
ముస్తాబైన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం నిర్వహించనున్న ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ సందర్భంగా శకటాలతో వివిధ శాఖలు ప్రదర్శన నిర్వహించనున్నాయి. ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆహ్వానితులు, పాస్‌లు ఉన్నవారు మంగళవారం ఉదయం 8 గంటలకల్లా సభా ప్రాంగణంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అధికారులు కోరారు. అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ విందు(ఎట్ హోమ్) ఏర్పాటు చేశారు. సీఎం జగన్, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం
వేడుకలకు ఏర్పాట్లు..
రాష్ట్ర హైకోర్టు, శాసన మండలి, శాసనసభ, సచివాలయ ప్రాంగణాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. త్రివర్ణ పతాక రంగుల విద్యుత్ దీపాలతో ఆ భవనాలను ముస్తాబు చేశారు. కాగా, మంగళవారం ఉదయం 7.45 గంటలకు శాసన మండలి వద్ద మండలి చైర్మన్ మోషేన్‌రాజు, ఉదయం 8.15 గంటలకు శాసనసభ వద్ద స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉదయం 7.30 గంటలకు రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అలాగే నేలపాడులోని హైకోర్టు వద్ద ఉదయం 10 గంటలకు జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ పాల్గొని.. మువ్వన్నెలజాతీయ జెండాను ఎగురవేస్తారు.