిస్తున్నాం.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంపై 14 వేల మంది సర్వేయర్లకి శిక్షణ ఇవ్వనున్నాం. రీసర్వే చేసి మేం ఇచ్చే మ్యాపులు అన్ని ప్రభుత్వ శాఖలకి ఉపయోగకరంగా ఉంటాయి. సర్వే ఆఫ్ ఇండియాకి ప్రామాణికత అధికం. మూడు దశల్లో కచ్చితత్వంతో రీసర్వే పూర్తిచేస్తాం. జాతీయ మ్యాపులు తయారు చేసే ఏజెన్సీగా సర్వేయర్ ఆఫ్ ఇండియా ఉంది. రీసర్వేకి జీపీఎస్ అనుసంధానం చేసిన డ్రోన్‌తో కొనసాగుతుంది. అయిదు సెంటీమీటర్ల మార్పుతో కచ్చితమైన సర్వే జరుగుతుంది. తిరుపతిలో ఒక ట్రైనింగ్ అకాడమి ఏర్పాటు చేస్తాం. ఛార్టర్డ్ సర్వేయర్లను రాబోయే కాలంలో అందించేందుకు ఈ ట్రైనింగ్ అకాడమీ ఉంటుంది’’ అని గిరీష్ కుమార్ తెలిపారు.(చదవండి: ఆ రాతలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్ )
మూడేళ్లపాటు ఒప్పందం
రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి రీసర్వే ప్రారంభం కాబోతోందని సీసీఎల్ఎ ఛీఫ్ కమీషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించి సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రీసర్వే పూర్తయ్యే వరకు రాబోయే మూడేళ్ల పాటు ఈ ఒప్పందం ఉంటుందని పేర్కొన్నారు. ‘‘ రీసర్వే ద్వారా ఒక యూనిక్ నంబర్ కేటాయిస్తాం. లాంగిట్యూడ్, ల్యాటిట్యూడ్ ఆధారంగా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ప్రతీ గ్రామంలో డ్రోన్ సర్వే ద్వారా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది’’ అని తెలిపారు.
17340 గ్రామాల్లో.. మూడు దశల్లో: ఉషారాణి
‘‘మన రాష్ట్రంలో బ్రిటిష్ కాలంలో వంద సంవత్సరాల క్రితం సర్వే జరిగింది. మళ్లీ ఇప్పుడు జరుగుతోంది. భూమి విలువ పెరగడంతో భూసమస్యలు పెరిగాయి. రీసర్వే ద్వారా భూవివాదాలకి పరిష్కారం లభిస్తుంది. ప్రజలు రీసర్వేకి సహకరించాలి. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పధకం ఈ నెల 21 న ప్రారంభిస్తాం. 2023 నాటికి మూడు దశల్లో ముగుస్తుంది. 14 వేల మంది సర్వేయర్లకి ప్రత్యేక శిక్షణనిస్తున్నాం. రీ సర్వే కోసం 956 కోట్లను కేటాయించాం. భూ యాజమానికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ ప్రక్రియ ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తాం. డ్రోన్లు వినియోగిస్తాం.
ప్రభుత్వ ఖర్చుతోనే భూములకి రీసర్వే చేసి రాళ్లు కూడా వేయడం జరుగుతుంది. రీసర్వే ద్వారా అసలైన యాజమానికి పూర్తి హక్కులు లభిస్తాయి. అదే విధంగా రీసర్వే తర్వాత సంబంధిత భూములపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తాం. అటవీ భూములు మినహాయించి వ్యవసాయ భూములు, గ్రామనకంఠాలు, పట్టణాలలోని భూములన్నింటికీ రీసర్వే జరుగుతుంది. 17340 గ్రామాలలో మూడు ఫేజులలో రీసర్వే పూర్తి చేస్తాం. మండలానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మొబైల్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తున్నాం’’ అని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment